Thursday, July 21, 2005

నిజమే కానీ ప్రభూ....

హాస్యం కథ
నిజమే కానీ ప్రభూ....
- ములగాడ సురేష్‌కుమార్‌

'మంచిప్పల సూరయ్యా', 'మంచిప్పల సూరయ్యా', 'మంచిప్పల
సూరయ్యా'
దేవలోకంలో దేవుని కోర్టు హాలు ముందున్న ద్వారపాలకుడు కమ్‌ కోర్టు బంట్రోతు కంఠం మూడుకి ఆరుసార్లు మారుమోగింది.
'వచ్చె వచ్చె'
'ఇక్కడే ఉండి పలకవేమయ్యా'
'మూడు మార్లు పిలవడం రివాజు కదా. అయినా రెక్కలు విరిచి పట్టుకున్న ఈ రాక్షసభటులు వదిలితే కదా. మంచీ మర్యాదా లేదు'
'ఒకటికి వంద మాట్లాడుతున్నావు. ఏమా తలబిరుసుతనం?'
'ఎవరయ్యా ఎక్కువ మాట్లాడుతున్నది? ఒకటి సరిపోతే ఒకటే మాట్లాడతాను. వంద అవసరమైన చోట వంద మాట్లాడతాను. హలో, యిలా చూడు, సూరయ్యని తక్కువ అంచనా వేయొద్దు'
'అటులనా? నీ సంగతి ఇప్పుడే తేల్చెదము'
'ఏంటి తేల్చేది. ముందు నన్ను యిక్కడికి ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి'

'నిశ్శబ్దము నిశ్శబ్దము' హాలు ముందు వైపు నుంచి ఎవరో భటుడు హెచ్చరిక చేశాడు.
'ఎవరూ మాటలాడరాదు. స్వామివారు వేంచేయుచున్నారు'
పరివారమంతా లేచి నిలబడ్డారు.
హాలంతా ఒక్కసారిగా అద్భుతమైన వెలుగు పరుచుకుంది. దేదీప్యమానంగా వెలిగిపోతూ దేవుడు హాలులో ప్రవేశించి ఉన్నతాసనం పైకి చేరుకున్నాడు.
ఆయన కూర్చున్న తర్వాత మిగిలినవారు కూర్చున్నారు. దేవుడు సైగ చేయగా అంతసేపూ వాదిస్తున్న చిత్రగుప్తుడు గబగబా ముందుకు నడిచి దేవుడి పక్కగా నిలబడ్డాడు.
'ఈనాడు ఎందరు?'
'ఒక్కరే ప్రభూ'
'ఒక్కరేనా?'
'అవును ప్రభూ'
'ఆరంభింపుము'
పెద్ద శబ్దంతో భేరీ మోగింది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది.
'పాపిని ప్రవేశపెట్టుము'
అప్పటివరకు ఒక పక్కగా రెక్కలు విరిచి పట్టుకున్న నన్ను సభా మధ్యానికి ఈడ్చుకుపోయారు.
పక్కగా నిలుచున్నంత సేపు కొద్దిగా బాగానే ఉందిగాని ఇలా మధ్యకు తీసుకొచ్చి ప్రదర్శనగా నిలబెడితే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. పైగా ఇప్పుడు చిత్రగుప్తుడు పాపీ అని సంబోధిస్తున్నాడు.
ఇక్కడున్న వాళ్లందరూ పాపులు కారా?
దేవుడి సంగతి ఏమోగాని మిగిలిన వారి జాతకాలన్నీ మహాత్ముడు ఎన్టీఆర్‌ ఏదో సినిమాలో గడగడా చెప్పి అందర్నీ గడగడలాడించెయ్యలేదూ? అప్పుడే మర్చిపోయారా? చప్పున గుర్తు రావడం లేదుగాని లేకపోతే ఆ డైలాగులు మళ్లీ చెప్పి ఉందును కదా?
'ఏమిటి ఈతని నేరములు'
'మాట యిచ్చి తప్పడం స్వామి'
'ఇచ్చిన మాట తప్పుటయా?' అదేమంత తప్పు కాదన్నట్టుగా స్వామి స్వరం ధ్వనించింది.
'అవును ప్రభూ. ఇప్పటికి వందసార్లు అలా మాట యిచ్చి, ఒట్లు వేసి మరీ తప్పాడు ప్రభూ. అదీ మరెవరికో కాదు'
'ఎవరికి?'
'తమకే ప్రభూ. మీకు ప్రమాణం చేసి ఇచ్చిన మాటను తప్పాడు ప్రభూ'
'అదేమిటో వివరంగా చెప్పు'
'చిత్తం ప్రభూ! క్రీ.శ. 1930లో భూలోకంలోని దక్షిణ భారతదేశంలో, ఆంధ్రావని గుండెచప్పుడు, అదే హార్టుబీటైన హైదరాబాదులో'..
'చిత్రగుప్తా'
'అయ్యా'
'అంతొద్దు'
'పాయింటుకి వస్తున్నాను ప్రభూ. ఈ పాపి తనకి ఇరవై ఏళ్ల వయసప్పుడు అనగా 1950లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళుతూ తమకు తొలి ప్రమాణం చేశాడు ప్రభూ'
'ఏమని?'
'ఉద్యోగం వస్తే నడిచి తిరుమల వచ్చి తలనీలాలతో పాటు నిలువు దోపిడీ ఇస్తానని'
'ఇచ్చాడా'
'లేదు ప్రభూ'
- ఈ చిత్రగుప్తుడు టూమచ్‌గా ఉన్నాడే. ఎప్పుడో యాభై ఏళ్ల కిందటి మాట ఇప్పుడు తవ్వి తీసి చెప్పాలా? ఉద్యోగం వచ్చిన వెంటనే వెళ్లడానికి డబ్బులుండొద్దూ? నెల జీతం రాగానే వెళ్దామనుకున్నాను. నిలువు దోపిడీకి ఉత్త చేతులతో వెళ్లలేం కదా. ఆ తరువాత కొత్త ఉద్యోగం సెలవు యివ్వం అని అంటే వెళ్లలేదు.
'తరువాత?'
'ఈ పాపికి పెళ్లి కుదిరింది ప్రభూ. కొత్త భార్యను తీసుకొని కొండకొస్తానని రెండవసారి మొక్కినాడు ప్రభూ'
'అప్పుడూ రాలేదా'
'లేదు ప్రభూ'
- ఇదిగో చిత్రగుప్తా. జరిగింది జరిగినట్టు చెప్పవేం? హనీమూన్‌ అదీ ఏం వద్దు కొండమొక్కు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది, అక్కడికే టిక్కట్లిప్పించండి అని చెప్పనే చెప్పాడు మామకి. ఇదిగో అదిగో అన్నాడు. ఈలోగా వాళ్లమ్మగారు, ముసలామె బాల్చీ తన్నేసింది. ప్రోగ్రాం కేన్సిల్‌. అది చెప్పవేం?
'మొదటి కాన్పులో కొడుకు పుడితే తప్పక వస్తానని, ముచ్చటగా మూడవసారి మొక్కాడు ప్రభూ'
- అలా అన్యాయంగా మాట్లాడకు చిత్రగుప్తా. పుట్టగానే తీసుకెళ్లకపోయినా పుట్టు వెంట్రుకలు తీయించడానికి వాళ్ల తాతగారు తిరుపతి మొక్కు ఉందంటే వెళ్లి వచ్చాం కదా. అది చాలదా?
'అలా మొదలైన మొక్కుల పర్వం కొడుక్కి ఫలానా స్కూల్లో సీటు వస్తే అది చేస్తానని, ఉద్యోగంలో ప్రమోషన్‌ వస్తే యిది చేస్తానని, ఇల్లు కడితే ఒకసారి, భార్యకు జబ్బు చేసినప్పుడు మరోసారి, బండి మీద నుంచి పడి కాలు విరగ్గొట్టుకున్నప్పుడు యింకోసారి, సొంతంగా వ్యాపారం ప్రారంభించినప్పుడు, కొడుకుని అమెరికా పంపించినప్పుడు...'
ఊపిరి తీసుకోవడానికి ఆగాడు చిత్రగుప్తుడు.
- ఓరి వీడి అసాధ్యం కూల. ఎంత పక్కాగా లెక్క రాసుకుంటున్నాడు ఈ ముసలి చిత్రగుప్తుడు. ఇంత డేటా ఇంత పర్‌ఫెక్టుగా మెయింటెయిన్‌ చేస్తున్నాడంటే వీడి కంప్యూటర్లో చాలా మంచి సాఫ్ట్‌వేర్‌ ఉన్నట్టుంది. వెళ్లేప్పుడు అడిగి మరీ తీసుకెళ్లాలి. పెద్దాడు దాన్ని బాగా డెవలప్‌ చేసి తను డెవలప్‌ అయిపోతాడు.
'కూతురిని పెళ్లివారు చూడ్డానికి వచ్చినప్పుడు, ఆమెకి ఆ సంబంధం కుదిరినప్పుడు, చిన్నకొడుకు పెళ్లాం ఆస్తి పంపకంపై గొడవ పెట్టినప్పుడు'
వింటున్న దేవుడు అప్రయత్నంగా ఆవ
లించాడు.
'అలా ఇప్పటికి వంద మొక్కులు మొక్కి, ఏ ఒక్కటీ నెరవేర్చలేదు ప్రభూ' దేవుడి అనాసక్త అవస్థ చూసి ముగించేశాడు చిత్రగుప్తుడు.
'అంతేనా చిత్రగుప్తా' దేవుడి గొంతులో ఓస్‌ ఇంతేనా అన్నట్లనిపించి కేసు కొట్టేస్తాడేమోనని ఆనందం కలిగింది.
'తమకే కాక ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, తనతో లావాదేవీలు నిర్వహించిన ప్రతిఒక్కరితోనూ ఎన్నో సందర్భాలలో అది చేస్తానని ఇది చేస్తానని వాగ్దానం చేసి మాట తప్పినట్టుగా నా దగ్గర రుజువులు ఉన్నాయి ప్రభూ'
- ఈ చిత్రగుప్తుడు శిక్ష పడేదాకా వదిలేట్టు లేడు. ఇతణ్ణి ముందే మేనేజ్‌ చేసుకోవలసింది.
'సరి సరి. ఇతగాడు శిక్షార్హుడే అని మేము విశ్వసించుచున్నాము. ఇతనికి తగిన శిక్ష ఏమీ?'
'సలసల కాగుతున్న పామోలిన్‌ ఆయిల్‌లో ముంచి, మండుతున్న బొగ్గుల కుంపటిలో కాల్చి, సెయిల్‌ మేకులతో గుచ్చి, కుప్పం ఏనుగులతో తొక్కించి'..
'ప్రభూ' చిత్రగుప్తుడి లిస్ట్‌ పూర్తికాకముందే ఎలాగోలా గొంతు పెకలించుకుని అరిచాను.
'ఏమి?'
దేవుడు నావైపు చూడగానే నన్ను మాట్లాడనివ్వమని కళ్లతోనే వేడుకున్నాను.
'పలుకుము'
'ధర్మఫ్రభువులు. శిక్ష కరారు చేసే ముందు అవతలివారికి కూడా వారి వాదన వినిపించేందుకు అవకాశం యివ్వరా?'
'అవతలివారా, వారెవరు?'
'నేనే ప్రభూ'
'యివ్వను. నేరగానికి అవకాశం యివ్వడం అసంభవం. ప్రతి నేరగాడూ తను చేసే ప్రతి నేరానికీ తగిన కారణాలు ఉన్నాయనే అంటాడు. కారణాలు చెప్పుకుంటూ లోపాలను ఉపయోగించుకుంటూ నీతీ నిజాయితీ నిబద్ధతలకు మేలిముసుగులు కప్పుతూ భూలోకంలోలా ఇక్కడ మనగలగడం కుదరదు. మనుషులలో మానవీయతను నింపి, కట్టుబాట్లకు నిబద్ధులను చేసి, సామాజిక క్రమశిక్షణకు లోబడే విధంగా సత్సంప్రదాయపు జీవితం గడిపేలా చూడటం మా విధి. గాడి తప్పిన వాణ్ణి గాడ్‌ ఎలా క్షమిస్తాడురా మూర్ఖా? గాంధీని చంపిన గాడ్సే కూడా తను చేసిన ఘాతుకానికి పుంఖానుపుంఖాలుగా కారణాలు ఉన్నాయన్నాడు మీ భారతావనిలోనే ఒకనాడు. మేమది మర్చిపోలేదు'
'దేవా, మీరసలు దేవుడేనా? ఇక్కడున్న వారంతా దేవతలేనా?'
'స్వామీ. మీ స్పీచ్‌కి వీడికి మతి భ్రమించింది. తమ ఐడెంటిటీనే ప్రశ్నిస్తున్నాడు' చిత్రగుప్తుడు హోమగుండంలో నెయ్యి పోశాడు.
'ఏమా పిచ్చి ప్రేలాపన' దేవుని కంఠం గర్జిం చింది.
'మన్నించండి మహాప్రభూ. ఏదో తొందరలో అనేశాను. దేవ దేవ ధవళాచల మందిర, గంగాధరా హర నమో నమో'
'పాటొద్దు. పాయింటుకు రా' దేవుడి స్వరంలో తీవ్రత తగ్గింది.
'భగవాన్‌, రక్షకుడా, కరుణామయా'
'ఏమిటీ సినిమా టైటిల్సు. విషయం చెప్పవయ్యా'
'దేవా. కొండకు రాలేదని, గుండు చేయించలేదని, నిలువు దోపిడీలు యివ్వలేదని ఇంకా మొక్కులు తీర్చలేదని దేవుళ్లే లెక్కలు రాసి శిక్షలు వేస్తే ఇంక దేవుళ్లని దేవుళ్లనడం ఎందుకు స్వామీ. మేమిది ఇస్తే మీరది ఇస్తారని మీరు బోర్డు పెట్టి లోకాలను పాలిస్తున్నట్టు మేము నమ్మవచ్చు కదా. అప్పోసప్పో చేసేసి నీ మొక్కు తీర్చేస్తే మనిషి కోరుకున్నవన్నీ జరిగిపోవాలి కదా. మేము మొక్కులు చెల్లించలేదని మీరంటున్నారే మరి మీరు తీర్చని మొక్కుల సంగతి ఏమిటి? ఎన్ని మొక్కులు మొక్కినా ఒక్కటీ తీరలేదు అనే వాళ్ల పరిస్థితి ఏమిటి? అది మీ నేరం కాదా?'
'ప్రభువులతో ఏమిటీ లా పాయింట్లు? మొక్కు లు మొక్కుటయే మీ వంతు. వాటిని నెరవేర్చుటయా లేకుంటే రిజెక్ట్‌ చేయుటయా అనేది ప్రభువుల వంతు. మొక్కు నెరవేరినా లేకపోయినా మీరు మొక్కు తీర్చాల్సిందే. మాట ముఖ్యం. ఫర్‌ ఎగ్జాంపుల్‌....'
'చిత్రగుప్తా. ఆపుము. ఇతను వ్యాపారి. ఇతనికి అర్థమయ్యే ఎకానమీ భాషలోనే చెప్తాను. సూరయ్యా. విను. డబ్బు, మనిషి, వ్యవస్థా.. వీటి నడుమ సంబంధం తెలుసుకో. మనిషి తనకు కావలసిన సౌకర్యాలను కల్పించడం కోసం వ్యవస్థను తయారు చేశాడు. వ్యవస్థ నడవడానికి డబ్బు కావాలి. డబ్బు మనిషి సంపాదించాలి. అందుకోసం పని చేయాలి. పని వ్యవస్థ కల్పించాలి. ఇదొక చక్రవ్యూహం. ఈ వ్యూహంలో మనిషి ఒక్కడికే బుర్ర ఉంది. ఆలోచించి ఆచరించే సమర్థత ఉంది. అతడు తన ధర్మం విస్మరించాడా వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. వ్యవస్థ ముక్కలైందా? డబ్బు గల్లంతవుతుంది. అందువల్ల మనిషికి క్రమశిక్షణ ముఖ్యం. దానిని పెంపొందించేదే దైవచింతన. దైవత్వం అంటే కర్తవ్య పాలన. మనిషి ఈ కర్తవ్య పాలనను మాట తప్పకుండా క్రమశిక్షణతో చెయ్యడమే మనిషి, డబ్బు, వ్యవస్థ పని చేయడానికి మూలకారణం. దేవుడు ఇదంతా గమనిస్తుంటాడు. మనిషి ఈ నియంత్రణలో ఉండేలా చేస్తాడు. అలాగే మొక్కుల రూపంలో మీరు యిచ్చింది మళ్లీ మీకే ఇస్తూ సర్క్యులేషన్‌ చేస్తుంటాడు.'
'మహాప్రభో.. ఇక ఆపండి. అజ్ఞానం అంధకారంలా కమ్ముకొచ్చి నా కర్తవ్యాన్ని అలక్ష్యం చేశాను. ఒక్క ఛాన్సు యివ్వండి. భూలోకానికి వెళ్లి నా వాగ్దానాలు, యిచ్చిన మాటలు, చేసిన మొక్కులు తీర్చుకొని వస్తాను.'
'వద్దు ప్రభూ వద్దు. ఇలాగే కొందరిని గతంలో మీరు మన్నించి ఒక్క ఛాన్సు యిచ్చి భూలోకానికి పంపారు. వాళ్లంతా రాజకీయ నాయకులై మిమ్మల్ని, ప్రజల్ని నిలువునా ముంచారు. మళ్లీ అటువంటి నిర్ణయం తీసుకోకండి స్వామీ' చిత్రగుప్తుడు వాదిం చాడు.
దేవుడు ఒకసారి చుట్టూ పరికించి చూశాడు.
'తర్జనభర్జనలతో శిరోభారం కలిగినది. శిక్ష కరారు చేయ ఏకాగ్రత కుదురుట లేదు. అట్లని క్షమించి విడిచిపెట్టుట న్యాయసమ్మతంగా తోచుట లేదు. కనుక కేసును తిరిగి జాగ్రత్తగా ప్రవేశపెట్టవలసిందిగా ఆదేశించుచున్నాను'
దేవుడు లేచి వెళ్లిపోయాడు.
వెలుగూ ఆయనతో పాటే వెళ్లిపోయింది.
'అంటే వెళ్లిపోవచ్చా?'అడిగాను.
'మళ్లీ పిలుస్తారులే' అన్నాడు చిత్రగుప్తుడు.
ఆనందంతో ఎగిరి గంతేసి ఒక్కసారిగా కిందకు దూకాను.
***
వెనక్కి వచ్చిన నాకు యిల్లంతా ఏదో తేడాగా బోసిపోయినట్టుగా అనిపించింది. లోపలికి చూశాను.
హాల్లో నా ఫోటో. ఫోటో ముందు దీపం.
'నిద్రలోనే పోయాడు నా బిడ్డ.. రోజూ పొద్దున్నే లేచి అందర్నీ లేపేవాడు. ఇవ్వాళ ఎవరు లేపినా లేవలేదు. చిన్నాడు డాక్టరు కదా, వెంటనే పిలిపిస్తే వచ్చి చూశాడు, అప్పటికే నాడి కొట్టుకోవడం ఆగిపోయిం దట' ఏడుస్తూ ముక్కు చీదడానికి ఆపింది తల్లి.
'అందరూ ఏటి ఒడ్డుకు వెళ్లారమ్మా. పెద్దాడికి ఫోన్‌ చేస్తే పదోనాటికి వస్తానన్నాడు. కూతురూ అల్లుడూ చిన్నరోజుకి వస్తామన్నారు. దూరాభారం కదా, ఇంకా ఉంచడమెందుకులే అని అన్నీ చిన్నాడి చేతనే కానిచ్చేశాము. అలా కూర్చోండి. అయ్యో నా బిడ్డా'... మళ్లీ శోకాలు మొదలెట్టింది.
చిత్రగుప్తుడి తెలివి అర్థమైంది.
సోల్‌ ఉంది, బాడీ లేదు.
ఇది కండిషనల్‌ బెయిల్‌. మళ్లీ వెంటనే వెళ్లిపోక తప్పదు.
చేసిన తప్పులు సవరించుకుని, యిచ్చిన మాటలు నెరవేర్చుకోవడానికి నాకు యింకో ఛాన్స్‌ లేదు. యివ్వలేదు.
హతోస్మి.
బయట ఎవడో పాట వేశాడు.
'మానవా ఏమున్నది ఈ దేహం, ఇది రక్తమాంసముల అస్థిపంజరం దీనిపై ఎందుకురా వ్యామోహం'
దండ వేసున్న ఫోటో వైపే చూస్తూ ఉండిపోయాను ఆత్మరూపంలో ఆత్మపరిశీలన చేసుకుంటూ.
నాస్తిక భర్త
జె.యు.బి.వి.ప్రసాద్‌

అత్తా, కోడళ్ల నోముల ప్రహసనం మోహన్‌కి బాగా తెలుసు. ఏవో వాళ్ల నమ్మకాలు వాళ్లవి అని వదిలేశాడే గానీ, ఆ పూజలూ గట్రా నచ్చేవి కావు. ఆ నోముల వల్ల మోహన్‌కి వచ్చిన కొత్త కష్టం ఒకటుంది.

'మా ఆయన నాస్తికుడు తెలుసా? దేవుడి మీద నమ్మకం లేదాయనకు' అతిశయంగా నవ్వుతూ అంది సునంద తన స్నేహితురాలు లక్ష్మితో.
'అవునా?' అంది లక్ష్మి ఓరకంట మోహన్‌ వైపు చూస్తూ, కొంచెం నొసలు చిట్లిస్తూ.
ఏమనాలో తెలియక భావరహితంగా చూశాడు మోహన్‌. నాస్తికత్వం కూడా ఒక క్వాలిఫికేషన్‌ లాంటిదని అతనికి తెలియదు. సునందకూ, మోహన్‌కూ పెళ్లయి నెల రోజులయింది. విజయవాడలో చుట్టాలింట్లో పెళ్లి ఉందని హైదరాబాద్‌ నుంచి రైల్లో వెళుతున్నారు. లక్ష్మి సెండాఫ్‌ ఇవ్వడానికి స్టేషన్‌కి వచ్చింది.
ఇంతలో గార్డ్‌ విజిల్‌ వూదడమూ, రైలు కదలడమూ జరిగాయి.
జీవిత భాగస్వామిని వెతుక్కోవడం చేతగాక, ఆ విషయం మోహన్‌ తల్లిదండ్రులకే వదిలేశాడు. 'నా కాబోయే భార్య నాలాగే నాస్తికురాలయి ఉండాలి' అని ఒకే ఒక షరతు పెట్టాడు, తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నప్పుడు.
ఊహ తెలిసినప్పటి నుంచీ, పద్దెనిమిదేళ్ల వరకూ మంచి భక్తుడిగానే పెరిగాడు. ఆ తరవాత పుస్తకాలు చదవడం నేర్చుకుని, అరకొర నాస్తికుడిగా తయారయ్యాడు. నాస్తికత్వం పూర్తిగా అర్థం గాకపోయినా, దేవుడి మీద నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకున్నాడు ముందుగా.
'సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆడపిల్లలెవరూ నీలా నాస్తికుల్లా ఉండరు. పిచ్చి పుస్తకాలు చదివి నువ్విలా పాడయిపోయావు. ఇలాంటి వెర్రి, మొర్రి షరతులు పెడితే నీకు పిల్లనెవరూ ఇవ్వరు, తెలుసా!' అంటూ తల్లి భయపెట్టింది.
దానికి వంత పాడారు అక్కా బావలు.
పెళ్లి కాకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందేమోనన్న భయంతోనూ, దేవుడిని నమ్మే ఆడపిల్లలు కూడా మంచితనంతో ఉంటారనే నమ్మకంతోనూ తన షరతుని వదులుకున్నాడు చివరికి.
పెళ్లి చూపుల్లో తను సునందతో ఒంటరిగా మాట్లాడాలంటే, పెద్ద వాళ్లు కాస్త ఏకాంతం కల్పించారు.
'నాకు దేవుడి మీద నమ్మకం లేదండీ! నేను నాస్తికుడిని. మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మీకీ విషయం ముందే తెలియాలని చెప్తున్నాను' అన్నాడు మోహన్‌.
అతని నిజాయితీకి సునంద ముచ్చటపడిపోయింది.
'మీ ఫ్రాంక్‌నెస్‌ నాకు చాలా నచ్చింది. ఇంతమంది మనుషులు దేవుడున్నాడని నమ్ముతున్నారు కాబట్టి దేవుడున్నాడనే నా విశ్వాసం. మీరు నమ్మకపోయినా నాకు అభ్యంతరం లేదు!' నవ్వుతూ చెప్పింది.
అంతే! ఆ నాస్తికుడికీ, ఆ ఆస్తికురాలికీ పెళ్లయిపోయింది. సాంప్రదాయబద్ధంగా కాకుండా, సింపుల్‌గా రిజిస్టర్‌ మేరేజీ చేసుకోవాలన్నది మోహన్‌ కోరిక. దానికి ఇరువైపుల వారే కాకుండా, సునంద కూడా ఒప్పుకోలేదు. పట్టుచీరలు కట్టుకుని, నగలు పెట్టుకోవాలన్నది ఆ అమ్మాయి సరదా.
గత్యంతరం లేక అందరిష్ట ప్రకారం శాస్త్రోక్తంగా సునంద మెళ్లో తాళి కట్టాడు.
'ఎప్పుడూ ఈ మంగళసూత్రం మెళ్లోనే వేసుకుంటావా, లేక అప్పుడప్పుడూ తీసేస్తావా?' కుతూహలంగా అడిగాడు పెళ్లయిన మర్నాడు.
'అమ్మో, ఇంకా నయం. నేను బతికున్నంత కాలమూ ఈ మంగళ సూత్రం నా మెళ్లోనే ఉంటుంది' అంది భక్తిగా మంగళసూత్రాన్ని కళ్లకద్దుకుంటూ.
అలా అని చెప్పి 'పతివ్రత'లా మోహన్‌ని నెత్తి మీద పెట్టుకున్నదీ లేదు. కాస్త ఎక్కువ, తక్కువలొస్తే చాలు ఉతికేసేది మాటల్తో మోహన్‌ని.
'ఆ మెళ్లో మంగళసూత్రం మీదున్న భక్తి, అది కట్టిన నా మీద లేకుండా పోయింద'ని వాపోయాడు మోహన్‌.
చుట్టాలింట్లో పెళ్లయ్యాక అడిగింది సునంద.
'ఏమండీ! సాయంకాలం నన్ను కనకదుర్గ గుడికి తీసుకెళ్లండీ!'
గతుక్కుమన్నాడు మోహన్‌.
నాకు దైవ నమ్మకాలు లేవని నీకు తెలుసు కదా. నన్ను గుడికి రమ్మంటావేమిటీ?
'ఒకసారి గుడికి వస్తే ఆస్తికుడిగా మారిపోతారని మీకేమన్నా భయమా? మనూళ్లో అయితే అడిగే దాన్ని కాదు కదా! కొత్త ఊరు కాబట్టి మీ మీద ఆధారపడుతున్నాను. ఒక్కసారి నాతో గుడికి వస్తే మీకేమీ వ్రత భంగం కలగదులెండి!' కొంచెం బతిమాలుతున్నట్లుగా అంది.
సునంద లాజిక్‌కి జవాబేం చెప్పాలో తెలియలేదు మోహన్‌కి. అయిష్టంగానే బయలుదేరాడు గుడికి. మోహన్‌కి ఇంకో కోరిక ఉండేది, పెళ్లికి ముందర. అందువల్ల పెళ్లి చూపుల్లో సునందని, 'ఏమండీ, మీరు పెళ్లయ్యాక కూడా నన్ను 'ఏమండీ' అనే పిలుస్తారా, లేక పేరు పెట్టి పిలుస్తారా?' ఆశగా అడిగాడు.పేరు పెట్టి పిలిపించుకోవాలని మోహన్‌కి తపన.
ఓ వెర్రి వెధవని చూసినట్లు చూసింది సునంద.
జనరల్‌గా అంతే కదండీ! మా అక్కలంతా వాళ్ల భర్తలని 'ఏమండీ' అనే పిలుస్తారు. మా అమ్మా అంతే! జనరల్‌గా నేనూ అంతే.
ఉసూరుమనిపించింది మోహన్‌కి. ఆ కోర్కెకి కూడా నీళ్లొదిలేసుకున్నాడు. కానీ పెళ్లయ్యాక, ఒంటరిగా ఉన్నప్పుడు 'నువ్వు' అనీ, ఎవరైనా ఉన్నప్పుడు 'ఏమండీ' అని సంబోధించేది సునంద మోహన్ని. అది నచ్చక, 'ఆ రెండు పిలుపుల్లో ఏదో ఒకటి సెటిల్‌ చేసుకో! ఇలా రెండు రకాలుగా పిలవడం నాకు నచ్చదు' అని చెప్పాడు.
'ఏంటీ? నలుగురిలో 'నువ్వు' అని పిలవడమా? మీ అమ్మగారు చంపెయ్యరూ నన్ను?' అంటూ నెపాన్ని అత్తగారి మీదకి నెట్టేసి 'ఏమండీ' అనే పిలుపుతో సెటిల్‌ అయిపోయింది సునంద. దానికే అలవాటు పడిపోయాడు మోహన్‌ కూడా.
గుళ్లో సునంద పక్కనే నించున్నాడు చుట్టూ చూస్తూ.
కాస్త దణ్ణం పెట్టుకోండి అని గొణుగుతూ మోచేత్తో పొడిచింది సునంద.
దణ్ణం పెట్టుకోకుండా, సీరియస్‌గా చూసి, గుడి బయటకి వచ్చేశాడు. రుసరుసలాడుతూ వెనకే వచ్చింది సునంద. ఏదో అనబోయి సీరియస్‌గా ఉన్న భర్త మొహం చూసి, కాస్త జంకి ఊరుకుంది.
మర్నాడు ఇద్దరూ కలిసి హైదరాబాద్‌ వచ్చేశారు. రోజులు మామూలుగానే ఎగుడు, దిగుడు దారిలో పోతున్నాయి. ఆ రోజు మోహన్‌ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి, ముందు గదిలో సునందా, అతని తల్లీ విచారంగా కూర్చుని కనిపించారు. ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనని భయపడ్డాడు.
ఏవయిందీ? ఎందుకు మీరిద్దరూ దిగులుగా కూర్చున్నారూ? బెతుగ్గానే అడిగాడు మోహన్‌.
ఇప్పుడో సమస్య వచ్చిందండీ, విచారంగా అంది సునంద.
ఏమిటా సస్పెన్సూ, అసలు విషయం చెప్పండి... విసుక్కున్నాడు.
అది కాదురా! ఇది శ్రావణ మాసం. మీ పెళ్లయ్యాక వచ్చిన మొట్టమొదటి శ్రావణ మాసం. సునంద నోములు నోస్తోందని నీకు తెలుసు కదా... అని చెప్పి కాస్త ఆగింది తల్లి.
అత్తా, కోడళ్ల నోముల ప్రహసనం మోహన్‌కి బాగా తెలుసు. ఏవో వాళ్ల నమ్మకాలు వాళ్లవి అని వదిలేశాడే గానీ, ఆ పూజలూ గట్రా నచ్చేవి కావు. ఆ నోముల వల్ల మోహన్‌కి వచ్చిన కొత్త కష్టం ఒకటుంది.
మొదటి నోము నోచుకున్నపుడు అమ్మవారి పూజ అవగానే, మోహన్‌ చేతిలో అక్షింతలు పెట్టి, అతను తెల్లబోయ చూస్తుండగా, వంగి అతని పాదాలకు దణ్ణం పెట్టబోయింది సునంద.
పాము తగలబోతున్నట్లుగా ఒక్క గంతు వెనక్కేశాడు మోహన్‌.
'ఇదేమిటీ, ఇదేమిటీ? ఇలాంటివి నాకిష్టం లేదు' అన్నాడు గబ గబా.
'నోము నోచాక, భర్త కాళ్లకి దణ్ణం పెట్టకపోతే అరిష్టం. అత్తయ్యగారూ చూడండీ, మీ అబ్బాయి దణ్ణం పెట్టనివ్వడం లేదు నన్ను...' అంటూ కంప్లయింటు చేసింది.
తల్లి వచ్చి మోహన్‌ని గట్టిగా పట్టుకోవడం, సునంద వెంటనే మోహన్‌ కాళ్లకి దణ్ణం పెట్టేయడం, మోహన్‌ బిత్తరపోయి చూస్తూ ఉండటం జరిగిపోయాయి.
అక్షింతలు వెయ్యలేదండీ, గొణిగింది సునంద.
ఫర్వాలేదులే, దణ్ణం పెట్టావుగా! వీడొక మొండి వెధవ అంటూ అత్తగారు లోపలికి వెళ్లిపోయింది.
తర్వాత వారం, సునంద పూజలో ఉండగానే మోహన్‌ ఇంట్లోంచి పారిపోయాడు, మళ్లీ ఎక్కడ సునంద చేత దణ్ణం పెట్టించుకోవాల్సి వస్తుందోనని.
సాయంత్రం ఇంటికొచ్చేసరికి గుమ్మంలోనే కన్నీళ్లతో ఎదురయ్యింది సునంద.
నీకంత బుద్ధి లేదేమిట్రా? భర్తకి దణ్ణం పెడితే గానీ నోము అయినట్లు కాదని అమ్మాయి కిందటి వారమే చెప్పింది కదరా! పొద్దున్నించీ ఏమీ తినకుండా, నీ కోసం చూస్తూ కూర్చుంది. నీకు దణ్ణం పెట్టి, నోము పూర్తయితేనే ఎంగిలి పడుతుంది. నీకంత మంకు పట్టుదల ఎందుకూ?... చీవాట్లేసింది తల్లి.
అవాక్కయిపోయిన మోహన్‌ కాళ్లకి చప్పున దణ్ణం పెట్టేసి వంటిం ట్లోకి వెళ్లిపోయింది సునంద. అప్పటినుంచీ గొడవ చెయ్యకుండా, లొంగి దణ్ణాలు పెట్టించుకుంటూ వచ్చాడు మోహన్‌.
ఇప్పుడు మీ నోములకేం కష్టం వచ్చింది? కాస్త కినుకగానే అడిగాడు.
అతని కినుకని పట్టించుకోలేదు అత్తా, కోడళ్లిద్దరూ.
'అది కాదండీ. అత్తయ్యగారికి అర్జెంటుగా వూరు వెళ్లే సందర్భం వచ్చింది. నోము రోజు సాయంకాలంగానీ తిరిగి రాలేరు. అసలే ఇది ఆఖరి వారం, చాలా ముఖ్యం కూడా! నా చేత నోము ఎవరు నోయిస్తారూ? అదీ అసలు సమస్య' చాలా దిగులుగా చెప్పింది సునంద.
'నీ అంతట నువ్వు నోము నోచుకోలేవా?' అడిగాడు. మోహన్‌కి అప్పటికే నోము మీద సహనం ఏర్పడిపోయింది.
'ఒక్క మనిషీ అంత పని ఎలా చేసుకుని పూజ చేసుకోగలదురా పొద్దున్నే? కాస్త మనిషి తోడు వుండొద్దూ?' అంది తల్లి కోడలికి సపోర్టుగా.
అర్థం కానట్టు చూశాడు మోహన్‌.
'మీరు కొంచెం సాయం చేస్తే, ఈ వారం గట్టెక్కించేస్తానండీ' బతిమాలుతూ అంది సునంద.
తెల్లబోయాడు మోహన్‌.
'నేనేం చెయ్యగలనూ?' ఆశ్చర్యంగా అడిగాడు.
'ఆ రోజు పొద్దున్నే లేచి, స్నానం చేసి, కొంచెం అమ్మవారికి వంట చేసి పెట్టాలి. ఆ లోపల నేను అమ్మవారిని తయారు చేసి, పూజ చేస్తాను. ఈ ఒక్కసారికీ సాయం చెయ్యండీ. ఇంకెప్పుడూ అడగనుగా మిమ్మల్ని' ఎంతో ప్రాధేయపడుతూ అంది సునంద.
తల్లి కూడా జాలిగా చూసింది కొడుకు వేపు. అంతే. మోహన్‌ మనసు ద్రవించిపోయింది.
నోము రోజు పొద్దున్నే నాలుగ్గంటలకి అలారం మోతతో లేచాడు. కళ్లు మండుతూండగానే స్నానం గట్రా కానిచ్చాడు. సునంద కూడా లేచి వంటగదిలోకి వచ్చి, పూజా మందిరం దగ్గర కూర్చుంది. మందిరాన్ని, దేవుడి పటాలను, విగ్రహా లనూ శుభ్రం చెయ్యడం, పూజ సామాగ్రి సమకూర్చడం మొదలుపెట్టింది.
'సతీవ్రతుడి'లాగా మోహన్‌ మామిడికాయ పప్పూ, వంకాయ కూరా, దోసకాయ పచ్చడీ, పులుసూ, అన్నం వండాడు. పులిహోర చేశాడు. పూర్ణం బూరెలూ, గారెలూ వండాడు. రుబ్బడాల్లోనూ, కూరలు తరగడంలోనూ, గిన్నెలు తొలవడం లోనూ సాయం చేసింది సునంద. మొత్తానికి వంట పూర్తయ్యేసరికి ఒళ్లు హూనం అయిపోయింది మోహన్‌కి. అప్పటికి పూజ మొదలుపెట్టింది సునంద.
మామూలు తెలుగయితే వచ్చు గాని సంస్క­ృత పదాలు నోరు తిరగడం లేదు సునందకి. పూజ మంత్రాలన్నీ సంస్క­ృతంలో వున్నవాయే! అన్ని రోజులూ అత్తగారు చిన్నప్పటి నించీ వున్న అభ్యాసంతో చదివిపెట్టేది. ఇప్పుడు తనే కూడబలుక్కుంటూ చదివితే ఆ సంస్క­ృత పదాలు తనకే కర్ణకఠోరంగా వినిపిం చాయి. చదవడం ఆపి మోహన్‌ వేపు బాధగా చూసిం ది. మోహన్‌కి విషయం అర్థం అయింది. కాలేజీలో అతడు సంస్క­ృతం నేర్చుకుని ఉన్నాడు. అప్పటికే ఆ అక్షర దోషాలు వినలేక అవస్థపడుతున్నాడు.
ఇంకోసారి అడిగించుకోకుండా మంత్రాలన్నీ చదివి పూజ జరిపించాడు సునంద చేత. పూజ పూర్తి చేసి అమ్మవారికి మహా నైవేద్యం ఘనంగా పెట్టి సంతృప్తి చెందింది సునంద.
సాయంత్రానికి వచ్చిన తల్లి కొడుకుని బాగా మెచ్చుకుంది. సునంద కూడా బోలెడంత కృతజ్ఞత చూపింది. ఓ రెండ్రోజులు మోహన్‌ని రాజకుమారుడిలాగా చూసుకుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని కాస్త సంతృప్తి పడ్డాడు మోహన్‌ కూడా.
ఆ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి, ముందు గదిలో సునంద తన స్నేహితురాలు లక్ష్మితో మాట్లాడుతూ కనబడింది. లక్ష్మి వేపు పలకరింపుగా చూసి లోపల గదిలోకి వెళ్లాడు మోహన్‌. అక్కడకి వీళ్లు మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. మోహన్‌ వినాలని సునంద కొంచెం గొంతు పెద్దది చేసింది కూడా.
'నువ్వెన్నైనా చెప్పు లక్ష్మీ. ఈ నాస్తికులు మంచివాళ్లు. వాళ్లు మనల్ని మారమనరు. వాళ్లే మారతారు. మనకి అనుగుణంగా మారి, అన్నిట్లోనూ తోడుగా వుంటారు. మనమేం మారక్కలేదు. ఏ సాయమూ చేయని ఆస్తిక మొగుడి కన్నా అన్ని సాయాలూ చేసే నాస్తిక మొగుడే బెటర్‌' అంది సునంద.
ఆ మాటలు మోహన్‌కి ఆనందం కలిగిస్తాయని సునంద విశ్వాసం. అయితే అవే మాటలు మోహన్‌ని ఆలోచనల్లో పడేశాయి.
అలా స్నేహితురాలితో అనడంలో సునందకి వేరే ఉద్దేశం కూడా ఉంది. పెళ్లయినప్పటి నించీ భర్త తననెక్కడ మారమంటాడోనని సునం దకి గుబులుగానే ఉంది. ఈ విధంగా మాట్లాడితే తనకా యిబ్బంది ఉండదని ఒక ఆశ.
పెళ్లయిన మొదట్లో సునందని కొంచెం మార్చడానికి ప్రయత్నించాడు మోహన్‌. కొన్ని వ్యాసాలున్న పుస్తకాలిచ్చాడు చదవమని. కథల పుస్తకాలు, ముఖ్యంగా చెడ్డ మొగుళ్లు మంచి భార్యలని కష్టపెట్టే కథలున్న పుస్తకాలు చదివేది ఇష్టంగానే. అవి చదివేటప్పుడూ, చదివిన తరువాతా ఆ చెడ్డ మొగుళ్లని తిట్టి పోసేది బహిరంగంగా. ఆ తిట్లు ఆ పుస్తకాల్లోని పాత్రలకో, లేక జాగ్రత్తగా వుండమని ఇండైరెక్టుగా తనకో అర్థం అయ్యేది కాదు మోహన్‌కి. వారపత్రికల్లో సినిమా కబుర్లూ, కథలూ చదివేదిగానీ వ్యాసాలు చదివేది కాదు.
ఒకరోజు సాయంకాలం ఏదో పార్కుకి వెళ్లారు ఇద్దరూ. నెమ్మదిగా నాస్తిక ప్రస్తావన తీసుకువచ్చాడు మోహన్‌. పాత పాఠమే మళ్లీ ఒప్పచెప్పింది సునంద.
'ప్రపంచంలో ఎంతోమంది దేవుడున్నాడంటూ నమ్ముతున్నారు కదా. ఉండకుండా ఎందుకుంటాడు దేవుడు?' ప్రశ్నించింది సునంద.
'ప్రపంచంలో ఎంతోమంది భూమి గుండ్రంగా లేదని నమ్మేవారు మొదట్లో. ఏ విషయంలోనన్నా నిజం ఆ విషయం మీద ఆధారపడి వుంటుందిగానీ ఎంతమంది నమ్ముతున్నారని కాదుగదా' తర్కం చెప్పాడు మోహన్‌.
ఆ తర్కం అర్థమే కాలేదు సునందకు.
'మీరెన్ని చెప్పండి. నేను దేవుడిని నమ్మే తీరుతాను. మీరు నా నమ్మకాన్ని మార్చలేరు' అంది సునంద స్పష్టంగా.
ఏమీ మాట్లాడలేదు మోహన్‌. ఆ అమ్మాయిని 'మారూ మారూ' అని అనడానికి తనకేం హక్కు ఉందీ అని తర్కించుకున్నాడు. ఏ వ్యక్తయినా విజ్ఞానం సంపాదించుకుని దానితో మారాలే గానీ ఇంకో వ్యక్తి ప్రోద్బలంతో కాదు కదా.
స్నేహితురాలు లక్ష్మి వెళ్లిపోగానే లోపల గదిలోకి వచ్చింది సునంద.
'మీరు స్నానం చేసి వస్తారా, నేను అన్నాలు పెట్టేస్తానూ?' అడిగింది.
'అలాగే కానీ, నీకో విషయం చెప్పాలి' మెల్లిగా అన్నాడు మోహన్‌.
ఏమిటన్నట్టు చూసింది సునంద.
'రేపు టౌన్‌హాల్లో రామాయణ విషవృక్షం మీద మీటింగు ఉంది. ఆ పుస్తకం రాసిన రచయిత్రితో ముఖాముఖీ కూడా ఉంది ఆ సభలో. వెళదామనుకుంటున్నాను' చెప్పాడు.
గతుక్కుమంది సునంద.
'వెళదామనుకుంటున్నానంటే మీరొక్కరేనా, నేను కూడా రావాలా?'
'నేను వెళ్లడం ఖాయం. నువ్వు కూడా రాకూడదూ, బాగుంటుందీ? ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు కూడా' ఆశగా అడిగాడు.
'ఇంకా నయం. దేవుడి మీద యింత నమ్మకాన్ని పెట్టుకున్న నేను విషవృక్షం మీటింగుకి రావడం ఏమిటీ? నా కళ్లు పోవూ? అసలు మీరు కూడా వెళ్లడం ఎందుకూ? ఏవో ఆ పుస్తకాలు యింట్లో చదువుతూనే వున్నారుగా' గట్టిగా అడిగింది.
'అదేమిటీ, అలాగంటావూ? నాకు నమ్మకం లేకపోయినా నీ కోసం నేనెన్నిసార్లు దైవ కార్యాల్లో తలదూర్చలేదూ? నమ్మకం లేకపోయినా నువ్వూ నా కోసం రావొచ్చు కదా.'
'అదీ యిదీ ఒకటెలా అవుతుందీ? నమ్మకం లేకుండా చేసినా, అవి దైవ కార్యాలవడం చేత మీకు పుణ్యమే వస్తుంది. నమ్మకం పెట్టుకుని, నేను ఈ నాస్తిక సభలకి వస్తే నాకు పాపం వస్తుంది. అదీ తేడా.'
'ఈ పాపం, పుణ్యం నిర్వచనాలు నీకు గానీ నాకు కావు గదా. కాబట్టి నువ్వు అనుకున్నట్టు నేననుకోనుగదా.'
'మీరెలా అనుకున్నా సరే, ఈ నాస్తిక సభలకి రావడం నా వల్ల కాదు బాబూ. అంతగా కావలిస్తే, మీరొక్కరూ వెళ్లి రండి' స్థిరంగా చెప్పింది.
'నేను ఎలాగూ వెళ్లి తీరతాను. దాన్ని ఎవరూ ఆపలేరు. నా సమస్య అది కానే కాదు. ఇంతకాలం ఇన్ని విషయాల్లో నా నమ్మకాలకు విరుద్ధంగా నీ కోసం, కేవలం నీ కోసం లొంగాను. నువ్వు నా కోసం ఒక్కసారి ఎందుకు లొంగలేవూ అని.'
'ఈ లొంగడాలవీ మీ నాస్తికులకే వచ్చు. మా ఆస్తికులకి రావు బాబూ. మీరు 'ఫరవాలేదులే' అనో, మరోలాగో, మా కోసం అనో, మరో దాని కోసం అనో లొంగుతూ ఉంటారు. నమ్మకం లేకుండా ఎవరికోసమో గుడికి వెళ్లే నాస్తికులని చూడగలరు గానీ, గుడిని తగలబెట్టాలనే నాస్తిక సభలకి వెళ్లే ఆస్తికులని మీరెరుగుదురా? ఆ మనుషులతో సంబంధాలన్నా తెంపుకుంటాం గానీ అటువంటి సభలకి పోము బాబూ.'
ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది మోహన్‌కి.
'తెలివితక్కువగా అయినా చాలా కరెక్టుగా చెప్పావు. ఈ విధంగా మనుషుల కోసం లొంగడం అనే విషయం నాస్తికులే చేస్తున్నారు. ఆస్తికులు మాత్రం లొంగరు. లోపం నాస్తికుల్లోనే ఉంది. మా భావాల మీద మాకే గట్టి పట్టుదల లేదు. మా జ్ఞానంలో ఎక్కడో లోపం ఉంది. ఈ లోపాల్ని మేం సవరించుకోవడం లేదు గాబట్టి, మేం అంటే ఏ మాత్రమూ గౌరవం లేకుండా పోతోంది మీకు. నిజమే ముందరగా మారవలసింది మేమే.'
ఆ రోజు నుంచీ సునంద ప్రసాదం పెట్టినా తీసుకోవడం మానేశాడు. తన జ్ఞానాన్ని నాస్తికత్వానికే పరిమితం చెయ్యకుండా ఆస్తికత్వానికి గల మూలకారణల గురించి కూడా తెలుసుకోవడం మొదలెట్టాడు.

యజమాని

From July 2005 Vipula

యజమాని
సి.ఆర్‌.దాస్‌
ఇండో ఆంగ్లికన్‌ కధ
రామారావు ఒక ఇరుకు సందులోని మామిడిచెట్టు కింద కూర్చుని సైకిళ్లు రిపేరు చేస్తూ ఉంటాడు. ఒక పక్క చెక్కలతో చేసిన చిన్న గది ఉంది. ఆ గల్లీలో దొంగతనాలు, మోసాలు చేసి బతుకు వెళ్లదీస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. కొద్దిమంది మంచి ప్రవర్తన గలవారు మాత్రం చిన్న చిన్న పనులు చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

రామారావుకు సైకిళ్లు బాగుచెయ్యడంలో చెయ్యితిరిగిన పనివానిగా పేరుంది. అతను దారిద్య్రపు తిరగలిలో పడి నలుగుతున్నాడు. వున్న దరిద్రంతోపాటు తాగుడు అలవాటు అయింది. రిపేర్ల వల్ల వచ్చిన కాసిని డబ్బులూ తాగుడుకు ఖర్చుచేస్తాడు. అతని భార్య లక్ష్మి, కూతురు భవానీ కొన్ని ఇళ్లలో పనిపాటలు చేసుకుంటూ, ఆ ఇళ్లవారు మిగిలిపోగా ఇచ్చిన ఆహారాన్ని తింటున్నారు. వచ్చే కొద్దిపాటి జీతంతో వారు జీవితాలు వెళ్లమార్చడం కష్టంగా ఉంది. ఒక్కొక్కసారి ఆ తల్లీ కూతుళ్ళు తాము అటువంటి బతుకు బతికే బదులు చావడమే మేలని అనుకునేవారు.

ఒకవైపు ఆర్థిక బాధ కృంగదీస్తూ ఉండగా, మరొకవైపు భవానీ పెళ్లి గురించిన బాధ లక్ష్మిని వేధిస్తోంది. తాను, భవానీ పనులు చేస్తున్న ఇళ్లల్లోని పురుషుల బారిన పడకుండా వెయ్యికళ్లతో ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తోంది. గతంలో అటువంటి దుర్ఘటనలు ఆమె ఎన్నో ఎదుర్కొంది.

లక్ష్మి పెద్దకూతురు ఒక పోలీసు ఆఫీసరు కొడుకు రేప్‌ చెయ్యడంవలన ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసు ఆఫీసర్‌ డబ్బు, పలుకుబడివలన అతని కొడుకుపై లక్ష్మి ఏ చర్యా తీసుకోలేకపోయింది. ఆనాటి నుంచీ భవానీని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే వస్తోంది పురుషుల పట్ల బహు జాగ్రత్తగా ఉండమని తెలివితక్కువ తనంతో పురుషుల వలలో పడితే, అక్కకు పట్టిన గతే తనకు కూడా పడుతుందని మృదువుగా కొన్నిసార్లు, కరి౮నంగా కొన్నిసార్లు చెప్పింది. అక్కవలే తాను అజాగ్రత్తగా ఉండననీ, తాను తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటానని భవానీ తల్లికి చెప్పింది.

కలెక్టర్‌ ఆఫీసులో రఫుపండా హెడ్‌క్లర్క్‌. బక్కపలచగా, నెరసిన తలతో ఉంటాడు. జిత్తులమారి నక్కవంటి వాడు. భార్య బాగా ముసలిదైంది. కొడుకులు ప్రభుత్వోద్యోగంలో మంచి స్థితిలో ఉండి, భార్యలతో వేరే ఉంటున్నారు. ఆ దంపతుల విషయంలో శ్రద్ధ తీసుకొంటూ భవానీ రఫుపండా ఇంట్లో పనిచేస్తోంది. పండా భార్య పరమ గయ్యాళిది. అయితే పండా మాత్రం నిదానస్తుడు. ముసలితనం వచ్చినా అతని బుద్ధులు పెడదోవన పడుతూనే ఉన్నాయి. తరచుగా డబ్బు ఇస్తూ ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నించాడు. అమాయకత్వంతో ఆమె డబ్బు తీసుకొనేది.

కొద్దిరోజుల్లోనే పండా దుర్భద్ధి భవానీ గ్రహించి, అతణ్ని కరి౮నంగా మందలించింది. అతని ప్రవర్తన గురించి, అతని భార్యకు చెప్తానని హెచ్చరించింది. అది విని పండా గజగజా వణికిపోయాడు. తనను క్షమించమని భవానీని కోరాడు. ఈ విషయం భార్యకు తెలిస్తే, ఆమె తన నిక చీల్చి చండాడుతుందని భయపడిపోయాడు. అయినా భవానీని వదల కూడదనీ, తన స్వార్థానికి మరొక విధంగా ఉపయోగించుకోవాలని భావించాడు. అతను ఆఫీసులో విపరీతంగా లంచాలు తీసుకొని బాగా గడించాడు! అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఆఫీసులో అతని ఆటలు సాగడం లేదు. ఆ జిల్లాకు కొత్త కలెక్టర్‌ వచ్చాడు.

అతను అమిత నిజాయితీపరుడు. లంచాలు ఇవ్వడాన్నీ, తీసుకోవాడాన్నీ సహించడు. అతణ్ని చూసి కటక్‌లోని అవినీతిపరులంతా భయపడుతున్నారు!

తన పబ్బంగడుపుకొనడంకోసం, కుతంత్రాలు పన్నడంలో ఆరితేరిన పండా ఒక పధకం పన్నాడు. ఆపధకాన్ని కలక్టర్‌పై ప్రయోగించడానికి ఓ రూపకల్పన చేశాడు. కొత్త కలక్టర్‌ అయిన తపన్‌సింగ్‌ ఎంత నీతిపరుడైనా, ఓ అందాల మగువ వలన తన నీతిని కోల్పోయి భ్రష్టుడుకాకపోడు! ఎంతమంది ప్రముఖులు పదవుల్లో వున్నవారు స్త్రీల వలలో చిక్కి పతనం కాలేదు! తన పధకానికి ఇక తిరుగులేదని రఫుపండా గ్రహించాడు. తన పాచికపారి, గుప్పిట్లో కలక్టరు చిక్కితే, అటుపై తనపంట పండినట్లే! కంట్రాక్టర్లవద్ద, ఇతర వ్యాపారుస్తుల నుంచి దండిగా వెనకటివలే లంచాలు గుంజుకోవచ్చు. కలక్టర్‌ యువకుడు, అందగాడు. పెద్దపదవిలోవున్నవాడు అవ్వడంవలన, కుర్రదైన భవానీ అతని కోరిక తీర్చితీరుతుంది. ఆమె అందానికి కలక్టర్‌ పడిపోకమానడు. ఆ బుద్ధి లేనిది తనకోరిక తీర్చిందే కాదు! ఈ విధంగా పండా ఆలోచనలు సాగాయి.

ఆ రోజు మిట్టమధ్యహ్నం మండే ఎండలో ఓడొక్కు సైకిల్‌పై ముసలి పండా లక్ష్మి ఇంటికి వెళ్లాడు.

''లక్ష్మి! నిద్రపోతున్నావా? తలుపుతెరువు. నీకోసం ఒక మంచి వార్త తెచ్చాను.'' అన్నాడు బిగ్గరగా.

వెంటనే లక్ష్మి తలుపుతెరిచింది. గొప్పవాడైన రఫుపండా తనగుమ్మం ముందు నిలబడి ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపడింది. ఇంకా తేరుకోకముందే, పండా చొరవగా ఇంట్లోకి వెళ్లి ఓచిన్న ఎత్తుపీటమీద కూర్చున్నాడు. అతని ఎదురుగా వేసివున్న చాపపై లక్ష్మి కూర్చుంది. పక్కన భవానీ ఉంది. లక్ష్మి వంక చూస్తూ పండా చెప్పసాగాడు.

''చూడు లక్ష్మి! కొత్తగా వచ్చిన కలక్టర్‌ యువకుడు, అందరినీ అర్ధం చేసుకుని, వారికి కావలసిన మేలుచేస్తూ ఉంటాడు. పేదలపట్ల జాలీ, దయ, ఆయనలో గొప్ప విశేషాలు, అతని ఆర్డరు లేకుండా జిల్లాలో ఎవ్వరూ ఏపనీ చెయ్యడానికి వీల్లేదు''

అది విని లక్ష్మి లోపల బాధకు, ఆందోళనకు గురి అయింది. పెద్ద ఆఫీసర్లందరూ మోసగాళ్లు, దగాకోర్లు అనే అభిప్రాయం అమెది. '' పండాబాబు! మీరెందుకని కలక్టర్ను అదేపనిగా పొగుడుతున్నారు? నాకు తెలిసిన ఆఫీసరు ఒకడు ఉన్నాడు. అతను ప్యూన్ల్‌ను తరుచుగా కొట్టేవాడు. ఈ పెద్ద ఆఫీసర్లందరూ దుర్మార్గులు. వాళ్ల గురించి నాకు చెప్పకండి. మాబోటి పేదవాళ్లకు అంతులేని అపకారం చేసేదివాళ్లే!'' అంది ఆవేశంతో.

''అలా అనకు! మన కొత్త కలక్టర్‌ అటువంటివాడు ఎంతమాత్రం కాదు. నా సర్వీస్‌ మొత్తం మీద అటువంటివాణ్ని నేనెప్పుడూ చూళ్లేదు!''

అతనివంక సూటిగా చూస్తూ, ''ఇంతకీ మీరు చెప్పేది ఏమిటి?''

నేను నీకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. నీ శ్రేయోభిలాషిని. నీకు మేలే చేస్తానుగానీ, కీడు అనేది చెయ్యనుగదా! ఈ వయస్సులో మనకు డబ్బు అవసరం ఎంతైనా ఉంటుంది. క్రమేపీ నాలో పని చేసే శక్తి సన్నగిల్లుతుంది. ఈ స్థితిలో నువ్వోక మంచి నిర్ణయం తప్పక తీసుకోవాలి సుమా!'' అన్నాడు.

లక్ష్మిలో ఓపిక సన్నగిల్లింది ''పండాగారు! మీరు చెప్పదలుచుకొన్నదేదో సృష్టంగా చెప్పండి. మీరు ఇక్కడకు ఏపని మీద వచ్చారు?'' అంది విసుగ్గా

నీ కష్టాలు నుంచి నిన్ను బయటపడవెయ్యడానికి నేనిలావచ్చాను. కలక్టరు గారికి బంగళాలో పని చెయడానికి ఒక పనిమనిషి కావాలి. బాగావంటలు చెయ్యడంకూడా తెలిసి ఉండాలి. ఈ విషయంలో మీ భవానీకి మించిన అమ్మాయి వేరెవ్వరూలేరు. కలక్టరు ఆమెకు మంచి జీతం ఇస్తాడు. మీ అమ్మాయిని రేపు నాతో పంపించు. కలక్టరుకు పరిచయం చేస్తాను'' అన్నాడు. లక్ష్మి ఏమీమాట్లాడలేదు.

''లక్ష్మి! నీ కష్టాలు, అవసరాలు ఇకతీరిపోయినట్లే! అదృష్టం నీముందు నిలిచింది. మంచి నిర్ణయం తీసుకో. ఈ అవకాశాన్ని వదులుకోకు!''

గాయపడిన సింహంలా గర్జించింది లక్ష్మి

''నాకు కష్టాలు తొలగి సుఖాలు రావాలని నేను కోరుకోవడం లేదు. పదవిలో వున్న ఓ దుర్మార్గునికి నా కూతురును బలి ఇవ్వమంటావా?'' అంది కళ్లల్లో నిప్పులు చెరుగుతూ.

ఒక నిమిషం నిశ్శబ్దం తర్వాత

''నువ్వీ విధంగా మాట్లాడతావని నేను అనుకోలేదు. ఒక్క దేవుడు మాత్రమే నాలో ఉన్న మంచి భావాన్ని అర్థం చేసుకోగలడు! నీ కూతురు విషయంలో అన్ని జాగ్రత్తలూ నేను తీసుకుంటాను. ఆ బాధ్యత నాకు వదిలిపెట్టు. నా మాట నమ్ము'' అన్నాడు పండా.

లక్ష్మి ఆలోచనలో పడింది. చివరికి పండా ఆమెను ఒప్పించగలిగాడు. అయితే లక్ష్మి అతనికి ఓ షరతు పెట్టింది.

''మా భవానీ అయిదారు రోజులు బంగళాలో పనిచేస్తుంది. అప్పుడు కలెక్టర్‌ మంచివాడేనని ఆమెకు నమ్మకం కలిగితేనే అటుమీదట పనికి వెళ్తుంది''

ఆ మర్నాడు ఉదయం పండా, భవానీని వెంటతీసుకొని కలెక్టరు బంగళాకు వెళ్లాడు. కలెక్టర్‌ వద్దకు ఆమెను తీసుకువెళ్లినప్పుడు ఆయన ముందు వినమ్రంగా ఎలా ప్రవర్తించవలసిందీ పండా ఆమెకు బోధపరిచాడు. అది విని భవానీ భయపడిపోయింది. తాను మొదటిసారిగా ఓ కలెక్టర్‌ ముందుకు వెళ్లబోతోంది. తనవొంటి మీదున్న పాతవి, మాసినట్లుగా కనిపిస్తున్న దుస్తులు చూసి కలెక్టరుగారు చిరాకు పడతారు అనుకుంది భవానీ.

రఫు పండా కూడా లోలోపల ఆందోళన చెందుతున్నాడు. భవానీ విషయాన్ని కలెక్టరుకు ఎలా చెప్పాలి? కలెక్టర్‌ తపన్‌సింగ్‌ తనకొక పనిమనిషి కావాలని పండాకు ఎప్పుడూ చెప్పలేదు. ఆఫీసులో సిబ్బంది ద్వారా అతను, కలెక్టర్‌కు ఒక పనిమనిషి అవసరం ఉన్నదని మాత్రమే విన్నాడు. భవానీని బంగళాముందు కూర్చోపెట్టి పండా లోనికి వెళ్ళాడు. తన గదిలో ఏదో రాసుకొంటున్న కలెక్టర్‌ తలెత్తి పండాను చూసి,

''ఏమిటి ప్రాబ్లమ్‌. ఏదో కంగారు పడుతున్నట్లు ఉన్నావ్‌?'' అన్నాడు. కాస్సేపు మౌనంగా ఉండి పండా ఏదో ఆలోచించాడు. వెంటనే కొన్ని ఆఫీసు వ్యవహారాలు కలెక్టర్‌తో మాట్లాడాడు.

కొంత నిశ్శబ్దం తర్వాత కలెక్టర్‌ ప్రశాంతంగా ఉండడం పండా గమనించి తన మనసులోని మాటలు చెప్పడానికి అదే సమయమని గ్రహించి,

''సార్‌! మీరు వంట మనిషికోసం చూస్తున్నారని విన్నాను. అందుకు నేనొక మనిషిని చూశాను!

''అతని వయస్సు ఎంత ఉంటుంది?'' తపన్‌సింగ్‌ ప్రశ్నించాడు.

''మగవాడు కాదుసార్‌! చక్కటి వంటలు చేసే ఒక ఆడపిల్లను చూశాను. వంటతోపాటు ఇంటిపనులు కూడా చక్కగా చక్కపెడుతుంది. ఆమె, ఆమె తల్లి మా ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు''

తపన్‌సింగ్‌ సంతోషంతో పకపకా నవ్వాడు. ''ధాంక్స్‌! నా అవసరం విషయంలో నువ్వు శ్రద్ధ తీసుకొన్నందుకు''

''సార్‌! ఆ అమ్మాయి బంగళాముందు ఉంది. తమ పర్మిషన్‌ అయితే తీసుకు వస్తాను'' విన్నవించాడు పండా. కలెక్టర్‌ ఆమోదపూర్వకంగా తలవూపాడు. మెరుపువేగంతో గదిలోనుంచి బయటకు వెళ్లాడు. భవానీ కలెక్టర్‌ గదిలోకి వెళ్లే సరికి, భయంతో సన్నటి వణుకు ఆమెలో ప్రారంభమైంది. తనను తాను సంబాళించుకొని ఆయనకు వినయంగా నమస్కరించింది.

''నీ పేరేమిటి?'' ఆమెను అడిగాడు తపన్‌సింగ్‌

''భవానీ''

''నువ్వు చేపలు కూర, మాంసం కూర బాగా వండగలవా?''

''బాగా వండుతాను సార్‌''

''ఏమేమి వంటలు వండుతావో చెప్పు''

తాను వండగలిగిన వంటకాలు అన్నిటినీ భవానీ చెప్పింది.

''నీకు ఎంత జీతం కావాలి?''

ఆమె మౌనంగా ఉంది. వెంటనే పండా కలగజేసుకొని

''సార్‌! రెండు వందల రూపాయలు ఇస్తే చాలు!'' అన్నాడు.

తపన్‌సింగ్‌ చిరుకోపంతో పండా వంక చూశాడు.

''నేను నీకు నెలకు అయిదు వందల రూపాయలిస్తాను. చెప్పాడు కలెక్టర్‌

అది విని పండా కళ్లు పెద్దవిగా అయి బయటకు వచ్చేసేంత పనైంది!

తపన్‌సింగ్‌, భవానీని కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆమె కుటుంబం గురించి అడిగి తెలుసుకున్నాడు. అన్నిటికీ ఆమె చక్కటి సమాధానాలు చెప్పింది. అప్పటికి ఆమెలో ధైర్యం ఏర్పడింది. తొట్రుపాటు లేకుండా సమాధానాలు చెప్పింది. మధ్య మధ్య చిరునవ్వులు నవ్వడానికి కూడా ధైర్యం వచ్చింది ఆమెకు.

పండా నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు. తపన్‌సింగ్‌లో కనిపిస్తున్న ఉత్సాహం పండాకు ఆనందం కలిగించింది. తన పాచిక పారినట్లేనని అతగాడు మురిసిపోయాడు. భవానీ వలన తాను కలెక్టర్‌ మెప్పు పొందినట్లే! ఇటుపై కలెక్టర్‌ తనపై చూపే అభిమానం వలన పార్టీల వద్ద బాగా లంచాలు గుంజవచ్చు! పండా ఆలోచనలు ఇలా సాగుతుండగా కలెక్టర్‌ తన జేబులోనుంచి పర్సు తీసి కొన్ని నోట్లు భవానీకి ఇచ్చాడు.

''వీటితో మంచి డ్రస్సులు కొనుక్కో. ఇక మీదట నువ్వు శుభ్రంగా వుండడం నేర్చుకో! రేపటి నుంచి పనిలో ప్రవేశించు'' చెప్పాడు తపన్‌సింగ్‌.

భవాని ఇంటికి వెళ్లి జరిగిన సంగతులన్నీ తల్లికి చెప్పింది. ఆ మరుసటి రోజునుంచీ భవానీ కలెక్టర్‌ బంగళాకు వెళ్లి వంటపనులు, ఇంటి పనులు చెయ్యసాగింది. రోజులు గడిచేకొద్దీ ఆమె తన పనిపాటలతో కలెక్టర్‌ మెప్పు పొందసాగింది. కలెక్టర్‌ బంగళాలో పనులుచేసే బాబుల్‌కు భవానీ రాకతో చాలా వరకు పనులు చేసే శ్రమ తప్పిపోయింది. అతను మెట్రిక్యులేషన్‌ పాసయ్యాడు. ఏపనీ చెయ్యడం అతనికి ఇష్టం ఉండదు. వొళ్లు వంచకుండా తేలికైన పనులు చేస్తూ కాలక్షేపం చెయ్యాలని చూస్తాడు. అతగాడు చేసే వంటలన్నీ పరమ ఘోరంగా ఉంటాయి.

ఒకరోజున కలెక్టర్‌, బాబుల్‌కు చెప్పాడు భవానీ ఖాళీగా ఉండే సమయంలో ఆమెకు ఒరియా భాష ఎలా చదవాలో, రాయాలో నేర్పమని, బాబుల్‌కు చాలా ఆనందం కలిగింది. ఇందువల్ల తాను ఆమెను తనివి తీరా చూస్తూ కూర్చోవచ్చు. ఆమెకు పాఠాలు చెప్తూ ఆమెను స్వాధీనం చేసుకొనే పధకాల కోసం అన్వేషించసాగాడు.

భవానీ నిజాయితీ, పనితనం తపన్‌సింగ్‌కు పూర్తిగా తృప్తి కలిగించాయి. ఆయన భవానీ నెల జీతాన్ని 500 రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెంచాడు. అందువలన భవానీ తల్లి ఆర్థిక బాధలు తగ్గాయి. అయితే ఆమెలో ఆందోళన మాత్రం ఎక్కువైంది. తరచుగా భవానీని దూషించసాగింది.

''ఛండాలురాలా! నీవలన ఏదో రోజు నేను ఛస్తాను. నీకు కడుపు అవుతుంది. నలుగుర్లో తలెత్తుకోలేక నేను చావనే ఛస్తాను''

తాను జాగ్రత్తగానే వున్నాననీ, ఈ విషయంలో భయపడనవసరం లేదనీ, తల్లికి పరిపరి విధాల చెప్పేది భవాని. ఆమెకు కలుగుతున్న అసౌకర్యం అంతా బాబుల్‌ వల్లనే. అతనితో వేగడం ఎలాగో ఆమెకు బోధపడడం లేదు. అతను రెండుసార్లు ఆమెను బలాత్కరించడానికి చూశాడు. ఒకసారి

''నువ్వు చాలా అందంగా ఉంటావు భవానీ!'' అన్నాడు.

అది విని ఆమె మౌనంగా ఉండిపోయింది. ఒకరోజు సాయంత్రం వర్షం కురుస్తూ ఉండగా బాబుల్‌, భవానీకి పాఠం చెప్తున్న వాడల్లా హఠాత్తుగా ఆగిపోయాడు. కొద్దిసేపు ఆమె మొహం వంకే తేరిపార చూస్తూ కూర్చున్నాడు. తన వేలినుంచి ఉంగరం తీసి,

''ఈ ఉంగరాన్ని భవానీ తీసుకుని ఎప్పటికీ తన దగ్గరే ఉంచుకోవాలని నేను కోరుకొంటున్నాను'' అన్నాడు.

''ఎందుకు?'' అన్నది భవాని

''నేను నిన్ను పెళ్లాడుదామనుకొంటున్నా. కొద్దిరోజుల్లో నువ్వు నా భార్యవు కావాలి!'' చెప్పాడు బాబుల్‌.

అదే సమయంలో కలెక్టర్‌ ఆ గదిలోకి వెళ్లాడు.

''నువ్వు చెప్పింది విన్నాను... మీ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతూ ఉందని నేను గ్రహించాను భవానీని ఈ నెలలో పెళ్లి చేసుకుంటావా?'' తపన్‌సింగ్‌ అడిగాడు బాబుల్‌ను.

బాబుల్‌ మొహం మాడిపోయింది. భయంతో వణకసాగాడు. అది చూసి కలెక్టర్‌కు ఆశ్చర్యం వేసింది. వెంటనే భవానీని ఆ గదిలో నుంచి వెళ్లమని చెప్పాడు తపన్‌సింగ్‌.

''నువ్వామెను పెళ్లాడుతావా? లేదా?'' ఆయన బాబుల్‌ను అడిగాడు. ఇదే ప్రశ్నను మూడుసార్లు అడిగాడు. చివరికి బాబుల్‌ తలెత్తి నెమ్మదిగా గొణిగాడు

''క్షమించండి సార్‌! నేను భవానీని పెళ్లాడలేను. నా తండ్రి ఒక స్కూలు టీచరు. మాది గౌరవనీయమైన కుటుంబం. నేనొక పనిమనిషిని పెళ్లాడ్డానికి ఆయన ఎంతమాత్రం ఒప్పుకోడు. తమరే చెప్పండి నేను పనిమనిషిని ఎలా పెళ్లాడనూ?''

తపన్‌సింగ్‌ కోపాన్ని ఆపుకోలేకపోయాడు.

''ఈ విషయంలో నీ తండ్రి అంగీకారం అనవసరం''

''అయ్యా! తండ్రి మాట కాదని, దైవంపట్ల ఎలా తప్పుగా ప్రవర్తించగలను?'' అన్నాడు బాబుల్‌.

''నువ్వు వెంటనే బంగళాలోని నీ సామాన్లు తీసుకొని వెళ్లిపో!'' ఆగ్రహంతో బిగ్గరగా కేకలు వేశాడు కలెక్టర్‌

ఆ మర్నాడు టీ తాగే సమయంలో తపన్‌సింగ్‌ భవానీతో అన్నాడు. ''నువ్వు పరమ తెలివి తక్కువదానివి. ఆ బాబుల్‌ నిన్ను మోసం చేద్దామనుకున్నాడు. నువ్వు అతన్ని నిజంగా ప్రేమిస్తూ ఉంటే, నేను అతణ్ని నిన్ను పెళ్లాడేలా ఒప్పిస్తాను. దాపరికం లేకుండా నాకు చెప్పు. నువ్వు అతణ్ని ప్రేమిస్తున్నావా?''

వెంటనే భవానీ ''లేదు. అతనంటే నాకు పరమ అసహ్యం!'' అని చెప్పింది.

* * *

తపన్‌సింగ్‌ తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటున్నారు. అక్కడ తపన్‌ అన్న ఒక డాక్టర్‌. తండ్రి ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి. అతని ఇద్దరు చెల్లెళ్లు అమెరికాలో ఉంటున్నారు. తమ భర్తలు ఉద్యోగరీత్యా. తపన్‌సింగ్‌ వివాహాన్ని వాయిదా వేస్తున్నందుకు అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూనే ఉన్నారు.

తపన్‌ తండ్రి కటక్‌ వెళ్లాడు తపన్‌ అన్న ఒక లేడీ డాక్టర్‌ సంబంధం అతనికోసం చూశాడు. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఈ విషయం కొడుక్కు చెప్పడానికి తండ్రి వచ్చాడు. తపన్‌ తల్లి ఆ లేడీ డాక్టర్‌ను తన కోడలుగా చేసుకోవాలని తహతహలాడుతోంది.

ఆ సాయంత్రం టీ చేసే సమయంలో తండ్రీ, కొడుకుల సంభాషణ భవానీ వింది. తండ్రి ఇచ్చిన ఫొటో చూసి తపన్‌ హేళనగా నవ్వాడు. అందుకు పెద్దాయన తీవ్రంగా బాధపడ్డాడు. ఆ మర్నాడు ఉదయం తపన్‌సింగ్‌ కలకత్తా వెళ్లాడు. నాల్గురోజుల క్యాంపు. తాను తిరిగి వచ్చిన తర్వాత ఆ సమస్య పరిష్కారం గురించి ఆలోచిద్దామని తండ్రికి మాట ఇచ్చాడు తపన్‌.

ఆందోళన చెందుతున్న ఆయనకు ఒక ఆలోచన తోచింది. తన కొడుకుకు స్త్రీలెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? తెలుసుకోవాలనే కుతూహలంతో భవానీ నుంచి కొంత విషయాన్ని ఆయన సేకరించగలిగాడు.

''బాబుగారూ! మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గారు తరచు బంగళాకు వచ్చి అయ్యగారితో మాట్లాడుతూ ఉంటారు. ఆమె అందమైంది. ఒంటరిది. ఆమె అంటే బాబుగారికి కూడా ఇష్టమే అని నేను అనుకొంటున్నాను. ఆయన, ఆమెను పెళ్ళాడ్డానికి ఒక కారణం అడ్డు వస్తోంది. ఆమె ఒక ముస్లిం యువతి'' అని చెప్పింది.

క్యాంపు నుంచి తపన్‌సింగ్‌ రాగానే ''నా పేరును, కుటుంబ ప్రతిష్టను నువ్వు మంట కలపనున్నావా? ఒక ముస్లిం యువతిని పెళ్లి చేసుకుని!'' ఆగ్రహంతో అడిగాడు తండ్రి.

''ఏ ముస్లిమ్‌ యువతి?''

''ఇంకెవరు? ఆ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌!'' ముసలాయన మండిపడుతూ అన్నాడు

''ఈ అయిడియా మీకు ఎవరిచ్చారు?''

''భవానీ నాకు అన్ని విషయాలు చెప్పింది. నువ్వు ఆ ముస్లిమ్‌ యువతిని ప్రేమిస్తున్నావ్‌. పెళ్లాడాలని అనుకొంటున్నావ్‌'' అన్నాడు ముసలాయన కోపంగా.

తపన్‌కు త్రీవమైన ఆగ్రహం కలిగింది. మొహం ఎర్రగా కందిపోయింది. ''బుద్ధిలేని పనిమనిషి! నా క్యారెక్టర్‌ మీద బురద చల్లడానికి చూస్తోంది. నేనామెను చంపేస్తాను. నేనంటే ఏమనుకుంటోంది? భవానీని కరి౮నంగా శిక్షిస్తాను. ఇక నుంచి పనిచెయ్యడానికి రావద్దని చెప్తాను'' అన్నాడు

కొడుకు కోపాన్ని చూసి పెద్దాయనకు ఆశ్చర్యం వేసింది. ''బాబూ! తొందరపడకు. భవానీ చాలా మంచి అమ్మాయి. చదువు లేకపోయినా, ప్రవర్తన చక్కగా ఉంటుంది. పాపం ఆమెను శిక్షించకు. చాలా అమాయకురాలు. నీకు ఆడస్నేహితులు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుందామని నేనే ఆమెను అడిగాను అంతే!'' అన్నాడు పెద్దాయన కొడుక్కు సంజాయిషీ ఇస్తూ

కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత ముసలాయన

''భవానీ మంచి పనిమనిషి. ఇదివరకు బంగళా అంతా చెత్తా చెదారంతో నిండి అపరిశుభ్రంగా ఉండేది. ప్రస్తుతం భవానీ దీన్నంతా శుభ్రం చేసి అద్దంలా తీర్చిదిద్దింది! నేను భవానీని ఢిల్లీ తీసుకు వెళ్దామనుకొంటున్నాను. మీ అమ్మ భవానీని ఎంతో ఇష్టపడుతుంది. ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటుంది'' అన్నాడు.

''ఆమెను అంతగా మీరు పొగడుతున్నారు గదా? అలాంటప్పుడు ఆమెను మీ కోడలుగా ఎందుకు అంగీకరించకూడదు? నేనామెను పెళ్లాడాలని అనుకొంటున్నాను!'' అన్నాడు తపన్‌సింగ్‌.

వెంటనే తండ్రి తీవ్రమైన కోపంతో బిగ్గరగా అన్నాడు ''అలాగా! భవానీ ఎంతో ధైర్యంగా ఈ ప్లాన్‌ వేసింది అన్నమాట! ఆమె నీ నెత్తిన ఎక్కి కూర్చుంది. ఇది పరమ ఛండాలంగా ఉంది. ఇక మీదట ఇక్కడకు రావద్దని ఆమెకు చెప్తాను. ఆమెకు చదువు సంధ్యలు లేవు. చాలా హీనస్థితిలో వున్న కుటుంబం. నువ్వామెను పెళ్లాడకూడదు. డిస్ట్రిక్ట్‌ కలెక్టర్‌ ఓ పనిమనిషిని పెళ్లాడ్డమా? అసంభవం తపన్‌. నీ ప్రతిష్ట అంతా కుప్పకూలిపోతుంది. ఈ విషయం విన్నదంటే మీ అమ్మ చచ్చిపోతుంది!''

తపన్‌ ఆగ్రహోదగ్రుడయ్యాడు. తీవ్రస్థాయిలో తండ్రిని ఎదుర్కొన్నాడు. ''మీరెప్పుడూ గర్వంగా చెప్తూ ఉంటారుగదా? మీరు గాంధేయవాది అని! మీరు జీవితంలో ఇంతవరకూ మహాత్ముడు చేసిన కార్యాల్లో ఒక్కటైనా చేశారా? మనదేశంలో గాంధీ గారి అనుచరులం అని చెప్పుకొనే అనేక మంది నకిలీ అనుచరులున్నారు. వారిలో మీరొకరు. ఒక హిందూ, ముస్లిమ్‌ల మధ్య తేడా చూడ్డానికి మీకు లజ్జ వెయ్యడం లేదు? ఒక పనిమనిషి అని భవానీని మీరు అసహ్యించుకోవడానికి మీకు సిగ్గు వెయ్యడం లేదు? ఆమె పేదదనీ, చదువు లేనిదనీ ఈసడించుకోవడానికి మీ మనసెలా ఒప్పింది? గంగాజలంలా భవానీ హృదయం అతి పవిత్రమైంది. స్వచ్చమైన ప్రేమకు అమాయకత్వానికి ఆమె శిఖరాగ్రం వంటిది! నేనామెను పెళ్లాడతాను. ఆమెను విద్యావంతురాలిని చేసిన పిమ్మట, ఈ సంఘం యొక్క తీరు తెన్నులు గురించి చెప్తాను'' అన్నాడు.

అది విని ముసలాయన గర్వం అణగారిపోయింది. ఆయన మానసికంగా ఎంతో గాయపడ్డాడు. తీవ్రమైన అవమానానికి గురయ్యాడు. రెండు గ్లాసుల చల్లటి నీళ్లు తాగి, నుదురుకు పట్టిన చెమట తుడుచుకున్నాడు. తపన్‌సింగ్‌ కోపంగా ఆ గదిలోంచి వెళ్లాడు. పెద్దాయన సోఫాలో కూర్చుని ఆలోచనల్లోకి కూరుకుపోయాడు. బాపూజీ ప్రవచనాలు, ఆయన మహోన్నతమైన ఘనత, మానవత్వం గురించి ముసలాయన స్ఫురణకు తెచ్చుకోసాగాడు. హఠాత్తుగా ఆయన ఆలోచనలు భగ్నమయ్యాయి

''బాబు గారూ!'' అని భవానీ పిలవడంతో. తృళ్లిపడి చూశాడు. పొగలు కక్కుతున్న టీ గ్లాసుతో భవానీ కనిపించింది.

''భవానీ! నీ టీ ఏది?''

ఆ ప్రశ్న ఆమెకు వింతగా అనిపించింది. తొట్రుపాటుతో,

''అయ్యా, నేను టీ తాగను'' అంది

''ఇప్పుడు నువ్వు కూడా టీ తాగవలసిందే!'' ఆజ్ఞాపించాడు. ఆమె గాబరా పడింది.

''బాబు గారూ! మీకోసం ఒక్కటే చేశాను''

''ఇంకో గ్లాసు పట్రా''

వెంటనే భవానీ మరొక గ్లాసు తెచ్చింది. అతనా గ్లాసు తీసుకొని తన గ్లాసులోని సగం టీని దాంట్లో పోసి ఆమెకు ఇచ్చాడు. వాళ్లిద్దరూ మౌనంగా టీలు తాగారు. హఠాత్తుగా భవానీ చూసింది ఆయన పెద్దకళ్లల్లో నీళ్లు సుళ్లు తిరుగుతూ ఉండడం. ఈయన ఎందుకో బాధపడుతున్నాడు. కొడుకు ఏ విషయంలో అయినా మందలించాడేమో? ఆ బాధకు కారణం ఏమిటో ఆయన్నే అడిగి తెలుసుకోవాలని అనిపించినా, మౌనంగా ఉండిపోయింది.

హఠాత్తుగా ముసలాయన కన్నీటిని ఆపుకోలేక బావురుమన్నాడు.

''మా తపన్‌ నిజంగా ఓ మహాత్మాగాంధీ! భవానీ, నీకు భర్తగా ఓ దేవుని వంటి వాడు లభించాడు! నీ బాబు గారు నిన్ను పెళ్లాడతారు!'' అన్నాడు.

తాను విన్న మాటలు నమ్మలేనట్లుగా అతని వంక చూసింది భవాని.

''ఇది నిజం. నన్ను నమ్ము. ఇకమీదట మీ తల్లిదండ్రులకు ఏ ఇబ్బందీ కలక్కుండా, మేము సహాయం చేస్తూ ఉంటాం సరేనా!'' చెప్పాడు పెద్దాయన.

భవానీ ఇంటికి వెళ్లింది. ఏమీ జరగనట్లు మామూలుగా ప్రవర్తించింది. తల్లికీ, తండ్రికీ ఏ విషయం చెప్పలేదు.

కొద్దిరోజులు తర్వాత తపన్‌సింగ్‌, భవానీని వివాహం చేసుకొన్నాడు. అతని నిజాయితీ, అవినీతి పరుల పట్ల తీవ్రంగా వ్యవహరించే తీరు, రఫుపండాకు ఇతర లంచగొండి ఉద్యోగులకు తీవ్రమైన అసౌకర్యం కలిగించింది. లంచాలు ముట్టడం గగనమైంది. చివరికి వారంతా కలసి, అవినీతి పరులైన రాజకీయ నాయకుల సహకారంతో, తపన్‌సింగ్‌ను కటక్‌ నుంచి మరో జిల్లాకు ట్రాన్స్‌ఫర్‌ చేయించారు.

అక్కడ తపన్‌సింగ్‌, భవానీలు కలసి కొత్తజీవితం ప్రారంభించారు!
అనువాదం: కొడిమెల శ్రీరామమూర్తి

నాన్నకో కధ

From July Vipula

నాన్నకో కధ
గ్రేస్‌పాలీ
నాన్నకు ఎనభైయ్యారేళ్ళు. మంచం పట్టాడు. ఏపని చెయ్యాలన్నా శరీరం సహకరించటం లేదు. తల దిమ్మెక్కినట్టుగా వుంటున్నదట. లేచి తిరగటం వీలుపడదు. ఈ అనారోగ్యానికి కారణం కేవలం వృద్ధాప్యమే కాదనీ, పొటాషియం లోపం కూడాననీ నాకు తెలుసు. దిళ్ల మీద ఒత్తిగిలి పడుకుని నాకు సలహాలిస్తుంటాడు.

''మరొక్క కధ రాయవా! నువ్విదివరకు రాసినట్లాంటి కధలు. మపాసా, చెహోవ్‌లు రాసినట్లాంటివి. మనంరోజూ చూసే మనుషుల గురించి. వాళ్ల జీవితాల్లో జరిగే సామాన్య సంఘటనల గురించి.''

''ఓయస్‌ రాస్తాను. దానికేం భాగ్యం.'' అన్నాను నాన్న తృప్తి కోసం. కాని నేను అలాంటి కధలు యింతవరకు రాస్తేగద! ''అనగనగా ఒక ఊళ్లో ఒకావిడ వుండేది......'' అంటూ ప్రారంభించి, ఒక ప్లాట్‌ తయారుచేసి కధ రాయాలనే వున్నది. కాని... స్త్రీని ప్లాట్‌ అనబడే విధిలీలకు వదిలెయ్యటం ఎంత దుర్మార్గం! పాత్రలు మాత్రం మనుషులు కారా. వాళ్ల జీవితాలు గాలిలో దీపాలా?

మాయింటి కెదురుగా ఓ దంపతులుంటారు. రెండేళ్లుగా వాళ్లు గురించి రాయాలనుకుంటున్నాను. ప్రారంభించి,

''నాన్నా, యిలారాస్తే బావుంటుందా చూడు'' అంటూ చదివాను, '' న్యూయార్క్‌లోని ఒక చిన్న అపార్టుమెంటులో ఒకావిడుంటోంది. ఆవిడకో కొడుకు. పదిహేనేళ్లు నిండకుండానే ఆ కుర్రాడు మాదకద్రవ్యాల కలవాటుపడ్డాడు. (ఆ బస్తీలో చాలా మంది పిల్లలకా అలవాటుంది) కొడుకును దూరం చేసుకోవడం యిష్టం లేని తల్లి తనూ మాదకద్రవ్యాలు తీసుకోవటం ప్రారంభించింది. ఈ తరం పిల్లలంతా యిలాగేవున్నప్పుడేంచేస్తాం అంటూ సరిపెట్టుకుంది. కొన్నాళ్ల తరువాత, అనేక కారణాలవల్ల, కొడుకు ఆ అలవాటుమాని, నగరం విడిచి వెళ్లిపోయాడు. తల్లికి తనమీద తనకు అసహ్యం వేసింది. నిరాశానిస్ప్రహలు తప్ప మరేం మిగిలాయావిడకు. ఆమె గురించిన కధయిది.....''

''చూశావా నాన్నా, ఏ నగిషీలు పెట్టకుండా సింపుల్‌గా రాశాను.''

నేను చెప్పింది నీకర్ధం కాలేదు. ఇంకా రాయాల్సింది చాలావుంది. తుర్జెనీవ్‌ యిలాగే రాస్తాడు? చెహోవ్‌ అయితే అసలు యిలా ప్రారంభించడు. రష్యన్‌ శీతకాలాల గురించి విన్నావుగా సరళంగా కధ చెప్పటం ఆ చలివల్ల నేర్చుకుంటారేమో. శరీరాల్లేని, ఆత్మల్లేని మనుషులుంటారాకధల్లో! వాళ్లెవరు....?

''ఇంకేం రాయాలినాన్నా! చెప్పకుండా వదిలేసిందేమిటి''

''ఆ స్త్రీ ఎలా వుంటుందో చెప్పనేలేదు...''

''ఆవిడా, యస్‌, అందంగావుంటుంది...''

''జుత్తు ఎలావుంటుంది!''

''నల్లటి జుత్తు. పొడవాటి జడ. చిన్నపిల్లలేసుకున్నట్టుగా''.

''ఆమె తల్లిదండ్రులు? వాళ్ల కుటుంబ నేపధ్యం? ఆమెనలా తయారుచేసిన పరిస్ధితులు... అవన్నీ రాస్తే బావుంటుంది తెలుసా.''

''వాళ్లు మరోవూరి నుండి వచ్చి యిక్కడ సెటిలయ్యారు. ఏదో పని చేసుకుని బతికేవాళ్లు. బహుశా భర్త ఆమెకు విడాకులిచ్చివుంటాడు. చాలా?''

''నామాటలన్నీ నీకు జోకులాగా వినిపిస్తున్నాయా ఏమిటి? ఆ కుర్రాడు తండ్రి గురించి ఒక్క మాటకూడా చెప్పలేదేం? అతడెవరు? ఏంచేస్తాడు? కుర్రాడు పెళ్లికి ముందర పుట్టాడా! తరువాత పుట్టాడా!''

''సరే. వాడు పుట్టేనాటికి తల్లిదండ్రులింకా పెళ్లి చేసుకోలేదు.''

''నీ కధలన్నీ అంతే. నీదృష్టిలో ఆడా, మగా పెళ్లిళ్లు చేసుకోరాఏమిటి?! పెళ్లికి ముందే సంసారం, పిల్లలు....''

''వాస్తవానికి అలాజరగదులే. కాని నాకధల్లో మాత్రం సాధారణంగా పెళ్లిళ్లు జరగవు... ''

''ఏమిటా పెడసరి జవాబు.. ''

''ఇదొక చిన్న కధ మాత్రమే నాన్నా. ఒక అందమైన, తెలివైన స్త్రీ, గుండెనిండా ఆశల్ని, కలల్ని మూటగట్టుకుని న్యూయార్క్‌ మహానగరానికి వచ్చింది. కొడుకును పెంచటానికి నానా కష్టాలు పడింది. ఆమెకు పెళ్త్లెందా లేదా అన్నది యిక్కడ అప్రస్తుతం కాదా?''

''ఎంత మాత్రం కాదు. అది చాలా ముఖ్యమైన అంశం''

''ఓకే ఓకే.''

''ఓకేగీకే కాదు జాగ్రత్తగా విను. ఆమె అందంగావుంటే వుండవచ్చుగాని తెలివైంది మాత్రం కాదు''

''నిజమే. కాని కధలో వచ్చిన చిక్కేఅది. పాత్రలగురించి గొప్పగా రాస్తాం. కాని వాళ్లు చాలాసాధారణ వ్యక్తులాగే బతుకుతారు. మూర్ఖుడిలా కనిపించే మరోవ్యక్తి కూడా వాళ్లను మోసం చెయ్యగలడు. ఇలాంటి కధలకు ముగింపు వెదకటం కష్టం.''

''అయితే ఏంచేద్దామనుకుంటున్నావు?'' నాన్న కొన్నాళ్లు డాక్టరుగా పనిచేశాడు. కొన్నాళ్లు ఆర్టిస్టుగా బతికాడు. శిల్పం, శైలి, కధనం, పరిశీలన అంటే యిష్టంయింకా.

''కొన్నాళ్లీ కధను పక్కన పెడదాం. ఈలోగా నీకూ ఆ జగమెండి హీరోకూ మధ్య సమోధ్య కుదరనీ.''

''నాన్సెన్స్‌. కధ మళ్లీ రాయి. నాకూ ఈ సాయంత్రం వేరే పనేంలేదు. కమాన్‌, స్టార్ట్‌.''

''ఓకే. కాని ఇది అయిదు నిమిషాల్లో తేలే విషయం కాదు.'' అంటూమళ్లీ ప్రారంభించాను.

''పక్కింటావిడ అందమైన మనిషి. కొడుకంటే ఆమెకు ప్రాణం. కడుపులో పడినప్పటినుండి, నెత్తుటి గుడ్డగావున్నప్పుడు, పొత్తిళ్లనుంచి ఎదిగి తన చేతుల్లో యిమిడిపోయినప్పుడు, వాణ్ణి గుండెల మీద వేసుకొని పడుకున్న ఆక్షణాలు తన కళ్ల నిండా వాడే.. మీసాలన్నా రాలేదుగాని కుర్రాడప్పుడే మాదకద్రవ్యాల అడిక్టుగా మారాడు. మరీ అంత సీరియస్‌ కేసేమీకాదు. ఆశ వదులుకోవలసిన అవసరంలేదు! తను చదువుకొంటున్న హైస్కూలు పత్రికలో వ్యాసాలు రాసేవాడు. వాడి ప్రతిభకు ఆపత్రిక సరిపోలేదు. స్వయంగా ఒక మాగజైను తనే ప్రారంభించాడు.

మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవాళ్ళందరూ గిల్టీగా ఫీలవుతారు. (అమెరికాలో కాన్సర్‌తో బాధపడుతున్న వాళ్లతో పదింట తొమ్మిది మందికి ఈ గిల్టీ మనస్తత్వమే ప్రధాన కారణమని వైద్యులు నిర్ధారించారు.) కాని చిన్నచిన్న వ్యసనాలను ఆనందించటంవల్లనే మనిషి ఆనందంగా బతుకుతాడని తల్లి నమ్మకం. అందువల్ల ఆమె కూడా అడిక్టుగా మారింది.

మేధావి అడిక్టులందరికీ ఆమె యిల్లుకేంద్రమైంది. వచ్చినవాళ్లందరూ కోలరిడ్జులమనో (19721834;ఇంగ్లీషు కవి. నల్లమందు ప్రియుడు) టిమొదీలీరీ (జననం: 1920; హార్వర్డులో సైకాలజీ ఫ్రొఫెసర్‌. ఎల్‌.ఎస్‌.డి. వల్ల లాభాలున్నాయని ప్రచారం చేసినవాడు)లమనో అనుకునేవాళ్లు. స్వయంగా మత్తులో వున్నప్పటికి, తల్లితో సహజంగా వుండే సేవాభావం ఆమెను వీడలేదు. మంచి మంచి భోజనపదార్ధాలు, విటమిన్‌ మాత్రలు, ఆరెంజి జూస్‌ అందరికీ అందుబాటులో వుంచేది. తరాల అంతరాన్ని చెరిపేసి తనూ పడుచు పిల్లలలో ఒకటైపోయింది.

ఒకనాడు (మైకెలేంజిలో) ఆంటోనిమోనీ (ప్రముఖ యిటాలియన్‌ చలనచిత్ర కళాఖండాల సృష్టికర్త) సినిమా చూస్తున్నప్పుడు ఓ పిల్ల వాణ్ణి మోచేత్తో డొక్కలో పొడిచింది. పరిస్ధితి అర్ధం చేసుకొని, తల్లి, కొడుకుని మందలించి, యింటికి తీసుకెళ్లింది.

కొడుకు అభిప్రాయాలే తన అభిప్రాయాలు. వాడి ఆశయాలే తన ఆశయాలు. అనూహ్యమైన పద్ధతుల్లో తల్లి ప్రేమఫలించింది. కుర్రాడికి ఆరోగ్యం మీద శ్రద్ధకలిగింది. నరాలు వశం తప్పుతున్నాయని గ్రహించ గలిగాడు.

నిరాకారమైన ఆత్మ ఆనందించినంత మాత్రన సరిపోదు.

శరీర కూడా ధృఢంగావుండాలి.

ఆరోగ్యవర్ధక ఆహారం తీసుకున్నాడు. ఆపిల్స్‌, రకరకాల మొలకధాన్యాలు, జీడిపప్పు, బాదం, సోయాబీన్స్‌. ఇదికూడా ఒక కొత్త ఆధ్యాత్మిక ప్రయాణం అంటూ ప్రకటించాడు.

''అమ్మా, మరి నువ్వెప్పుడు మారతావు'' అంటూ అమాయకంగా అడిగాడు.

కుర్రాడు త్వరలోనే కోలుకున్నాడు. మెహంలో కళ వచ్చింది. కండపట్టాడు.

కొడుకు సాంగత్యం లేని తల్లి ఏకాకిగానే కొకెయిన్‌ యింజక్షన్లు తీసుకుంది.

కుర్రాడు, వాడిగర్ల్‌ఫ్రెండూ మరోచోట కొత్త జీవితం ప్రారంభించటానికి వెళ్లిపోయారు. మాదక ద్రవ్యాలకు బానిసఅయిన తల్లిని చూస్తే అసహ్యం. 'ఈ అలవాటు మానకపోతే నీ మొహం చూడం' అన్నారు.

ఏకాంతంలో, ఫ్లాట్‌నిండా విస్తరించిన శూన్యంలో కొడుకు రాసిన వ్యాసాలు చదివి విలపించింది తల్లి. కుర్రాడిలో ఎంతనిజాయితీ వుంది! మేం అప్పుడప్పుడు ఆమెను ఓదార్చటానికి వెళ్లేవాళ్లం. పడుచుపిల్లలుఎవరైనా అడక్టులున్నారని వింటేచాలు ఆమెకు కన్నీరాగదు. ''నా చిన్నినాన్నా ఈ అలవాటు మానరా'' అని గుండెపగిలేలా రోదిస్తుంది.

కళ్లు మూసుకుని వింటున్న నాన్న ''కధలో అంత హాస్యం, వ్యంగ్యంఎందుకే? మరోవిషయం, కాలయాపన చెయ్యికుండా సింపుల్‌గా కధ చెప్పలేవా? ఇక చివరి విషయం ''అంటూ కాస్త వివరంగా,'' అంటే యిక ఒంటరి జీవితమే ఆమెకు మిగిలిందా? ఆమె జబ్బు మనిషే అని నువ్వు చెప్పదలచుకున్నావు''అంటూ వ్యాఖ్యానించాడు.

''అవును''

''పాపం, ఎంత అర్థంలేని పనిచేసింది. మూర్ఖురాలు. మూర్ఖులమధ్య గడిపితే మరేమవుతుంది? మొత్తం మీద కధ ముగించావు. అవునా?''

ఆర్గ్యూ చెయ్యిటం యిష్టంలేక,

''లేదునాన్నా. ఆమెకింకా నలభైకూడా నిండలేదు. ఇంకా ఎంతో జీవితం మిగిలివుంది. ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలదు. దురలవాట్లు మాని ఘనకార్యలు చేసినవాళ్లెందరులేరు! ఈ అనుభవం, యూనివర్సిటీలో బీయేలు,ఎమ్యేలు చేసిందానికన్నా ఎక్కువ పనికొస్తుంది.''

''కాని రచయిత్రిగా నువ్వెదుర్కొంటున్న సమస్యే అది. ట్రాజెడీ కధలు రాయిటంలో వున్న మజా మనుషులు మారతారని రాయిటంలో లేదు. ఎంతగొప్ప ట్రాజెడీ అయితే అంత పాఠకరంజకంగా వుంటుంది. పరాజితులను గురించి చదవటం పాఠకుల కెంతయిష్టమో!''

''ఆమె మారే అవకాశముందని చెప్పానుగా నాన్న.''

''కధల్లోనూ, జీవితంలోనూ బలహీనతలను అధిగమించి, పరిస్థితులను మార్చగలగిన మనుషులు కావాలి'' అన్నాడు నాన్న.

ఆయన మాటకు ఎదురు చెప్పకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. కాని కధ పట్ల నా బాధ్యతను విస్మరించలేను. ఆమె నాకు పరిచయస్థురాలే. అయినా ఆమె నేను సృష్టించిన పాత్ర. ఆమెను చూస్తే బాధగావుంది. బోసిపోయిన ఆ యింట్లో రోదిస్తున్న ఆ మనిషిని అలా వదిలెయ్యటం నాకిష్టంలేదు.

అందువలన

''ఆమె వ్యసనాన్ని అధిగామించింది. కొడుకు తిరిగి రాలేదుఅది వేరేవిషయం. ప్రస్తుతం ఆమె మాదకద్రవ్యరోగుల చికిత్సాకేంద్రాంలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. పేషెంట్ల సమస్యల్ని అందరికన్నా బాగా అర్థం చేసుకోగలిగింది తనే.''

''నీ లాంటి వాళ్లు మరో యిద్దరుంటే ఎంతబాగుండునో''అంటాడు డాక్టరు.

''డాక్టరు అలానిజంగా అన్నాడా? నువ్వు జోక్‌ చేస్తున్నావా?'' అన్నాడు నాన్న.

''అలా జరిగే అవకాశముంది నాన్నా. లోకంలో చాలా చిత్రాలు జరుగుతున్నాయి, చూడటం లేదూ.''

''లేదు పాత్ర స్వభావాన్ని బట్టి ఆమె అలవాటు మానుకునే అవకాశంలేదు.''

''ఇప్పుడామెకు మంచి వుద్యోగం వచ్చింది. గతాన్ని మరచిపోగలిగిన శక్తి ఆమెకుంది.''

''ఎన్నాళ్లులే. ఒకసారి అలవాటు పడితే మానటం ఎవరితరం. జీవితవాస్తవాల్ని ఎప్పుడర్థం చేసుకుంటావో.'' అంటూ ఆక్సిజన్‌ ట్యూబులు ముక్కుపుటాల్లో అమర్చుకుని, నైట్రోగ్లిసెరిన్‌ బిళ్లలు రెండువేసుకుని కళ్లు మూసుకున్నాడు నాన్న.
అనువాదం: సందీప్‌

దట్సాల్‌ ! యువరానర్‌

From July Vipula
దట్సాల్‌ ! యువరానర్‌
ఆర్‌.కె.కటారి
తెలుగు కధ
సాయం సంధ్యా సమయం. అప్పటివరకు ఆ ప్రాంతంపై ఆధిపత్యం నెరపుతున్న ఎండ తీక్షణతను తరిమికొట్టి చల్లగాలులు గ్రామీణులను సేదదీరుస్తున్నాయి.

ఆ సమయంలో... గృహ విజ్ఞాన శాస్త్ర డిగ్రీ చదువుతున్న విద్యార్థినులను గృహవిజ్ఞాన శాస్త్ర కళాశాల విద్యార్థినుల గ్రామీణ శిక్షణానుభవ కార్యక్రమంకి తీసుకువస్తున్నట్టుగా తెలియజేసే తెలుగులో రాసిన బేనర్‌ కట్టబడిన బస్సు ఊరి పొలిమేరలో ప్రవేశించి ఊరికి ఎడంగా వున్న చెరువు పక్క నుంచి ఊరిలోకి వెళ్ళిపోయింది. అలా చెరువు పక్కగా బస్సు పోతున్నప్పుడు ఆ చెరువు పరిసరాల అందాలు ఆవైపు సీట్లలో కూర్చున్న విద్యార్థినుల దృష్టిని ఆకర్షించాయి.

అది మంచినీళ్ళ చెరువు. అందులో నీటిని ఇతర పనులకు, అవసరాలకు వాడనివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్న నిస్వార్థపరులైన మునుపటి ఆ గ్రామపంచాయతీ పెద్దలు అభినందనీయులు! చెరువు చుట్టూ ఎత్త్తెన కట్ట, కట్టమీద చెరువు చుట్టూ కొబ్బరిచెట్లు, చెరువుకి కాపలా దారుడు కూడా వున్నాడు. రాత్రిపూట సరిసరాలు కనిపించటానికి, చెరువుకి ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి విద్యుద్దీపాలు ఏర్పాటుచేశారు. చెరువు పక్కనే పడమర వైపు ఊళ్ళోకి వెళ్ళేబాట. తూర్పువైపు మాగాణి పొలాలు.

పడమర వైపు కట్టమీద వున్న విశాలమైన మర్రిచెట్టు. చెట్టు మాను చుట్టూ మనుషులు కూర్చోడానికి సిమెంటుతో కట్టబడిన రచ్చపట్టు. చెట్టుకావల రాతి మండపం.

ఉదయ, సాయం సంధ్యల్లో బిందెలతో ఆడవాళ్ళు, కావిళ్ళతో మగవాళ్ళు చెరువులో మంచినీళ్ళు తీసుకెళుతుంటారు. రోజూ సాయంకాలం... తీరికగా వున్న గ్రామస్థులు చెరువు గట్టుమీదనో, మర్రిచెట్టు రచ్చపట్టు మీదనో కూర్చుని చల్లగాలిని అనుభవించటానికి వస్తారు.

చెరువు దగ్గరికి ఎవరు వచ్చినా రాకపోయినా ఒక వయోవృద్ధుడు మాత్రం ఎప్పుడూ ఆ ప్రదేశంలో వుంటాడు. అతను కొంతకాలంగా ఆ రాతి మండపాన్ని తన నివాస స్థలంగా వాడుకుంటున్నాడు. అతను కాషాయాంబరధారి వయసు చేతనో, సుదీర్ఘ జీవితానుభవాల చేతనో... భుజాల వరకు పెరిగిన తలవెంట్రుకలు, పొడవాటి గడ్డంతో కలిసిపోయిన గుబురు మీసాలు పూర్తిగా తెల్లబడిపోయి, అతని రూపం... భారత జాతీయ పతాకంలో కాషాయధవళ వర్ణాలు మనుష్యరూపం దాల్చినట్టుగా అతని ఎడల చూపరులకు గౌరవ ప్రపత్తులు ఏర్పడతాయి! అతని ముఖంలో ఉట్టిపడే వర్చస్సు వల్ల చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది! ఈ కారణాలవల్ల, ఉదాత్త ప్రవర్తనవల్ల, అతను అక్కడికి వచ్చిన కొత్తల్లో అక్కడ వుండటానికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు!

ఆ వృద్ధుడు రోజూ సాయంసంధ్యలో మర్రిచెట్టు కింద కూర్చుని, తంబురా మీటుతూ రకరకాల తత్వాలు పాడుకుంటాడు. వాటిలో ఎన్నో జీవిత సత్యాలు, వేదాంతం ఇమిడి వుంటాయి. అప్పుడు వీస్తుండే చల్లగాలి తరంగాలు అతని గానాన్ని గ్రామంలోకి ప్రసారం చేస్తాయి. వాటిపట్ల ఆకర్షితులైన వాళ్ళు వచ్చి అతని ఎదురుగా కూర్చొని విని ఆనందించటం అలవాటుగా మారిపోయింది.

భిక్షాటన చేయటం, తత్వాలు పాడుకోవటం, ఇతర సమయాల్లో ఆధ్యాత్మిక గ్రంధాలు చదువుకోవటం అతని దినచర్య. ఏ కోర్కెలూ లేవు, ఎవరికీ ఎటువంటి ప్రవచనాలు చెప్పడు. అతనొక అంతర్ముఖుడు! భగవంతుని పిలుపు కోసం నిరీక్షిస్తున్నానని చెప్పుకుంటాడు.

ఒక రోజు... ఒక స్త్రీ, జ్వరంతో మూసిన కన్ను తెరవకుండా వున్న అయిదారేళ్ళ బాలుణ్ణి భుజాన వేసుకొని వచ్చి వృద్ధుడి పాదాల చెంత పడుకోబెట్టి, తన బిడ్డకి వచ్చిన జ్వరం తగ్గిపోయేలా దీవించమని ప్రాధేయపడింది. ఇలా జరగటం ఇదే ప్రధమం!

తనూ వాళ్ళలాగే సామాన్యమైన మనిషినని, జీవితంలో చివరి దశ ప్రశాంతంగా గడపటానికి ఇక్కడికి వచ్చి వుంటున్నానని, తనలో ఎలాంటి దివ్యశక్తులు లేవని, ఆ బిడ్డ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడని, వెంటనే ఊళ్ళో వున్న ప్రాధమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్ళి డాక్టరు గారికి చూపించమని ఎంత నచ్చజెప్పినా ఆవిడ వినలేదు!

''స్వామీ! తమరు మహానుభావులు. మీ లాంటోళ్ళలో మహత్యం వుంటది. నాకా నమ్మకముంది! నాబిడ్డకి జొరం తగ్గిపోయేటట్టుగా దీవించండి సామీ!'' అని పట్టుబట్టింది.

''అమ్మా. నన్ను స్వామి అనికూడా అనవద్దు! నా మాట నమ్ము. నువ్వనుకుంటున్నట్టుగా నాలో ఏమహత్యం లేదు! ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకెళ్ళు... నా మాట విను తల్లీ!'' అని ప్రాధేయపూర్వకంగా చెప్పాడు.

అయినా ఆమె వినలేదు. ప్రాధేయపడుతూనే వుంది... గత్యంతరం లేక కళ్ళుమూసుకొని ఆ బిడ్డకు స్వస్థత చేకూర్చమని మనసారా భగవంతుణ్ణి ప్రార్థించి, ఆమె తృప్తికోసం బిడ్డ శరీరమంతా నిమిరి ఇక తీసుకెళ్ళమని చెప్పాడు. ఆమె సంతోషంగా బిడ్డని భుజం మీద పడుకోబెట్టుకొని ''దండంసామీ!'' అని చెప్పి వెళ్ళిపోతూంటే, ఆస్పత్రికి కూడా, తప్పక తీసుకెళ్ళమని గుర్తుచేశాడు.

వారం రోజుల తర్వాత మధ్యాహ్న సమయంలో వృద్ధుడు భిక్షాటనకు బయలుదేరబోతూ వుండగా, ఆమె తన పిల్లవాడిని నడిపించుకుంటూ మరో స్త్రీతో పాటు ఆయన దగ్గరకు వచ్చింది.

''ఏమ్మా? బాబుకి జ్వరం పూర్తిగా తగ్గిపోయినట్టుందిగా! అంటే నా మాట ప్రకారం ఆస్పత్రికి తీసుకెళ్ళి మందులిప్పించావన్నమాట! మంచిపని చేశావమ్మా'' అని మెచ్చుకోలుగా అన్నాడు.

''లేదు సామీ! తఁవరు దీవించారుగా. అందుకని నేనేడకీ తీసుకెళ్ళలా. మీ దీవెన తోనే జొరం తగ్గిపోయింది!'' అని చెప్పిందావిడ.

ఆమె మూఢభక్తికి ఆయనలో కించిత్‌ కోపం, అసహనం కలిగాయి! కాని, తాను అరిషడ్వర్గాలకు అతీతుడుగా వుండటానికి సాధన చేస్తున్నవాడు! ఈ మాత్రానికే తనకి కోపం రావచ్చునా? అని వగపుతో తనని తాను నిగ్రహించుకొని సాత్వికంగా చెప్పాడు.

''ఈ రోజుల్లో కూడా ఇంత గుడ్డినమ్మకాలు వుండకూడదమ్మా! వేల సంవత్సరాల క్రితం మహర్షులు, మహాయోగులు అడవులలో, హిమాలయ పర్వత ప్రాంతాలలో కరి౮నమైన తపస్సు చేసేవారు! అలాంటి మహాపురుషులకు దివ్యశక్తులు వాటంతటఅవే సిద్ధించేవి! ఈ రోజుల్లో అంటే అంత కరి౮నమైన తపస్సు చేసే బుుషులు ఎవరున్నారమ్మా! ఒకవేళ ఎక్కడైనా వుంటే అలాంటి వారికి దివ్యశక్తులు వుంటే వుండవచ్చు! కాని కాషాయ బట్టలు వేసుకున్న వారంతా స్వాములూ కాదు, బాబాలూ కాదు! అదేదో మామూలు జ్వరం అయివుంటుంది. మీరేవో కషాయాలూ అవీ యిస్తుంటారుగా! అందువల్ల తగ్గిపోయి వుంటుంది గాని నా మహత్యంవల్ల కాదు! ఒకవేళ అదే గనుక ఏదైనా విషజ్వరం అయుండి, మీరు నా మీద నమ్మకంతో ఆస్పత్రికి తీసుకెళ్ళకుండా వుండివుంటే, ఏదైనా జరగరానిది జరిగివుంటే అప్పుడు బిడ్డ కోసం అల్లాడేదెవరు?... వైద్య సదుపాయాలు బాగా పెంచి, ఊరూరా ప్రభుత్వంవారు, ఆస్పత్రులు వైద్యసౌకర్యంలు ఏర్పరుస్తూ వుంటే మీరు ఆ సౌకర్యాలు ఉపయోగించుకోకపోతే ఎలా? అంతేకాదు మీకు ఆ దోషముందని, ఈ దోషముందని వాటికి శాంతి చేయించాలని చెప్పి డబ్బు గుంజే దొంగస్వాములు వైద్యం తెలియకపోయినా తెలిసినట్టు నమ్మించి 'ఏదో ఒకటి చేసి ప్రాణాలకు ముప్పుతెచ్చే దొంగ డాక్టర్ల దగ్గరకి కూడా మీరెప్పుడూ వెళ్ళకండి! ఏ జబ్బు వచ్చినా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళండి. అక్కడ కూడా డబ్బులివ్వందే పనులు జరగకపోతే వాళ్ళ పైఅధికారులకి ఫిర్యాదు చెయ్యండి! అంతేకాని... గుడ్డి నమ్మకాలతో, చెప్పుడు మాటలతో పిల్లల ప్రాణాలకే కాదు పెద్దల ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చుకోకండి!... మళ్ళీమళ్ళీ చెబుతున్నాను దీవెనల కోసమంటూ ఇంకెప్పుడూ నా దగ్గరికి రాకండి. ఇకవెళ్ళండి'' అని హితబోధ చేయక తప్పలేదు.

ఆమె ఏమీ మాట్లాడకుండా, వృద్ధుడు ఎంత వారిస్తున్నా వినకుండా, పిల్లవాడిచేత ఆయన పాదాలకి మొక్కించి, తనూ మొక్కి, తనవెంట వచ్చిన స్త్రీచేత కూడా మొక్కించి... ఒక పరిశుభ్రమైన అరటి ఆకులో పొట్లం కట్టి తెచ్చిన పొంగలి అన్నం ఆయన చేతుల్లో పెట్టి, మళ్ళీ నమస్కారంచేసి వెంట వచ్చినావిడతో వెళ్ళిపోయింది.

వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అతనిలో అంతర్మధనం మొదలైంది.

ఆ స్త్రీకి హితబోధ చేశాడేగాని దానివల్ల అతనికి హితం చేకూరలేదు.

తమలో మహత్యం వున్న మహానుభావులెవరూ తమ గురించి గొప్పలు చెప్పుకోరని, ఆ వృద్ధునిలో ఏదో మహత్తు వుందని ఆ గ్రామంలో ప్రచారమైపోయింది! తరచుగా ఎవరో ఒకరు ఒంట్లో బాగోలేని పిల్లలనో, పెద్దలనో ఆయన దీవెనల కోసం తీసుకురాసాగారు.

వచ్చినవాళ్ళతో విసుగుచెందకుండా శాంతస్వభావంతో 'నేను ఎంత చెప్పినా మీరు నమ్మటంలేదు. మిమ్మల్నెందుకు నిరాశపర్చాలి! మీ తృప్తి కోసం మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించి దీవిస్తాను. అయితే మీరు మాత్రం నా దీవెనలందుకున్నాం గదా అని అంతటితో వూరుకోకుండా ఆస్పత్రికి కూడా తీసుకెళ్ళండి! ఏ విధంగానైనా వ్యాధి తగ్గటం కదా మీకు కావలసింది!' అని చెప్పి, వచ్చిన వారిని కాదనకుండా దీవించి పంపుతూనే వున్నాడు. వ్యాధి తగ్గినవాళ్ళు ఫలమో, పదార్థమో సమర్పించుకొని దండం పెట్టి వెళుతున్నారు.

ఈ పరిణామం స్వామిగా వ్యవహరింపబడే ఆయన్ని ఒక పరీక్షకి గురిచేసింది.

బాబాలను ఆసరా చేసుకొని, వాళ్ళని దైవస్వరూపులుగా చిత్రించి ప్రచారం చేసి తమ పబ్బం గడుపుకుంటూ, ఆ బాబాలు కాలం చేశాక వారిని ఆశ్రమంలోనే సమాధి చేసి దానిపై గుడి కట్టించి, దానికి ధర్మకర్తలై, ఆలయ ఆదాయాలను దోచుకుతింటున్న దొంగ భక్తులకు కూడా ఈ దేశంలో కొరత లేదు కదా!

స్వామి వారి విషయంలోను అదే ప్రయత్నం జరిగింది.

ఒక రోజు రాత్రి ఆ గ్రామ సర్పంచ్‌, ఆయన అనుచర వర్గం స్వామి వారి దగ్గరికి వచ్చారు.

''స్వామీ! తమరు సాక్షాత్తూ షిర్డీ సాయిబాబా అంశలాగున్నారు?'' అంటూ సంభాషణ పొగడ్తతోనే ప్రారంభమైంది!

''మహాపరాధం! నేను సామాన్య మానవుణ్ణి! దైవాంశ సంభూతులతో పోల్చకండి'' అని వినయంగా విన్నవించుకున్నాడు.

''స్వామీ. మేము లేనివేవీ కల్పించి చెప్పటం లేదే! తమరి జీవిత విధానం సాయిబాబాను పోలి వుండలేదా? బిక్షతో ఆకలి తీర్చుకుంటున్నారు. యోగముద్రలో కూర్చొని ధ్యానం చేసుకుంటారు. మీరు పాడే తత్వాల ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ప్రజలకు తెలియజేస్తున్నారు. మీ ఆకారాన్నిబట్టి అపర బ్రహ్మేంద్రస్వామిలా కూడా వున్నారు!''

''దయచేసి మీరు ఏ పనిమీద వచ్చారో సెలవీయండి''

''మీరింకా ముసలి వారైపోతే బిక్ష కోసం ఇంటింటికీ తిరగ్గలరా అప్పుడేమిటి మీ పరిస్థితి? ఎవరో ఒకరు ఇక్కడికి అన్నం తెచ్చిపెట్టాలి. ఎవరు తెచ్చిపెడ్తారు? మా వూరి ప్రజలకు ఇంత మేలు చేస్తున్న మాకు మాకు తోచిన సహాయం మేం చేయొద్దా? మా ఉద్దేశమేమిటంటే... ఒక్క మా పొట్టకి కావలసిన పట్టెడు మెతుకుల కోసం, ఎండనక వాననక మీరు ఇంటింటికీ తిరగక్కర లేకుండా, పూట పూట ఇక్కడికే తమకు టిఫిను, భోజనం తెచ్చిపెట్టే ఏర్పాటు చేయాలి! వేడికీ, చలికీ తట్టుకుంటూ ఇటువంటి రాతిమండపంలో మిమ్మల్ని ఇంకా పడుకోనివ్వటం మాకు అపచారం! అందుకని మేము ఆలోచించిందేమంటే... ఈ పక్కనే అన్ని సౌకర్యాలతో మీ కోసం ఒక కాటేజ్‌ కట్టిస్తాం. మీరెక్కడికీ వెళ్లనక్కర లేకుండా, ఎప్పుడూ మిమ్మల్ని కనిపెట్టుకొని వుండి మీకన్నీ సమకూర్చిపెట్టటానికి ఒక సేవకుణ్ణి నియమిస్తాం. మీ బెడ్‌రూం ఎ.సి. కూడా చేయిస్తాం! మా ఆలోచనని కాదనకుండా మీరు ఒప్పుకుంటే మా పనులు మొదలు పెట్టుకుంటాం. ఏమంటారు?'' అని అంగీకారం కోసం ఎదురు చూడసాగారు.

స్వామివారు కొద్ది క్షణాలు కనులు మూసుకొని మౌనంగా ఉండి కళ్లు తెరిచి, మందహాసంతో ''అయితే నన్నొక దేవుణ్ణి చేసి నాలుగు గోడల మధ్య బంధిస్తారన్నమాట!'' అన్నారు.

''అయ్యో! ఎంత మాట! వయసు మీరుతున్న మీరు సుఖంగా వుండాలని, మీ ధ్యానానికి ఎటువంటి అంతరాయం కలగకుండా వుండాలని, మీరు మా ఊళ్లోనే వుండి మా మీద మీ చల్లని దీవెనలను కురిపిస్తూ వుండాలని మా తాపత్రయం!'' అని అన్నాడు సర్పంచ్‌.

''మాటలెందుకుగాని, మీ ఆంతర్యం నాకు తెలుసు! జీవితానుభవంతోటి, లోకానుభవంతోటి నా తల ముగ్గుబుట్టలా తయారైంది. నేను అజ్ఞానాన్ని విడిచి ఆత్మజ్ఞానం కోసం తపిస్తున్న వాణ్ణి! నన్నీ లౌకిక లంపటంలోకి లాగకండి మీకు పుణ్యముంటుంది! నాకు అంతగా నడవలేని స్థితే దాపురిస్తే, ఎవరో ఒక మహా తల్లి నా మీద దయతలచి అంత ముద్ద పెట్టకపోతుందా! పెట్టకపోయినా ఫర్వాలేదు. భగవంతుడి పిలుపు కోసం ఎదురుచూస్తున్న వాణ్ణి! ఇక నేను దేని గురించి భయపడాలి బాధపడాలి?''

పెద్దలందరికీ కోపాలొచ్చేశాయి.

''మీ మంచి కోరి మేమేదో మీకు మేలు చేయాలనుకుంటే, ఊరి పెద్దలమైన మా మాటే కాదంటారా? మమ్మల్ని అనుమానించి అవమానిస్తారా?... సరే, అయితే!

ఒకవేళ తమరికి ఏ రోగమో, ధూమో తగిలి ఈ గట్టుమీదనే గుటుక్కుమన్నారనుకో! అసలే ఇది మంచినీళ్ళ చెరువు! మీ శవం నుంచి ఏ విషక్రిములో చెరువునీళ్ళలో కలిస్తే అప్పుడు మా గ్రామస్థుల గతేం కాను? అంతేకాదు. గ్రామ పంచాయతీ స్థలం పన్ను కట్టకుండా వాడుకోవడానికి వీల్లేదు. వెంటనే ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోండి!'' అని ఆదేశాలిచ్చారు సర్పంచ్‌ గారు.

''పన్ను గట్టటానికి ఆయన దగ్గరేముంది బూడిద! అదైనా వుండానికి ఆయన సాధువు కూడా కాదే!'' అన్నారెవరో వ్యంగ్యంగా

''చూశారా! కొద్ది నిమిషాల వ్యవధిలోనే మీరు నన్ను భూషించటం, దూషించటం మీరు నా దగ్గరికి భక్తితో వచ్చారో, యుక్తితో వచ్చారో తెలియజేస్తాయి. ఈ భూమి అంతా దేవుడి నివాసమే అయినప్పుడు ఈ భక్తుడికి ఆయన పాదాల చెంత ఇంత చోటే దొరకదా!... అలాగే. మీ ఆదేశం ప్రకారం ఈ చోటు ఖాళీచేసి వెళ్తాను. కాని ఇంత రాత్రిపూట వెళ్ళలేను కదా. రేపు పొద్దుటే వెళ్ళిపోతాను. అంతవరకు గడువివ్వండి'' అని అడిగాడు.

''సరే'' అంటూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయారు గ్రామ పెద్దలు.

* * *

తెల్లారింది.

తెల్లవారక ముందే ఈ వార్త ఊరంతా పొంగమంచులా వ్యాపించింది. మొదట చెవి కొరికినవాడు చెరువు కాపలాదారుడు చెంచయ్య!

సూర్యోదయ వేళ స్వామివారు కాషాయ గుడ్డ సంచులు భుజానికి తగిలించుకొని, చేత తంబురా పట్టుకొని, మండపం నుండి బయటికి వచ్చారు. అదే సమయంలో అక్కడికి ఒక స్త్రీ జన సమూహం చేరింది.

స్వామివారు వాళ్ళ ముఖాల్లోకి తేరిపార జూశారు. వాళ్లలో చాలామంది తమ దీవెనల కోసం వచ్చినవాళ్ళే. వాళ్ల ముఖాల్లో దిగులు కొట్టొచ్చినట్టు కనిపిస్తూంది.

ఆ సమూహంలోంచి మంగమ్మ ముందుకొచ్చింది. ఆమె ఎవరో కాదు స్వామివారి దగ్గరికి మొట్టమొదటిసారి, మూసిన కన్ను తెరవకుండా వున్న కుమారుణ్ణి దీవించమని తీసుకొచ్చినావిడ! ఆమెతో ప్రారంభమైన కధకి ముగింపే ఇప్పుడు స్వామి వారు ఈ ఊరు విడిచి వెళ్లవలసిరావటం!

''స్వామీ! ఎక్కడికెళ్తున్నారు?'' అని అడిగింది.

''ఊరు విడిచి వెళ్ళిపోతున్నానమ్మా! రాత్రి గ్రామ సర్పంచ్‌గారు చెప్పారు పన్ను కట్టకుండా గ్రామ పంచాయతీ స్థలం వాడుకోకూడదట. అందుకని ఈ స్థలాన్ని వెంటనే ఖాళీ చేయమన్నారు. వారి ఆదేశం ప్రకారం వెళ్ళిపోతున్నాను''

''అతనెవడు స్వామీ మిమ్మల్ని ఎల్లిపొమ్మని సెప్పటానికి? పంచాయతీ స్థలం ఆయన సొంతమా? మేమంతా ఎన్నుకుంటేనే ఆయన సర్పంచ్‌ అయ్యింది. ఆయన, ఆయన ముఠావోళ్ళు ఎన్నెన్ని పంచాయతీ స్థలాలు వాడుకుంటున్నారో మాకు తెలవదా? మీరేమన్నా ఆయన స్థలంలో వుంటున్నారా, పొలంలో వుంటున్నారా! ఊరందరికీ సెందిన సెరువు గట్టు మీద వుంటన్నారు. ఆ మాత్రానికే పన్ను గట్టాలా? ఆ మాట కొస్తే వాళ్ళు వాడుకుంటున్న స్థలాలన్నిటికీ పన్ను గడతన్నారా? సర్పంచికొకరూలు సాములోరికొకరూలా?'' అని తన వెంట వచ్చిన వాళ్లనుద్దేశించి అడిగింది.

''సెప్పండే! ఊరి పొలిమేరల్లో ఎలిసి గేమ పెజల్ని కాపాడే పోచయ్య పోలేరమ్మల్లాగ.. ఈ సామి గూడ ఊరి బయట వుంటా, మనల్ని దీవిస్తా జబ్బుల్ని తగ్గిస్తా కాపాడుతుండాడే! అట్టాంటి సామిని మనకి తెలవకుండా ఊరిడిసి ఎల్లటానికి రూల్లేదని తెగేసి సెబుదాం!! ఏమంటారే?''

''అంతే! అంతే! ఇప్పుడే ఎల్లి నిలదీద్దాం పదండి!'' అన్నారు ముక్తకంఠంతో.

అంతా వెళ్ళబోతుంటే ''అమ్మా! నీ పేరేమిటో?'' అని అడిగారావిడని.

''మంగమ్మ సామీ'' అని చెప్పింది.

''చూడు మంగమ్మా! నా గురించి సర్పంచ్‌గారితో గొడవెందుకు? అది ఊళ్లో వేరే కలతలకి దారితీస్తుంది. నేనెలాగూ దేశ సంచారినే! కాకుంటే ఇక్కడేదో నాకు బాగుండి ఎక్కువ కాలం వున్నాను. కొంతకాలం తర్వాతైనా వెళ్లవలసినవాడినే కదా! అందుకని మీరు సర్పంచ్‌గారి దగ్గరికి వెళ్ళకండమ్మా! నా దారిన నన్ను వెళ్ళనివ్వండి!'' అని మృదువుగా కోరారు.

''ఏంది సామీ! మీరు ఇక్కడే వుంటా, ఎప్పుడన్నా ఏ తీర్థయాత్రకో ఎల్లొస్తావుంటే అదొక దారి గాని, దొంగమాటలు సెప్పి మిమ్మల్ని ఎల్లగొట్టుటమేంది? అంతా వాళ్ళిస్టమేనా? మాకు సంబంధం లేదా? ఆళ్ల గూడుపుటాని మాకు తెలిసిందిలే సామీ! మీకు ఆశ్రమం ఏదో కట్టించాలని సెప్పి ఊళ్ల మీద పడి డబ్బులు దండుకొని, అందులో బొక్కినంత బొక్కి ఆనక మిమ్మల్నడ్డం పెట్టుకొని వాళ్ళ బొక్కసాలు నింపుకోవాలని ఆళ్ల ప్లాను! తమ రొప్పుకోకపోయేటప్పటికి ఆళ్ల అసలు రంగు బయటపడింది. ఆ మాత్రం తెలవని ఎర్రోళ్ళం కాదులే! మేము ఆడ జలమ ఎత్తి గాజులు తొడుక్కుంటున్నాం గాని, మేం తలుసుకుంటే మొగోళ్ళక్కూడా గాజులు తొడిగిస్తాం. ఆఁ... సామీ! మీరు మాత్రం మేం సర్పంచి కాడికి ఎల్లొచ్చేదాకా ఇక్కడ్నించి కదలొద్దు. ఎల్లారంటే నా మీద ఒట్టే! అటో యిటో తేల్చుకొని వస్తాం!... పదండే'' అంటూ ఆ సమూహాన్ని వెంటేసుకుని వెళ్లింది.

''నాది ఆధ్యాత్మిక మార్గమే అయినా, లౌకికపరంగా ఆలోచిస్తే, ఈ రోజుల్లో స్త్రీలలో ఈ చైతన్యదీప్తి కాలానుగుణ్యమే!'' అనుకున్నారు.

మంగమ్మ ఒట్టుకి కట్టుబడి అలాగే దాదాపు గంటసేపు కూర్చుండిపోయారు మండపంలో.

చెరువు కాపలాదారుడు చెంచయ్య ''స్వామివారికి జై! స్వామివారికి జై!'' అని జేజేలు కొట్టుకుంటూ సంతోషంతో చెంగుచెంగున ఎగురుకుంటూ స్వామివారి దగ్గరికి వచ్చాడు.

అతన్ని అభినయాన్ని చూసి నవ్వుతూ ''ఏమిటయ్యా. ఎందుకంత సంతోషపడిపోతున్నావ్‌?'' అని ప్రశ్నించారు.

''జయం మనదే స్వామి, జయం మనదే! బిడ్డకి జబ్బు చేసి ఆరోజున మీ దగ్గరికి దీనురాలు లాగ వచ్చిందిగాని, మంగమ్మంటే మాటలా! మంగమ్మంటే ఈ ఊరంతటికీ హడల్‌! 'మరి మొగుడేమీ అనడా' అని అనుకుంటారేమో. అసలామెకి సపోర్టు వాడే!! 'తప్పేం చేస్తోందిరా దాన్నడ్డుకోటానికి!' అంటాడు. ఆమె ఒక విషయం పట్టించుకుందంటే ఇక అది మంగమ్మ శపధమే! నేను గూడ ఆళ్లతో గాకుండా చాటుమాటుగా వెళ్లి అక్కడ జరిగిందంతా ఇన్నా. మీ దగ్గిర అన్నట్టే అన్నీ అడిగేసింది. సర్పంచిక ఏమీ పాలుపోక కోపంతో 'ఆముసలోడికి ఏ కలరా లాంటి రోగమో వచ్చి ఆ చెరువుగట్టు మీదనే చచ్చాడంటే, ఆ విషక్రిములు చెరువు నీళ్లలో చేరి అవి తాగి చచ్చేది మీరే!' అని అదొక వంక బెట్టుకొని దబాయించాడు. మంగమ్మ ఆయన్ని ఎట్టా వాయించిందో తెలుసా! ఎప్పుడూ దేవుణ్నే తలుసుకుంటాడు. అందరూ బాగుండాలని కోరుకుంటాడు. ఆయనకి దేనిమీద కోరిక లేదు. అట్టాంటి సాములకి 'ఏరోగాలు రావు. ఆ మాయ రోగలేవో లోకుల సొమ్ముతినే మీలాంటోళ్లకే వస్తయ్యి! అంతగా ఆ సాములోరి కేదైనా జబ్బుసేస్తే మా ఇళ్లల్లో పెట్టుకొని సేవ చేసుకుంటాం! ఆసామి పోయ్యేదాకా ఈడే వుండాలనుకుంటే ఉంటాడు. మళ్లీ ఆయన జోలికి ఎల్లారంటే మీకు మర్యాద దక్కదుఆఁ!' అని వార్నింగ్‌ ఇచ్చింది అని మహదానందంగా చెప్పాడు చెంచయ్య.

* * *

ఈ సంఘటన జరిగిన కొద్దిరోజులకే 'గృహ విజ్ఞాన శాస్త్ర కళాశాల' విద్యార్థినులను తీసుకొని వచ్చిన బస్సు ఊరిలోకి వెళ్లి సర్పంచ్‌గారి ఇంటి ముందు ఆగింది.

అందులో నుంచి మేడమ్స్‌ దిగి సర్పంచ్‌ గారిని కలిసి, 'రావే'కి విద్యార్థినులను తీసుకొని వచ్చా'మని, వాళ్లని వారికి కేటాయించిన ఇళ్లల్లో వదిలివెళ్తామని, ఊరి పెద్దలంతా విద్యార్థినుల బాగోగులు చూస్తూ ఉండమని విన్నవించుకొని, మరల బస్సులోకి వచ్చి కూర్చొని జాగ్రత్తగా మెలగమని, కాలేజికి చెడ్డపేరు తెచ్చే పనులేవీ చేయవద్దని విద్యార్థినులను హెచ్చరించి, వాళ్లని వాళ్లకి కేటాయించిన ఇళ్లల్లో అప్పజెప్పి బస్సులో తిరిగి వెళ్లిపోయారు.

విద్యార్థినులు తమ నిధులు సక్రమంగా, సజావుగా నిర్వహించుకుంటూ ఆయా కుటుంబాలలోని ఆడవాళ్ల అభిమానం సంపాదించుకున్నారు. దానికి ఈ అమ్మాయిలను వాళ్ల ఇళ్ల అడపడుచులుగానే చూసుకుంటున్నారు.

* * *

రోజులు గడుస్తున్నాయి...

ఇన్నాళ్లూ తమకి అప్పగించిన విధుల నిర్వహణలోని కొత్తదనం వల్ల, గ్రామప్రజలతో జాగ్రత్తగా మసలుకోమని మేడమ్స్‌ హెచ్చరించి వెళ్లినందువల్ల, మరో ధ్యాసలేకుండా విధులలోనే లీనమయ్యారు. ఇప్పుడు ఊళ్లో వాళ్లందరికీ తామెవరో, ఎందు కోసం వచ్చారో బాగా తెలిసిపోయింది. అందరూ తమని మన్ననతో చూస్తున్నారు. తాము ఊళ్లో ఎక్కడికి వెళ్లాలన్నా భయపడాల్సిన పనిలేదు.

మధ్యాహ్నానికల్లా తమ విధులు అయిపోతాయి. భోంచేసి, రికార్డు వర్కుపూర్తి చేసుకొని కొంతసేపు విశ్రమిస్తారు. ఇక సాయంత్రాలలో ఇళ్లవద్ద ఉండిపోవలసిందే! విధులు మొదలైనవన్నీ బాగా అలవాటైపోయాక సాయంసమయాల్లో ఊరికే ఇళ్ల వద్ద కాలం గడపటం అమ్మాయిలకి చికాకు కలిగించటం మొదలుపెట్టింది. కొంతసేపు ఉల్లాసంగా కాలక్షేపం చేయటానికి ఆ పల్లెటూళ్లో సినిమా హాలైనా లేదు. గ్రామం గనుక దాని చుట్టూ కనుచూపుమేర పొలాలు. కనీసం వాటివైపు వాహ్యాళికైనా వెళ్లిరాకుండా ఇళ్లకే పరిమితం కావటం బాగనిపించలేదు.

ఒక సాయంత్రం యాదృచ్చికంగా శర్వాణికి ఆఊరి చివర్న వున్న చెరువు విషయం గుర్తుకొచ్చింది. వాళ్లు ఆ గ్రామంలో ప్రవేశించే రోజూ ఆచెరువు, దాని పరిసరాల అందాలు చూసిన వాళ్లలో శర్వాణీ కూడా ఉంది.

మర్నాటి సాయంత్రం శర్వాణి తన స్నేహితురాళ్లతో బయలుదేరింది. చెరువుకట్ట ఎక్కి పరిసరాలు చూశారు. చెరువుకట్ట మీద చుట్టూ కొబ్బరి చెట్లు, పెద్దమర్రిచెట్టు ఒకవైపు, దానికి దగ్గరగా మండపం, చెరువు ఆవల అలలు అలలుగా ఊగుతున్న వరిపైరు... ఆ ప్రదేశమంతా ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా, నయానానందకరంగా ఉంది.

ఆ దృశ్యాలు అందరూ తన్మయులై చూస్తూ ఉండగా ఎవరో తత్వం పాడటం వినిపించింది. అప్పటివరకు తమ ధ్యాసనంతా నయానాల్లోనే కేంద్రీకరించినందువల్ల కర్ణాలు మూసుకుపోయినట్టయింది. కాస్త దృష్టి మరలగానే ఆగానం వాళ్ల చెవులకి సోకింది. శర్వాణికైతే తత్వం వినగానే ప్రాణం లేచి వచ్చింది.

పాడేది ఎవరా అని చుట్లూ చూసింది. ఎవరూ కనిపించలేదు. కారణం చాలా వెడల్పయిన ఆ మర్రిచెట్టు మానుకి, అవతలివైపున స్వామివారు కూర్చొని ఉండటమే. గానం వినిపిస్తున్న సామీప్యం, దిశ గమనించి శర్వాణి మర్రిచెట్టు ఆవలివైపుకి వెళ్లి చూసింది. వెనకాలే అమ్మాయిలంతా వెళ్లారు. కొత్తవాళ్లని చూడగానే స్వామివారు పాడటం ఆపేశారు.

''ఎందుకమ్మలూ అలా బిత్తరపోయి చూస్తున్నారు? నేనేమీ బుుషినీ, మునినీ కాదులే! నాకు అంతరాయం కలిగించారని శపించనులే! నేనూ మీలాంటి మామూలు మనిషినే. భయపడకుండా కూర్చోండి.

''మీలో ఇద్దరు ముగ్గురు ఊళ్ళో కనిపించారుగాని మీరెవరో తెలియక వూరుకున్నాను. మీ గురించి చెబుతారా?''

''చెబుతానుగాని, మొదట మిమ్మల్ని ఏమని పిలవాలో సెలవివ్వండి'' కాస్త వెనుకాడుతూనే శర్వాణి అడిగింది.

''ఎంత వద్దని చెప్పినా వినకుండా ఊళ్ళోవాళ్ళు 'స్వామీ' అని సంభోదిస్తున్నారు. మీరు నాకు మనమరాళ్ళతో సమానం! 'తాతయ్య' అని పిలవండి. చాలు!'' అన్నారు.

''ఉఁహూఁ! మిమ్మల్ని మామూలు తాతయ్యగా పిలవటం ఇష్టంలేదు. మేముకూడా 'స్వామిజీ' అని పిలుస్తాం. సరేనా?''

''మీ ఇష్టం!''

''స్వామీజీ. మేము చదివే కోర్సుకి సంబంధించిన అన్ని ఇంగ్లీషు పదాలకి సరైన తెలుగు పదాలు చెప్పలేం. మీరు ఇంగ్లీషు అర్థమౌతుందా?''

''బాగా''

''ఆఁ!''

''ఎందుకమ్మా అంతాశ్చర్యం? వేషభాషలకి సంబంధం లేదు... ఇక మీ వివరాలు చెప్పండి.''

''మేము హోంసైన్స్‌ డిగ్రీ చదువుతున్నాం. మూడవ సంవత్సరం ఒక సెమిస్టర్‌లో మాకు 'రావే' అనే కార్యక్రమం వుంటుంది. అంటే 'రూరల్‌ హోంసైన్స్‌ వర్క్‌ ఎక్స్పీరియన్‌ ప్రోగ్రాం' అని దాన్ని ఏదైనా ఒక గ్రామంలో జరపాలి. అన్ని ఏర్పాట్లూ మా మేడమ్స్‌ ముందుగా చేసి మమ్మల్ని తీసుకొచ్చి దిగవిడిచి వెళ్తారు. మమ్మల్ని కొన్ని బ్యాచ్‌లుగా విభజించి ఒక్కొక్క బ్యాచ్‌ని ఒక ఇంట్లో వుంచుతారు. మా భోజనం మేమే తయారు చేసుకుంటాం. ఈ ప్రోగ్రాం పూర్తయ్యే వరకు ఈ గ్రామంలోనే వుంటాం.

మా కోర్సులో 'ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌', 'చైల్డ్‌ డెవలప్‌మెంట్‌', 'ఫేమిలీ సోర్స్‌ మేనేజ్‌మెంట్‌', 'టెక్స్‌టైల్స్‌' మొదలైన సబ్జెక్ట్స్‌ వుంటాయి. వాటిని ఎలా అమలు చేస్తాం అనే వివరాలు చెప్పటం మీకు విసుగు కలిగించటమే అవుతుంది... ఇవీ క్లుప్తంగా మా గురించిన వివరాలు.

మేము సాయంత్రం పూట ఖాళీగానే వుంటాం! ఇన్నాళ్ళూ వర్క్‌మైండెడ్‌గా వుండటం వల్ల మరో ఆలోచన వుండేది కాదు. ఇప్పుడిప్పుడే సాయంకాలం ఈవెనింగ్‌ వాక్‌లా వెళ్ళకపోవటం బాగోలేదనిపించి, ఈ రోజుకి బయటపడ్డాం'' అంది శర్వాణి.

''మంచిది అమ్మలూ, మీరు రోజూ ఇక్కడికి వచ్చి కొంతసేపుండి పరిశుభ్రమైన గాలి పీల్చుకోవటం ఆరోగ్యానికి, మానసికోల్లాసానికి మంచిది. మీకు తెలియదని చెప్పటంలేదు. ఈవేళలో మీకు వేరే పనేమీ వుండదంటున్నారు గనుక రోజూ వచ్చి వెళ్తూ వుండండి'' అని సలహాయిచ్చారు.

''తప్పక వస్తాం స్వామిజీ. కాని, మీ గురించి కూడా మాకు చెప్పాలి. ఇంగ్లీసు బాగా వచ్చన్నారు. మరిలా తత్వాలు పాడుకుంటూ ఒంటరిగా ఎందుకుంటున్నారు? మీ నివాసమెక్కడ? లేక మీరు సన్యసించారా?''

''నేను సన్యాసినికానమ్మా, సన్యసించటమంటే కామ్యకర్మములను విడిచి ఆత్మజ్ఞాన సముపార్జనకై జీవితమంతా భగవంతుని ధ్యానంలో గడపటం! మొదట నేను సంసారినే! భార్యా బిడ్డలందర్ని కోల్పోయి ఒంటరినై, జీవిత చరమాంకాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడపాలని ఇలా సన్యాసిలాగే జీవితం గడుపుతున్నాను. నాది మధుకర వృత్తి'' అని వాళ్ళ ముఖాలలోకి చూసి అర్థం కాలేదని గ్రహించి ''అంటేభిక్షాటన'' అని వివరించారు.

అమ్మాయిల ముఖాలలో ఆశ్చర్యంతోపాటు బాధకూడ చోటు చేసుకుంది!

''స్వామిజీ, భార్యబిడ్డలు లేకపోవచ్చుగాక మీ ఆధ్యాత్మిక చింతన మీ ఇంట్లోనే చేసుకోవచ్చుగా?''

''నాకు ఇల్లు లేదమ్మా''

''మరిప్పుడెక్కడుంటున్నారు?''

''ఇక్కడే అదిగో ఆ మండపమే నా నివాసం''

''మరి వర్షాకాలంలో, ఎండాకాలంలో, చలికాలంలో ఇంత ఓపెన్‌ప్లేస్‌లో ఎలా వుండగలరు?'' శర్వాణి ప్రశ్నలో ఆందోళన ధ్వనించింది.

''ప్రతి ఊళ్ళో ఒక దేవాలయం వుంటుంది కదమ్మా! అటువంటి కాలాల్లో, ఈ ఊళ్ళో వున్న పెద్ద రామాలయమే నాకు శ్రీరామరక్ష!'' నిశ్చింతగా చెప్పారు స్వామీజీ.

ముఖంలో దుఃఖఛాయలు తారాడుతుండగా శర్వాణి అడిగింది.

''స్వామీజీ! మీరు భార్యా బిడ్డల్ని కోల్పోయిన ఒంటరి వారన్నారు. ఇల్లు లేదన్నారు. ఇదంతా ఎలా జరిగిందో... అభ్యంతరం లేకపోతే మీ కుటుంబ గాధ చెప్పగలరా?''

''ఇప్పుడు కాదమ్మా! మరోరోజు చెబుతాను''

* * *

ఆ తర్వాత వాళ్ళ మేడమ్స్‌ వచ్చినందువల్ల రెండురోజులు స్వామీజీ దగ్గరికి వెళ్ళలేక పోయారు. మూడవరోజు స్వామివారి కధ వినటానికి మొదటిరోజు కన్నా ఉత్సాహంగా బయలుదేరారు.

వారిని కూర్చోమని చెప్పి, స్వామీజీ మొదలుపెట్టారు.

''మేము ఐశ్వర్యవంతులమే. నేను కాలేజి లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరి ప్రిన్సిపాల్‌గా రిటైరయ్యాను. నా భార్య అనుకూలవతి, ఆస్తికురాలు. ఎప్పుడూ పూజలు, పునస్కారాలు, భగవద్గీత పారాయణం చేస్తూ వుండేది. నేను ఆస్తికుడనీ కాను నాస్తికుడనీ కాను. కాని, నా భార్య భగవద్గీత పారాయణం చేస్తూ వుంటే కొన్ని అంశాలు నాచెవిని పడుతూండేవి. ఆ విధంగా పరోక్షంగా నాకు భగవద్గీతతో పరిచయం ఏర్పడింది.

మాకు ఆలస్యంగా పిల్లలు పుట్టటం వల్ల నేను రిటైరయ్యే నాటికి మా ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురు పెళ్ళీడుకొచ్చారు. కొడుకు ఇంజనీరయ్యాడు. వేరే రాష్ట్రంలో ఉద్యోగం వచ్చింది. అమ్మాయి యం.ఎ., పి.హెచ్‌.డి. చేసి నాలాగే లెక్చరరై నేను రిటైరైన కాలేజిలోనే చేరింది. అదే కాలేజిలో మరో లెక్చరర్‌తో సంబంధం కుదిచి పెళ్ళి చేశాం. అప్పటి వరకు మా కుటుంబం అనే నిఘంటువులో 'కష్టం', 'దుఃఖం' అనే పదాలకు తావేలేదు. ఆ తర్వాతే ఆ రెండూ మా కుటుంబంలో చాపకింద నీరులా ప్రవేశించాయి.

మొదట నా కూతురి బతుకులో విధి వికట్టాహాసం చేసింది!

మా కూతురు గర్భవతై మమ్మల్నందర్నీ ఆనందడోలికల్లో ఓలలాడించింది. మనవడో, మనవరాలో పుట్టి మాకు మంచి కాలక్షేపం అవుతుందని నేను, నా భార్య ఊహలోకాల్లో విహరించాము. కాని, మా ఊహలు గాలిమేడలే అయ్యాయి!

నెలలు నిండకముందే ఒకరోజు కడుపులో భరించరాని నొప్పి, రక్తస్రావం. మేము భయపడి వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. డాక్టర్‌ పరీక్ష చేసి, లోపల బిడ్డ చనిపోయిందని, ఆలస్యం అవటం వల్ల పరిస్థితి ప్రమాదకరంగా వుందని చెప్పి వెంటనే ఆపరేషన్‌ ధియేటర్‌లోకి తీసుకెళ్ళారు. మా అల్లుడు చేత ఏదో స్టేట్‌మెంట్‌ మీద సంతకం పెట్టించుకున్నారు.

లోపలికి తీసుకెళ్లి పరీక్షలు చేసి కాస్సేపటికి 'సారీ! మా దగ్గరికి తీసుకొచ్చేసరికి కండిషన్‌ సీరియస్‌గా వుంది. ప్రొఫ్యూస్‌ బ్లీడింగ్‌ కంట్రోల్‌ కానందువల్ల పెద్ద ప్రాణాన్ని కాపాడలేకపోయాము!' అని చెప్పి డాక్టర్‌ వెళ్ళిపోయింది.

మా అందరి గుండెల్లో పిడుగులు పడ్డాయి! ఆ మాట వినగానే నా భార్య బిగ్గరగా రోదిస్తూ కుప్పకూలి స్పృహ తప్పిపడిపోయింది! ముందు ఆమెని రక్షించటం మా తక్షణ కర్తవ్యమైంది. హాస్పిటల్లో చేర్పించాం.

నా కూతురు చనిపోయిన పరిస్థితుల్లో అంత్యక్రియలు ఆలస్యం చేయకూడదని, పైగా నా భార్యకి ఈలోగా స్పృహ కోల్పోయి కోమాలోకి పోయే ప్రమాదం లేకపోలేదని, అందుచేత అంత్యక్రియలు వెంటనే జరిపించటం మంచిదని డాక్టర్లు సలహాయిచ్చారు. వాళ్ళ సలహా ప్రకారం అందుబాటులో వున్న బంధుజనానికి కబురంపి, ఆచార వ్యవహారాల జోలికి పోకుండా శవాన్ని హాస్పిటల్‌ నుంచే తీసుకెళ్ళి అంత్యక్రియలు జరిపాం.

మర్నాడు నా భార్య స్పృహలో కొచ్చింది. కూతురి అంత్యక్రియలు జరిగిపోయిన సంగతి తెలుసుకొని నానా గొడవ చేయటం మొదలుపెట్టింది. మేమెంత నచ్చచెపుతున్నా వూరుకోవటం లేదు. చివరికి డాక్టర్‌ వచ్చి 'నువ్వున్న అనారోగ్య పరిస్థితిలో కూతురి శవాన్ని చూస్తే, ఆమెకి తోడుగా నువ్వూ శవమై వుండేదానివి! కామ్‌గా పడుకో' అని కరి౮నంగా కసిరేసరికి వూరుకుంది!

ఆ మర్నాడే కార్తీకపౌర్ణమి ఇన్నాళ్ళూ దుఃఖంలో మునిగి ఏ విషయంలోను ఆసక్తి లేకుండా గడుపుతున్న నా భార్యకు ఆ విషయం ఎవరు చెప్పారో, ఆమె మనసు కొత్త ఉత్సాహంతో నిండిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచే ఇల్లు కడగటం, గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టటం, పూజా మందిరం కూడా శుభ్రం చేసేసరికి, సాయంత్రమైంది. శివపార్యతుల పటం, ఇతర దేవుళ్ళ పటాలు ముందేసుకొని కూర్చొని గుడ్డతో తుడుస్తూ నన్ను పిలిచి.. రేపు ధరలు మండిపోతాయి. పైగా నేను వేకువజామునే గుడికి వెళ్ళాలి కదా, ఈ పూటే వెళ్ళి తీసుకురండి అని పూలు, పళ్లు, ఇతర వస్తువుల జాబితా చెప్పింది. నేను సంచి తీసుకొని బజారుకి వెళ్ళాను. వచ్చేసరికి అంతా అయిపోయింది.

కూతురు జ్ఞాపకం వచ్చి ఆ పటాన్ని కూడ శుభ్రం చేద్దామనుకొని, స్టూలు వేసుకొని దానిమీద ఎక్కి పటాన్ని చేతుల్లోకి తీసుకొని వుంటుంది. తుడుస్తున్నప్పుడు కూతురి మృతి సందర్భం గుర్తుకు వచ్చి దుఃఖంతో పరధ్యానంగా కదిలి పాదం స్టూలు అంచున వేయగా అది ఒరిగిపోయి దాంతోపాటు వెల్లికిల పడిపోయి వుంటుంది. దెబ్బ ఆయువు పట్టున తగిలి వెంటనే ప్రాణం పోయింది. చూడ్డానికి వచ్చిన వాళ్ళు 'ఇదేం ఖర్మ! కూతురు చనిపోయి నాలుగు నెలలైనా కాలేదు ఇంతలోనే తల్లి కూడా పోవటమేమిటి! ఈ ఇంటికేదో శనిపట్టుకుంది!' అని బాధపడ్డారు.

తెల్లవారి అంత్యక్రియలు పూర్తయ్యేవరకు నేను నా కుమారుడు సూర్య పక్కనే వుండి ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకున్నాను. పెద్ద కర్మ రోజు వరకు, రోజులో ఎక్కువ భాగం నిద్రపోయేవాడు. మిగతా సమయాల్లో ముభావంగా వుండేవాడు. ఎలాగో పెద్దకర్మ కూడా ప్రశాంతంగానే గడిచిపోయింది.

మరో వారంరోజులు గడిచాక 'ఇక నేనిక్కడ వుండలేను. డ్యూటీకి వెళ్తా'నన్నాడు. ఒక్కడినే పంపటం ఇష్టం లేకపోయినా, ఒక విధంగా అదీ మంచిదేనని, పనిలోపడి కొంతవరకైనా అమ్మ విషయం మర్చిపోతాడని ఒప్పుకున్నాను.

క్షేమంగా చేరానని ఫోన్‌ చేశాడు.

వాడు ఫోన్‌ చేసిన నాలుగు రోజులకే మళ్ళీ ఫోన్‌ వచ్చింది. మా వాడి నుంచి కాదు. వాడి సహోద్యోగి నుంచి ''మీ అబ్బాయికి యాక్సిడెంట్‌ జరిగింది. హాస్పిటల్‌లో చేర్పించాం. వెంటనే రండి'' అని చెప్పి హాస్పిటల్‌ పేరు, ఎక్కడున్నదీ కూడా చెప్పాడు.

నాకు ముచ్చెమటలు పోశాయి. నవనాడులు కుంగిపోయాయి.

ప్రయాణానికీ అతడే ఏర్పాట్లు చేశాడు. వెంటనే బయలుదేరాం. హాస్పిటల్లో సూర్య స్పృహలేని స్థితిలో వున్నాడు. చాలా సేపటికి సూర్య చిన్నగా మూలగటం వినిపించింది.

ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూంటే, నా చెవి సూర్యనోటికి దగ్గరగా వుంచాను. మాటలు సరిగా వినపడనంత బలహీనంగా వున్నాయి. జాగ్రత్తగా విన్నాను.

'నాన్నా! నేను స్కూటర్‌ మీద ఆఫీసుకి పోతుంటే దగ్గర నుంచి 'సూర్యా' అని అమ్మపిలిచినట్టు అనిపించి అప్రయత్నంగా స్కూటర్‌కి సడెన్‌బ్రేక్‌ పడింది. నా వెనకాలే వస్తున్న సిటీబస్‌ నన్ను గుద్దేసింది. అంతే! తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడే కళ్ళు తెరిచి మిమ్మల్నే చూస్తున్నాను!' అని చెప్పగానే నా పక్కనే వున్న వాళ్ళ బావని కూడా చూపిస్తే చూశాడు. ''నా చివరి గడియల్లో మీరు నా దగ్గరున్నారు. నాకదే తృప్తి! అమ్మ లేకుండా నేను బ్రతకలేను!'' అని వెర్రిచూపులు చూస్తూ 'అదిగో! అమ్మ పిలుస్తోంది. వెళ్తాను. వస్తున్నానమ్మా!'' అంటూనే కళ్ళు తేలేశాడు.

నాతో ఆ రెండు మాటలు చెప్పటానికే వాడి బొందిలో ప్రాణముందన్నమాట!

మర్నాడు మధ్యాహ్నానికి పోస్ట్‌మార్టం జరిపిన సూర్య శవాన్ని మాకప్పగించారు. ఆ శవాన్ని అంత దూరం సొంత వూరికి తీసుకెళ్ళటం మంచిదికాదని, అప్పటికి, 'డికంపోజ్‌' అవుతుందని, అక్కడే అంత్యక్రియలు జరపటం మంచిదని సూర్య సహోద్యోగులు సలహా యిచ్చారు. అలాగే చేశాం.

పుట్టుట ఎక్కడో! గిట్టుట ఎక్కడో! అంతా విధి ఆడించే నాటకం!

నేను ఒక్క సూర్య శవానికే కాదు అదే క్షణంలో నా లౌకిక బంధాలన్నిటికి తలకొరివి పెట్టాను!

నాలో వైరాగ్యం మొలకెత్తింది. ముందుగా నా భార్య నిత్యం నిష్ఠతో పరి౮ంచే భగవద్గీత క్షుణ్ణంగా చదివాను. ఆధ్యాత్మిక గురువులైన మహాత్ముల ప్రవచనాలు, జీవిత చరిత్రల గ్రంధాలు కూడా కొని చదివాను. భగవద్గీతలో చెప్పిన 'ఆత్మజ్ఞానమునందు మనసు లగ్నము చేయుట, మోక్షప్రాప్తియందు దృష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు వానికి ఇతరములైనవి అజ్ఞానములనియు చెప్పబడును' అనే గీతా వాక్యం నాకు మార్గదర్శకమైంది!

తర్వాత పుణ్యక్షేత్రాలన్ని సందర్శించాను. కాని, గీతాసారానువర్తన ప్రవర్తన పూర్తిగా ఏ పుణ్యక్షేత్రంలోను చూడలేకపోయాను. ఆధ్యాత్మికత కూడా వ్యాపారమైంది. యోగులనబడే వారిలో రోగులను బుుషులనబడే వారిలో కాపురుషులను చూశాను. 'అన్ని ధర్మముల కంటే స్వధర్మమే శ్రేష్ఠము'' అని గీతాకారుడు చెప్పినట్టుగా నేను స్వధర్మాన్నే పాటించాలని నిశ్చయించుకున్నాను. అన్ని అనర్థాలకు మూలకారణం 'నేను, నాది' అనే భావనే అని గ్రహించాను!

నాకంటూ ఏమీ లేకుండా చేసుకోవాలనుకున్నాను. నేనేం చేయదలుచుకున్నది నా అభిప్రాయాలను నా అల్లుడితో చెప్పాను. ''తమ అభీష్టం ప్రకారం చేయండి!'' అన్నాడు అల్లుడు.

అంతే! నా ఆస్తినంతా అనాధ శిశు శరణాలయానికి దానంగా రాసియిచ్చాను.

పగటిపూట అయితే నన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోవటాలు, ప్రశ్నలడగటాల సంకటస్థితిని తప్పించుకోవటానికి ఒకరోజు రాత్రి పొద్దుపోయాక ఇంటినుంచి బయటపడ్డాను. మా అల్లుడొక్కడే మా ఇంటి ముందు నిలబడి చేయూపుతూ వీడ్కోలు చెప్పాడు.

సన్యాసి అయినా, బైరాగి అయినా బతకాలిగా! మన సంస్కృతిలో జీవితమంతా అధ్యాత్మిక చింతనలోనే గడిపేవారు మధుకర వృత్తిని చేపట్టటం సంప్రదాయమే ఆదరణీయమే! అందుకే నేనూ ఆ వృత్తిని చేపట్టి దేశాటన మొదలు పెట్టాను. పల్లెలు పట్నాలు తిరిగాను. ఈ ఊళ్ళో ఈ చెరువు పరిసరాలు ఊళ్ళో పెద్ద రామాలయం నా మనుగడకి నచ్చి కొంతకాలంగా ఇక్కడే స్థిరంగా వుంటున్నాను! ఇదీ నాకధ!'' అని ముగించారు.

అమ్మాయి లెవరూ మాట్లడలేదు. అందరూ దుఃఖసాగరంలో మునిగి అప్పుడే తేలుతున్నారు! కొందరు మధ్యలో ఏడ్చినట్టుగా, కనీసం తుడుచుకోవటం మరిచిపోయినట్టుగా వాళ్ళ బుగ్గలపై ఎండిన కన్నీటి చారికలు కనిపించాయి. స్వామిజీ మనసు చివుక్కుమంది!

'నాదొక సలహా! మీ చదువులన్నీ పూర్తయాక అందరూ భగవద్గీత కొని నిత్యం చదవండి? రాగద్వేషాలకి, దుఃఖ వ్యామోహాలకి లోనుగాకుండా స్థిరచిత్తంతో ప్రశాంతమైన జీవితం గడపగలుగుతారు.! పాటిస్తారు కదూ?''

''తప్పకుండా స్వామీజీ!.. ఇక మేం వెళ్లొస్తాం''.

''మంచిది తల్లీ!'' అని స్వామీజీ వాళ్ళని కొంతదూరం సాగనంపివచ్చారు.

శర్వాణికి స్నేహితురాళ్ళు తోడొచ్చినా రాకపోయినా, వీలైనప్పుడల్లా స్వామీజీ దగ్గరికెళ్ళి తత్వాలు విని రావటం అలవాటైంది.

అయితే... ఆ ఊళ్ళో కొద్ది రోజుల క్రితమే రెండు కళ్ళు శర్వాణిని మొదటిసారిగాచూసి ఆశ్చర్యంతో వెడల్పై తర్వాత ఆలోచనతో ముకుళించుకు పోయాయి. ప్రతిరోజు ఆకళ్ళు ఆమె కదలికల్ని గమనిస్తున్న విషయం ఏ రెండో జత కళ్ళకీ తెలియదు!

ఒక రోజు వేర్వేరు కారణాలతో శర్వాణి స్నేహితురాళ్ళెవరూ రాకపోయినా ఒక్కర్తే స్వామిజీ దగ్గరికి బయలుదేరింది. ఆరెండు కళ్ళూ చాటుగా వెంబడించాయి.

శర్వాణి చెరువు దగ్గరికి వెళ్ళేసరికి స్వామీజీ చెరువు కాపలాదారుడు లేరు, చల్లగాలి కోసం వచ్చే మనషులూ ఎవరూలేరు! తనవెంట స్నేహితురాళ్ళెవరూ రాకపోవటం, ఇక్కడా నిర్మానుష్యంగా వుండటం నమ్మలేనంత వింతగా అనిపించింది శర్వాణికి! తన అనుభవంలో ఇది మొదటిసారి కావచ్చుగాని, ప్రకృతిలో ఇలాంటి సందర్భాలు ఎక్కువసార్లే సంభవిస్తుంటాయి!

'పోనీలే, చల్లగాలికి కొంతసేపు కూర్చుంటాను. ఈలోగా స్వామీజీ వస్తేసరి, లేకపోతే వెళ్ళిపోతాను' అనుకొని శర్వాణి మర్రిచెట్టు అరుగు మీద కూర్చుంది.

శర్వాణి ఒంటరిగా వున్నా, అది ఎత్తుగావున్న బహిరంగ ప్రదేశం అయినందువల్ల, ఆ రెండు కళ్ళూ ఆమెను సమీపించటానికి సాహసించలేకపోయాయి.

శర్వాణి చాలాసేపు చూసినా స్వామీజీ రాలేదు. ఎక్కడో పొలాలలో అక్కడక్కడ రైతుల సంచారం వుందిగాని చెరువు వైపు ఎవరూ రావటంలేదు. సూర్యాస్తమయమై చీకటి పడుతుండగా ఇంటికి బయలుదేరింది.

దారిలో చెరువుకి దగ్గరగా బాటపక్కన పొదల మాదిరిగా పెరిగిన చెట్లదాపుకి వచ్చేసరికి వెనకగా ఎవడోవచ్చి ఒకచేత్తో శర్వాణి నోరు గట్టిగా మూసి, మరో చెయ్యి నడుంచుట్టూ వేసి పైకెత్తి బలవంతంగా చెట్ల చాటుకీ తీసుకెళ్ళాడు. శర్వాణి బలమంతా ఉపయోగించి పెనుగులాడి వాడి పట్టునుంచి విడిపించుకొని 'ఎవడా!' అని వాడి ముఖంలోకి చూసి 'నువ్వా' అని నివ్వెరపోయింది!

''అవును నేనే! మిస్టర్‌ చంద్రజయచంద్రని!'' అన్నాడతను వీరత్వం ప్రదర్శిస్తున్నట్లుగా

జయచంద్ర అగ్రికల్చర్‌ కాలేజి విద్యార్థి. హోంసైన్స్‌ కళాశాల విడిగా వున్నప్పటికి, కొన్ని సబ్జెక్ట్స్‌లో క్లాసులకి మాత్రం ఆ విద్యార్థినులు అగ్రికల్చరల్‌ కాలేజీకి రావాలి.. వాళ్ళకి విడిగా హాస్టల్‌ లేక అగ్రికల్చరల్‌ కాలేజి హాస్టల్లోనే వుండేవారుకూడా.

శర్వాణి ఆ సంవత్సరమే హోంసైన్స్‌ కళాశాలలో చేరింది.

జయచంద్ర అందగాడు, డబ్బున్నవాడు, కొసమెరుపుగా పొగరుబోతు కూడా.

శర్వాణి సౌందర్యవతి తన సీనియర్లలోకూడా తనని మించిన అందగత్తెలు లేనందువల్ల 'కాలేజీ బ్యూటీ'గా పేరుబడింది. జయచంద్ర కన్ను శర్వాణి మీద పడింది. హాస్టల్లో వున్నప్పుడు చాలాసార్లు శర్వాణితో మాట్లాడాలని ప్రయత్నించాడు గాని శర్వాణి ఎప్పుడూ స్నేహితురాళ్ళతో వుండటంతో వీలుపడలేదు. ఒకసారి ఒంటరిగా హాస్టల్‌కి వెళ్ళటం చూసి వెంబడించి పలకరింపులేం లేకుండా డైరెక్టుగా, పొగరుగా ''హాయ్‌! ఐలవ్‌యూ!'' అన్నాడు. ''ఐ హేట్‌యు!'' అని కోపంతో జవాబిచ్చి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది!

జయచంద్రకి ఘోరవమానమైంది! తలకోట్టేసినట్టయింది! ప్రతీకారం ఎలా తీర్చుకోవాలా అని సమయం కోసం చూస్తుండగా... ఆపైన రెండు నెలలకే, హోంసైన్స్‌ కళాశాల ఆవరణలోనే నిర్మిస్తున్న వాళ్ళ హాస్టలు పూర్తయి, ఆ విద్యార్ధినులందర్ని అక్కడికి తరలించారు.

జయచంద్ర ప్రతీకారం తీర్చుకోటానికి అదొక పెద్ద ఆటంకమైంది!

శర్వాణి మూడో సంవత్సరంలోకి రాగానే జయచంద్రకి డిగ్రీపూర్తయి అగ్రికల్చర్‌ కాలేజి వదిలివెళ్ళాడు.

''ఇన్నాళ్ళూ కాపేసి ఇక్కడ దాకా వచ్చావన్నమాట!'' అంది ముఖం అసహ్యంగా పెట్టుకొని. అతను నవ్వి ''నేను రావడమేమిటి. నువ్వే నా దగ్గరకొచ్చావ్‌! ఇది మా ఊరు'' అన్నాడు. అది అతని ఊరన్నా శర్వాణి జంకలేదు. ''మీ ఊరైతే?'' అనిప్రశ్నించించి.

''అప్పుడు ఐ హేట్‌యు'' అని నన్ను షేమ్‌ చేశావు. ఇప్పుడు నిన్నుషేమ్‌ చేద్దామని వచ్చాను!'' అన్నాడు కసిగా.

''ఐ హేట్‌ యు'' అని అనడమే షేమ్‌ చేయటమైతే నువ్వూ నన్ను అను. మాటకిమాట, నీ కోపం తీరిపోతాయి!''

''అతి తెలివి ప్రదర్శించకు. నేను నిన్ను షేమ్‌ చేయబోతోంది మాటలతో కాదు చేతలతో!''

''ఏంచేస్తావేం?''

''నిన్ననుభవిస్తాను!''

''నోర్ముయ్‌! నేను గనుక సర్పంచ్‌తో చెప్పానంటే, నువ్వనుభవించేది నన్నుకాదుశిక్షని!'' ధీమాగా హెచ్చరించింది.

గేలిగా నవ్వాడతను.

''ఎందుకా వికారపునవ్వు?''

''నీ అజ్ఞానానికి, నేను ఆయన పుత్రరత్నాన్నే!''

''అయితే ఇప్పుడేవెళ్ళి ఊరంతా టాంటాం చేస్తాను!''

''ఏమని! నేను చెడిపోయానహో అనా?''

''ఏం కూశావురా!'' అని అతని చెంప పగలగొట్టి పారిపోవడానికి ప్రయత్నించింది. అతను రోషంతో రెచ్చిపోయిమళ్ళీ గట్టిగా వాటేసి పట్టుకున్నాడు.

''రక్షించండి! రక్షించండి!'' అని శర్వాణి పెద్దగా అరవసాగింది.

అతడు క్షణం ఆలోచించాడు. ''ఇది అసలే పల్లెటూరు. కేకలు విని ఏ ఒక్కరు వచ్చి చూసిన అంతా రసాభాస అవుతుంది''. అనుకొని శర్వాణి నోరు గట్టిగా మూసి ప్లేటు ఫిరాయించాడు.

''శర్వాణీ. ప్లీజ్‌! ఒక్కసారి మాత్రమే. తర్వాత నీ జీలికి వస్తే ఒట్టే! ఇక్కడ ఎవరూ లేరు. ఎవరికీ తెలియదు! ప్లీజ్‌! ప్లీజ్‌!''.

శర్వాణి మళ్ళీ తన శక్తినంతా ఉపయోగించి పట్టువిడిపించుకొని ''చీ౫! సిగ్గులేదురా? ఇదే కోర్కె నీ చెల్లినో, అక్కనో ఎవడైనాకోరితే నువ్వు సహిస్తావా?''రోషమొచ్చి ''ఏయ్‌! ఆపు నీపాతచింతకాయ పచ్చడి డైలాగు!''అన్నాడు అసహనంగా.

''పాతచింతకాయపచ్చడి ఎంతశ్రేష్ఠమో, ఈ డైలాగ్‌ కూడ అంత ఎవర్‌గ్రీన్‌! దమ్ముంటే నా ప్రశ్నకు జవాబు చెప్పు!'' అంది ఛాలేంజ్‌ చేస్తున్నట్టుగా.

''అసలు నీతో మాటలు పెట్టుకోవటమే నేను చేసినతప్పు! ఇక ఆలస్యంచేయను!''

శర్వాణి ''రక్షించండి! రక్షించండి!'' అని అరుస్తుంటే గట్టిగా నోరు నొక్కిపట్టాడు.

శర్వాణి ప్రతిఘటిస్తూనే శక్తిమేరకు మూలగసాగింది.

స్వామిజీ ఊర్లోంచి నస్తూ ఎవరో ఆడపిల్ల మూలుగులా వినిపించి పొదవెనక్కి వెళ్ళి చూశారు. కిందపడి వున్నయువతి శీలం చెడిపోకముందే తను అడ్డుకోవాలి!కలబడి లాగేద్దామా అంటే అతనా దృఢంగా వున్నయువకుడు, పైగా కామాంధుడైవున్నాడు. అతన్ని ఆపగలిగే శక్తితనకిలేదు. క్షణం ఆలస్యం కాకుండా ఆమెరక్షించ బడాలి! ఎలా?ఎలా?

కొన్ని సమయాల్లో ఆపదల్లోనే మనస్సు చురుగ్గా పని చేస్తుంది. స్వామీజీకి మెరుపులా తంబురాని చివర పట్టుకొని దాని బుర్రతో బలంగా అతని తలమీద కొట్టాడు. అనుకున్నట్టుగానే అతను బాధతో ''అమ్మా!'' అంటూ రెండు చేతులతో తలపట్టుకొని పక్కకి ఒరిగిపోయాడు!వెంటనే స్వామిజీ అమ్మాయి చేతులందిస్తే పట్టుకొని పైకి లేపాడు, తేరిపార జూస్తే శర్వాణి!

''అమ్మా! నువ్వా! నీకా ఈ అన్యాయం జరగబోయింది''.

''స్వామిజీ! నా పాలిటి దైవమై నన్ను కాపాడారు!'' అంటూ కడుపులో దాగివున్న అవమానం, బాధల వల్ల భోరున ఏడ్చేసింది.

''ఆ దేవుడే నిన్ను కాపాడాడమ్మా! లేకుంటే సమయానికి నన్నే యిక్కడికి పంపటమేమిటి? ఊరుకోతల్లీ, ఊరుకో!'' అని శర్వాణిని సముదాయిస్తూ ఆ యువకుణ్ణి చూశారు. పక్కకి పడి నప్పటినుంచి అతనిలో చలనంలేదు. అనుమానం వచ్చి నాడి పట్టి చూశారు. ముక్కు దగ్గర వేలుంచి చూశారు. సందేహం లేదు. అతను చనిపోయాడు!

తననుకున్నది ఒకటి జరిగింది వేరొకటి! ఆ భగవంతుడు నా చేత ఒకరి శీలం రక్షింపజేశాడు మరొకరిని హత్య చేయించాడు. అంతా దేవుని లీల!

''అతను చనిపోయాడమ్మా!'' స్వామిజీ శర్వాణికి నిర్వికారంగా చెప్పారు.

భయాందోళనలతో బిగుసుకుపోతూ ''ఇప్పుడెలా స్వామీజీ'' అని అడిగింది.

'నీకేం భయంలేదు. నేనున్నాను. నాతో రా!'' అని తిన్నగా పోలీసు స్టేషనుకి తీసుకెళ్ళారు.

లోపలికి పోగానే ''నేనొక హత్య చేశాను! నన్ను మీ కస్టడీలోకి తీసుకోండి'' అని ఉపోద్ఘాతం లేకుండా చెప్పారు.

ఆ మాటలు విని ఉరుములు లేకుండా పిడుగు పడ్డట్టుగా ఉలిక్కిపడ్డారు పోలీసులు! వారికీ స్వామీజీ అంటే గౌరవ ప్రపత్తులున్నాయి. చీమకి కూడా అపకారం తలపెట్టరని తెలుసు!

''తమరు హత్య చేయటమేమటి స్వామీ! మమ్మల్ని నమ్మమంటారా?'' నమ్మకం కుదరకనే అడిగారు.

''దయచేసి నన్ను కూర్చోటానికి అనుమతిస్తారా?'' స్వామీజీ అడిగారు.

''సారీ స్వామీ! నమ్మరాని వార్త విన్న షాక్‌లో మర్యాదలు కూడా మర్చిపోయాం. మీరు కూర్చోటానికి మా అనుమతి కావాలా! దయచేసి ఈ కుర్చీలో కూర్చోండి స్వామీ!'' అని కుర్చీలు వేశారు.

స్వామీజీ కూర్చుని శర్వాణిని కూడ పక్క కుర్చీలో కూర్చోమన్నారు.

''స్వామీ తమరేమైనా తీసుకుంటారా?'' భక్తితోనే అడిగారు.

''మంచి నీళ్ళిప్పించండి, చాలు''

వాళ్ళు శ్రద్ధగా ఇద్దరికీ మంచినీళ్ళు తెచ్చియిచ్చారు

స్వామీజీ మంచినీళ్ళు తాగి... సంఘటన జరిగిన చోట తాను ఏం చూసిందీ, ఏం చేసిందీ పూసగుచ్చినట్టు చెప్పారు. ఈ అమ్మాయే బాధితురాలు దయచేసి ఈ అమ్మాయిని ఇంటికి పంపండి. అవసరమైనప్పుడు పిలిపించవచ్చు. నన్ను కస్టడీలోకి తీసుకోండి'' అని చెప్పారు.

వారి మాట మీద గౌరవంచేత శర్వాణిని ఇంటికి పంపారు పోలీసులు.

* * *

పోలీసులు పద్ధతి ప్రకారం కేసు నడిపి స్వామీజీని నేరస్థుడిగా కోర్టులో ప్రవేశపెట్టడం, బోనులో ఎక్కించటం, ప్రమాణం చేయించటం యధాక్రమంగా జరిగిపోయాయి.

''మీరు జయచంద్ర అనే యువకుడిని హత్యచేసినట్టుగా అభియోగం మోపబడింది! నిజమేనా?'' జడ్జిగారు ప్రశ్నించారు.

''మీ ప్రశ్నకు సమాధానం 'అవునులేదు' అని ఒక్క మాటలో కాకుండా కొన్ని విషయాలు చెప్పటానికి నన్ను అనుమతిస్తారా'' అని అడిగారు స్వామీజీ.

''చెప్పండి'' అన్నారు జడ్జిగారు.

''నాచేత 'అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను' అని ఒక పుస్తకం మీద చేయి పెట్టించి ప్రమాణం చేయించారు. అది ఏం పుస్తకమో నాకు తెలియదు. బహుశా భగవద్గీత' అయుంటుందని అనుకుంటాను. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునుడికి ఏం ఉపదేశించాడో తమకు తెలిసే వుంటుంది. ఫలితాన్ని తనకి వదిలేసి 'కర్మ'ని చేయమన్నారు. ఇంకా 'చంపేది నేనే. నీవు నిమిత్తమాత్రుడవు' అన్నాడు.

ఇదంతా నేనే నేరం చేయలేదనో, శిక్షనుంచి తప్పించుకుందామనో చెప్పటం లేదు. జరిగిన సంఘటనలో అక్కడే ప్రేక్షకుడిగా వున్న నా కర్తవ్య మేమిటి? నేను చేయవలసిన 'కర్మ' ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా కూడా ఉద్బోధించారు! 'సమస్త కర్మలు నాకర్పించి నన్ను శరణు వేడితే సమస్త పాపాలనుండి నిన్ను విముక్తుణ్ణి చేస్తా... నీవు విచారించకు అని నేను ఏ 'కర్మ' చేస్తే ఒక యువతి శీలం కాపాడబడుతుందో ఆ 'కర్మ'నే చేశాను! ఫలితంతో నాకు సంబంధం లేదు! మీరు విధించబోయే శిక్షతో కూడా నాకు సంబంధం లేదు. ఒక యువతి శీలం కాపాడటంతో నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. 'నే చేసిన 'కర్మ'ను ఆ శ్రీకృష్ణ పరమాత్మకే అర్పించి ఆయన శరణు వేడుతున్నాను! దట్సాల్‌, యువర్‌ ఆనర్‌!'' అని ముగించారు.

అమ్మాయికి గొడుగు

From July Vipula
అమ్మాయికి గొడుగు
ఎలాంగబమ్‌ దీన మణిసింగ్‌
మణిపురి కధ
అయ్యో! పారిపోతున్నాడు... పట్టుకోండి... పట్టుకోండి... దొంగ... దొంగ... అయ్యో! కాస్త పట్టుకోండయ్యా! దొంగ... దొంగ పారిపోతున్నాడు.

బజార్లోని జనమంతా అతడ్ని తరుముకొస్తున్నారు. మధ్యాహ్నం దాటింది. అరగంట క్రితం వరకు కురుస్తున్న వర్షం హఠాత్తుగా ఆగిపోయింది.

''ఫాయిరెన్‌'' (మణిపురి క్యాలండర్‌ లోని పదకొండవ నెల) మాసంలో కురిసే వర్షాన్ని తలపిస్తోంది. ఈ రోజు కురిసే వర్షం. బురద ఎక్కడ అంటుకుంటుందోనని జనాలు చాలా జాగ్రత్తగా అటు, ఇటు చూసుకుంటూ పరిగెత్తుతున్నారు. ఆ బురదలో పరిగెట్టటం కష్టంగా ఉన్నా అతగాడు వాళ్లకి అందకూడదనే దృఢ నిశ్చయంతో శరవేగంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. నిజం చెప్పాలంటే జన సందోహంతో నిండిపోయిన ఆ బజార్లో ఎవరికీ చిక్కకుండా పరిగెట్టాలంటే అతడికి కష్టంగానే ఉంది మరి. ఇంతా కష్ట పడ్డాక ఏం జరిగింది... పాపం సాలెగూటిలో చిక్కుకున్న ఈగలాగా జనాలకి చిక్కిపోయాడు.

అతగాడిని చూసిన ఎవరైనా అతను నగరానికి మొదటిసారి వచ్చాడని, పచ్చి పల్లెటూరి బైతని ఇట్టే చెప్పేస్తారు.

అందరూ అనుకున్నట్టుగానే అతను ఓ పల్లెటూరి రైతే. వచ్చిన పని త్వరగా ముగించుకొని గ్రామానికి వెళ్ళి పోవాలనీ అనుకున్నాడు. కాలం కలిసిరాక యిదిగో... ఇలా ఈ జనాలకే చిక్కిపోయాడు. పట్టణానికి వచ్చి మూడు రోజులైనా, ఉండటానికి గూడు కానీ, తినటానికి తిండి కానీ లేక తెగ అవస్థ పడ్డాడు. అన్నం తిని మూడు రోజులు కావస్తోంది. ఆ రోజు బజార్లోకి వచ్చే ముందు యేదో కాస్త ఎంగిలి పడ్డానని అనిపించుకున్నాడు. పొలంలో కాయ కష్టం చేసుకుని ముతక బియ్యంతో వండిన అన్నంలో మిరపకాయ నంజుకుని తిని, పంచ భక్ష్య పరమాన్నం తిన్నంత ఆనందపడిపోయే అమాయకుడు అతను.

తినటానికి కడుపు నిండా తిండి దొరక్క పోయినా, కాయ కష్టం చేసుకుంటూ పోవటం తప్పించి మరొక ఆలోచన లేని, తెలియని బండోడు. బాధని, దుఃఖాన్ని సైతం గుర్తించక పోవటం అతని ప్రత్యేకత అనుకోవాలా, లేక అమాయకత్వం అనుకోవాలా!!! ఓ రెండున్నర ఎకరాల భూమిని కామందు దగ్గర కూలీకి తీసుకొని ఒంటరిగానే కష్టపడే కష్టజీవి అతగాడు. అద్దెకు తెచ్చుకున్న ఎడ్లని క్షణమైనా కూర్చోనివ్వకుండా పొలాన్ని దున్నిస్తాడు. మళ్లీ మళ్ళీ ఎడ్లని అద్దెకి తెచ్చుకుని డబ్బు ఇచ్చే స్తోమత అతగాడి దగ్గరెక్కడుంది? ఒకవేళ తన పని అయిపోతే అడిగినా అడక్కపోయినా పక్క వాళ్ల పొలం కూడా దున్ని పెట్టే యితగాడిని ఏమనాలండీ!! ఇంతా కష్టపడి యింటికొస్తే, వంట కాలేదని తెలిసిందా... అంతే... పార పట్టుకుని తన చిన్న తోటలోని మొక్కలకు బళ్లు కట్టి నీళ్లు పెట్టటంలో నిమగ్నమై పోతాడు. తిండి మీదకన్నా అతగాడికి పనిమీద ధ్యాసెక్కువని అర్థమవుతోంది కదూ!!! ఇంత కష్టపడ్డా కూడ అతగాడు డబ్బులు బాగా సంపాదిస్తున్నాడా! అంటే... అది ఆ భగవంతుడికే తెలియాలి. కాయ కష్టం చేసుకోవటం తప్పిస్తే, చక్కగా నలుగురితో కలిసి తిరగాలని. వాళ్ళతో మాట్లాడాలని గానీ బహుశా అతను ఎన్నడూ అనుకోలేదనుకుందాం. ఒకవేళ ప్రయత్నం చేసినా అది అంతగా రాణించదని అతగాడి భయం. పోయిన 'పోయినూ' (మణిపురి క్యాలెండర్‌ లోని 7వ మాసం) మాసంలో పంట కాస్తా చేజారిపోయింది. కామందు అగ్గిమీద గుగ్గిలమవుతూ ''ఏంటిరాయిది? ఇలాగయితే నేను బతికినట్టే'' అన్నాడు.

''ఏం చేయను బాబాయ్‌! నేపడుతున్న కష్టాన్ని నువ్వు చూస్తూనే వున్నావుకదా ఇంతకన్న నన్నేం చేయమంటావు?''

''కిందిటిసారి యిదే పాట పాడావ్‌. నీతో కానప్పుడు నన్నెందుకురా ముంచుతావు. ఇప్పుడే కాదు నువ్వెప్పటికీ నా చేతిలో నాలుగు గింజలు కూడా రాల్చలేవు. నేను ఈ పొలం మీదేకదా ఆధారపడింది. 15 వేలు ఖర్చుపెడితే ఏ మిగిలింది. డబ్బు ఖర్చుపేట్టేది వెనకది, ముందు వేసుకుతినటానిటికా గాడిద కొడకా...

''లేదు, నన్ను నమ్ము బాబాయ్‌! వచ్చే ఏడాది ఈ లోటుని తప్పక తీరుస్తాను''

ఈ ఏడాది ఏం తిని బతకమంటావురా? గాలి భోజనం చేయమంటావా! నాకు పిల్లాజెల్లావున్నారు. వాళ్ళ కడుపులెలా నింపమంటావు? ఏదైనా అన్నానంటే చాలు, పెద్ద పెద్ద దణ్ణాలు పెడుతూ నా కాళ్ళమీద పడియేడుస్తావు. చచ్చే చావొచ్చిందిరా నాకు. ఈ మోటరు నీళ్ళతో నడుస్తుందనుకొంటున్నావా! ప్రతి సంవత్సరం ఏదో వంకతో ధాన్యం తగ్గిస్తూనే వస్తున్నావు. నీతో కాదుకానీ మరెక్కడైనా చూసుకో''.

మరెక్కడైన పని దొరకడం అంటే మాటలా! బతిమిలాడటం, కాళ్ళావేళ్ళాపడటం యివేమీ చేతగాని పరమశుంఠ మనవాడు. రెండుమూడు సంవత్సరాల లోటు ఒక్క ఏడాదితో తీరుస్తానని గట్టిగా చెప్పటం అయితే చెప్తున్నాడు. ఇతగాడిని ఆ భగవంతుడే రక్షించాలి.

తాగుడు అలవాటులేదు. అనవసరంగా డబ్బు ఖర్చుపెట్టడం, శరీర శ్రమకు వెనకాడడం యివేమీ చాతకావు. ఎత్తలేని బరువుని ఎత్తటం మూలానే ఈ రోజు ఇంత అనర్ధం జరిగింది. అన్నీ బాగావున్నరోజులో 15 కి బదులు 10 బస్తాలు సేద్యం చేసేవాడు. కానీ ఈ రోజు కలిసిరాక యిన్ని తిప్పలు పడాల్సి వస్తోంది. ఏడాది, ఏడాదిన్నర వ్యత్యాసంలో ఒకరి తరువాత ఒకరు పిల్లలు పుట్టుకు రావటంతో చూస్తుండగానే సంతానం ఎనిమిది మందైకుర్చున్నారు. అందులోను ఆరుగురు ఆడపిల్లలు, యిద్దరు మగపిల్లలు. వీళ్ళందరితో పాటు అస్తమానం ముక్కుతు, మూలుగుతూవుండే యిద్దరు ముసలివాళ్ళు. వైద్యుడి అవసరం లేకుండా పూటకూడా గడవదు.

కేవలం తిండి వరకే అయితే ఫరవాలేదు. బడికూడా యింటికీ దగ్గర్లోనే ఏడ్చింది. ఇక పిల్లల్ని బడికి పంపక తప్పదుగా! చదువు, తిండి రెండు ఒకేసారి కావాలంటే కష్టమే మరి వసంతంలో శ్రీపంచమి ఎందుకొస్తుంది? 'లమదా' (మణిపురి కాలెండర్‌లో చివరి నెల) మాసం గుట్టుచప్పుడు కాకుండా ఎందుకెళ్లిపోదో? వర్షం తన హద్దులో వుండకుండా కట్టలు తెంచుకుని ఎందుకు కురుస్తోందో? అదీ నగరంలోనో, గ్రామంలోని పోలాల్లోనో కాకుండా మాలతిపైనే ఎందుకు కురుస్తోంది? ఇవన్నీ అతగాడి బుర్రని తోలిచేసే ప్రశ్నలు.

మాలతి అతని పెద్దకూతురు. పక్క గ్రామంలోని స్కూల్లో చదువుకుంటోంది. తనకంటూ ఓ చిన్న గొడుగు కొనుక్కొవాలని ఎప్పటినుంచో ఆశ పడుతోంది. ఈ విషయమై తండ్రిదగ్గర చాలాసార్లు గొడవ పడింది కూడా. ఇదివరకటి లాగా యిప్పుడు స్నేహితురాలి గొడుగులో స్కూలుకెళ్లిరావటమో లేకపోతే వర్షం తగ్గేవరకు ఆగి వెళ్ళటమో చేయటంలేదు. వర్షం మరీ ఎక్కువగా పడుతుంటే స్కూలు మానేయటమో లేక తడుచుకుంటూ పోవటమో చేస్తోంది. తన స్నేహితురాళ్ళంతా చక్కగా గొడుగులో వెళుతుంటే ఆ పసి హృదయం పాపం బాధగా మూలిగేది. గొడవ చేస్తే గొడుగు వస్తుందన్న విషయం ఆ పసి మనసుకి తెలియక పోలేదు. నిజం చెప్పాలంటే అవసరమైనప్పుడు అలగడం, ఏడవడం, కోపగించుకోవడం సహజమే కదా! కోప తాపాలు మనిషి నైజంలో ఒక భాగమే అలాగే వాటిని ఉపయోగించుకునే హక్కు ప్రతి వారికీ ఉంది.

తండ్రి తన బిడ్డ కోరికని గుర్తించలేక పోతున్నాడనుకుంటే అది మీ అవివేకమే అవుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలపు మేఘాలు చూడగానే అతనిలో కొత్త ఆశలు చిగురిస్తాయి. కానీ తిండి గురించి పట్టించుకునే అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి గొడుగు విషయం పక్కకి పెట్టాల్సి వస్తోంది అతగాడికి.

దేవుడి దయవల్ల ఈసారి అన్నీ కలిసొచ్చాయి. బహుశా ఆమె కోరిక తీరే రోజు దగ్గరకొచ్చిందేమో!!! మాలతి తన పాత పుస్తకాలని అమ్మేసి కొంత సొమ్ము కూడబెట్టింది. దానికి తోడు పోయినసారి వర్షంలో బాగా తడిసి, ముద్దయి ఒణికి పోతూ, నీళ్ళు కారుకుంటూ వచ్చిన కూతుర్ని చూసి గొడుగు కొనాలనే నిశ్చయించుకొన్నాడు. అంతే కాదు అప్పు చేసైనా సరే గొడుగు కొనటానికి వెళ్లాలని తీర్మానించుకొన్నాడు. తన నిర్ణయాన్ని కూతురికీ చెప్పాడు. మాలతి ఆనందానికి హద్దులు లేకపోయాయి. కూని రాగాలు తీస్తూ పడుకోవటానికి వెళ్లిపోయింది. తెల్లారే లేచి స్నానం చేసి సంతోషంగా బస్సెక్కాడు.

''దీని ఖరీదెంత?''

''బాబయ్యా! 20 రూ.లు''

''అమ్మో! 20 రూపాయలా!!!''

''దీని బట్ట చూడండి ఎంత అందంగా ఉందో! పైగా గాజుతో చేసిన దీని పిడి చూస్తే దీని ఖరీదు తెలియటం లేదూ!

అతగాడు మారు మాట్లాడకుండా బయటికొచ్చేశాడు. పక్క కొట్లోకి వెళ్ళే ముందు ఓ సారి రొంటిన దాచుకున్న డబ్బును తడిమి చూసుకున్నాడు. డబ్బు మూట చేతికి బరువుగా తగలడంతో సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాడు.

చుట్టు పక్కల దుకాణాలలో సైతం గొడుగు ఖరీదు 25 రూ్హ్హ అనటంతో అతగాడికేం చేయాలో తోచలేదు. ఎలాగో అలా ధైర్యం కూడగట్టుకుని చివరికి మూలగా ఉన్న ఓ దుకాణంలోకి దూరి గొడుగు ఖరీదు అడిగాడు. ''25 రూపాయలు'' అని అనేలోగానే అతని మాటలకు అడ్డం పడుతూ ''కాస్త తక్కువ ధరలో చూపించవయ్యా'' అన్నాడు.

''తక్కువ ధరా! ఎంతలో చూపించమంటావు... 20 రూ... 15 రూ... అంటూ కొన్ని గొడుగులు చూపిస్తూ ''ఇందులో యేది కావాలో యేరుకో... అన్నాడు.

''ఇంతకన్నా తక్కువ... ధరలో లేవా?''

''లేవు''

''నీ దగ్గర కాకపోతే కనీసం చుట్టు పక్కల యెక్కడా తక్కువ ధరలో గొడుగు దొరకదా? అన్నాడు నిరుత్సాహంగా.

''దొరుకుతాయేమో ప్రయత్నించు''

అతని మాటల మీద విశ్వాసంతో పాపం అతనెంతో ప్రయత్నించాడు. కానీ ఫలితం శూన్యం. గొడుగులతో నిండిన దుకాణాలన్నీ దాదాపు అయిపోయాయి. ఆఖరికి ఓ మూలగా ఉన్న దుకాణంలో కొద్దిగా పాడైనా కాస్త నదరుగా ఉన్న గొడుగు అతని కంట పడింది. గొడుగు పిడి గాజుదై ఉండటమే కాకుండా లోపల విచ్చుకొన్న పువ్వు డిజైను ఉంది. లోపల దారాలు చెమ్కీతో చేసినవై ఉండటం మూలాన చక్కగా మెరుస్తూన్నాయి. పైగా ఖరీదు 8 రూ. 50 పైసలే! అతగాడి ఆనందానికి హద్దులు లేకపోయాయి.

అంత రద్దీలో దోవ చేసుకొంటూ పోతున్నప్పుడు కూడా గొడుగు చేతిలో ఉంది. కొత్త గొడుగు ఎక్కడ మాసిపోతుందోనని కాగితంలో చుట్టి పట్టుకున్నాడు. అతనికి ఒక్క సారిగా కూతురి ముఖం కనిపించింది. పిచ్చి తల్లి... ఎన్ని రోజులుగా ఎదురు చూస్తోందో దీని కోసం'' అనుకుంటూ వడి వడిగా బస్‌స్టాండ్‌ వేపుగా నడిచాడు. నడుస్తున్నంతసేపు సంతోషంతో వెలిగిపోయే కూతురి ముఖమే కనిపిస్తోంది అతగాడికి. రెండు మూడు రోజులదాకా చెప్పిన పనల్లా చేస్తుంది. తల్లిని నిర్లక్ష్యం చేయదు. నేను వెళ్లేసరికి గుమ్మంలోనే నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబోలు...

హఠాత్తుగా ఆలోచనల లోంచి బయటికొచ్చిన అతనికి గొడుగు కనిపించలేదు. అతనికి ఒక్కసారిగా కళ్ళు చీకట్లో కమ్మినట్టయ్యాయి. ''అయ్యో! నా గొడుగు! నా గొడుగు! అమ్మో!... మీరుగాని నా గొడుగుని చూశారా?''

''లేదు నాయనా! శనగలు కొంటూ నువ్వు రుమాల్లోంచి డబ్బులు తీయటం మాత్రమే చూశాను''.

''అవును... డబ్బు తీసిన మాట వాస్తవమే కానీ... గొడుగు యిదిగో... యిక్కడే... ఈ పక్కకే పెట్టాను... కొత్తది... చిన్నది...''

''నాకేం తెలియదు''.

కర్మగాలీ యెవరైనా ఎత్తుకుపోయారా! ఓరి భగవంతుడా... ఏం చేయాలి?''

గొడుగు పోయిందని అతగాడికి అర్థం అయిపోయింది. ఎవరినడగాలో, ఏం చేయాలో తోచటం లేదు. బాధతో పెదవులు కొరుక్కున్నాడు చేసేది లేక బస్టాండ్‌ వదిలేసి బజారు వేపుగా కదిలాడు.
* * *
''నీ పేరేమిటి?''

''నిజంగా నేనే తీశాను''.

''నీ పేరేవిటిరా? దొంగ వెధవా... గట్టిగా దవడ పగిలేలా కొట్టాడు. జవాబు చెప్పేలోగా ప్రశ్నల పరంపరలో అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు ఆ పోలీసు. ప్రతి ప్రశ్నకి ముందు వెనక లారీ౮ దెబ్బలతో ఒళ్లు హూనం అయిపోతోంది. దెబ్బలకి కళ్లు చీకట్లు కమ్ముతున్నాయి. భరించలేక అతను మోకాళ్ల మీద కూర్చున్నాడు. జేబులో చిరిగిన కాగితంలోంచి శనగ్గింజలు చుట్టు పక్కల దొర్లాయి.

''ఇవి ఎవరి దగ్గర కొట్తేశావురా దొంగ...'' అంటూ ఠపేల్‌ మని ఎడమ కాలి మోకాలి చిప్ప మీద లారీ౮ దెబ్బ బలంగా పడింది. దెబ్బలు నొప్పికి నడుమ అంతరాత్మలోంచి ఓ నవ్వు బయటికెగసింది. కళ్లల్లోంచి కారుతున్న నీళ్లని చేతులతో తుడుచుకుంటూ

''నన్ను... నన్ను... తోమాల్‌ అంటారు'' అంటూ జవాబిచ్చాడు.

''ఎక్కడుంటావు?''

... గ్రామంలో...
అనువాదం: డా్హ్హ ఆర్‌. రాజి

Vipula Home | Eenadu Home | eMail This Article

మృగతృష్ణ

From July Vipula

మృగతృష్ణ
దేవవ్రతన్‌
తమిళకధ
''ప్లస్‌ టూ'' పరీక్షలు పూర్తియైున రోజు సాయంత్రం ముత్తు తన స్కూలు హెడ్‌మాస్టర్‌ అనంతకృష్ణన్‌ గారిని కలవడానికి వారి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆయన తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించారు. ఆరు పదులు దగ్గర పడిన వయసు. ఈ కాలపు హంగులేవీ ఆయనలో అగుపించలేదు. పంచ, కండువా, నుదుట విభూతి అంతే! అతి సాధారణమైన వేషధారణ. ఆయన కన్నులలో ఏదో మెరుపు!

గేటు తెరుచుకుని లోపల అడుగుపెట్టిన ముత్తు ''నమస్కారం సార్‌!'' అన్నాడు.

తలెత్తి చూచిన అనంతకృష్ణన్‌గారి ముఖం వికసించింది.

''రాముత్తు...! లోపలకురా...!'' అని ఆప్యాయంగా పిలిచారు.

హెడ్‌మాస్టర్‌ గారి ఇల్లు వారిలాగానే మరీ ఆధునాతనంగా కాక, మరీ పాతబడినదిగా కాక మధ్యతరహాగా ఉంది.

''ముత్తూ! పరీక్షలు ఎలా రాశావు...? నీకు తృప్తిగా ఉందా...?'' అని అడిగారు అనంతకృష్ణన్‌

''అవును సార్‌...! బాగా రాశాను. అంతా మీ ఆశీర్వాదమే సార్‌...!''

వరండాలోని కుర్చీలో ముత్తును కూర్చోమని చెప్పి తానూ ఎదురుగా కూర్చున్నారు.

''నీ వల్ల ఒకనాడు మన స్కూలుకే పేరు ప్రతిష్ఠలు రాబోతాయి...'' అన్నారు.

ముత్తు చిరునవ్వు నవ్వుతూ... ''నాకా అదృష్టం ఉందో లేదో తెలియదు సార్‌...! కాని అలా జరిగితే అందుకు కారకులు మాత్రం మీరే సార్‌...!''

పదిహేడేళ్ల ముత్త్తు వయసుకు తగినట్టుగా ఎదిగాడు. దట్టమైన క్రాపు, నూనూగు మీసాలు, చామనఛాయ, అయినా ముఖంలో కళ ఉట్టి పడుతోంది.

''సరే... ఇకపైన ఏం చదవాలని అనుకుంటున్నావూ...? నీకు వచ్చే మార్కులకు ఇంజినీరింగ్‌లోనో, మెడిసిన్‌లోనో సీటు దొరకడం ఖాయం...''

ముత్తు ఏదో ఆలోచిస్తూ వారివైపే చూడసాగాడు.

''నాన్నగారికి మునుపటిలా పొలంలో పని చేయడానికి చేతకావటం లేదు సార్‌...! అదే నాకు చింతగా ఉంది...'' ముత్తు కంఠంలో బాధ ధ్వనించింది.

* * *

అనంతకృష్ణన్‌ 'పూంకుళం'లోని ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించి చాలాకాలం గడిచిపోయింది. తంజావూరు జిల్లాలో పూంకుళంలో పుట్టి, అక్కడే చదివి మొదట అధ్యాపకునిగా ఆ పిమ్మట హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. తన యిన్నేళ్ల అనుభవంలో ఎంతోమంది విద్యార్థులను చూశారు.

తన వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు ప్రస్తుతం దేశంలోను, విదేశాలలోను, పెద్దపెద్ద పదువులలో ఉన్నారు. బడిలో చదివే రోజులలో అంతగా బుద్ధిమంతులు కాని వారు సహితం పట్టణాలకు వెళ్లి తెలివితేటలతో బాగా డబ్బు సంపాదించిన వారి వైనం కూడా చూసారు.

కాని ఈ మధ్య కాలంలో కొన్ని విషయాలు ఆయన మనస్సును అమితంగా బాధిస్తున్నాయి.

'పూంకుళం' కావేరి డెల్టాలో బాగా సాగుబడి అయ్యే గ్రామం. ఈ మధ్య అక్కడ చాలామంది భూమిగల వారు తమ పిల్లలను ఆడామగా అనే తేడా లేకుండా పైచదువులకని పట్టణం పంపేసి, తమ పొలాలను సైతం అమ్మేసి, తాము కూడా అక్కడకు వెళ్లి స్థిరపడటం అనంతకృష్ణన్‌ మనసును బాగా కలిచివేసింది. కరువు కాలంలో సొంత పిల్లలను అమ్ముకున్నట్లు, భూములను అమ్మటం, వాటిని కొన్నవారు కూడా మెల్లమెల్లగా సాగుబడి చేయటం తగ్గించి ''రియల్‌ ఎస్టేట్‌'' పేరుతో వాటిని అమ్మి డబ్బు గడించటం ఆయన్ని ఎక్కువ బాధించింది.

గత సంవత్సరం కూడా వారి స్కూల్లో అతి తక్కువ మార్కులతో పాసైన 'అరసు' అనే విద్యార్థి కొత్తగా ప్రారంభించబడిన ''ఇంజనీరింగ్‌'' కాలేజిలో ''పేమెంట్‌ సీటు'' కోసం పొలం అమ్మి లక్ష రూపాయలిచ్చి చేరాడు. ఆ అబ్బాయి తండ్రితో మాట్లాడినప్పుడు అనంతకృష్ణన్‌ ఆవిషయమై ప్రస్తావించారు.

''ఎందుకయ్యా! బాగా పండే నీ పొలాన్ని అమ్మి మీ అబ్బాయిని ఇంజినీరింగ్‌ చదవడానికి పంపుతున్నావూ...? నీ వ్యవసాయాన్నే అతనూ చేయవచ్చుకదా...?'' అని మాటవరసకన్నారు. అది విన్న 'అరసు' తండ్రి ఆయనపై విరుచుకుపడ్డాడు

''ఏం...? అయ్యవారూ...? ఇలా మాట్లాడుతున్నారు...? చదువుకోక నేను పాడైపోయాను. మా అబ్బాయికి కూడా అదే గతి పట్టాలా...? మీ పిల్లలే పెద్దపెద్ద చదువులు చదవాలా...? మేమంతా చదువుకోకూడదా... లేక చదవలేమా...? మీకైతే పిల్లాజల్లా లేరు. ఇప్పుడు ఎంతమంది కంప్యూటర్‌ చదువులు చదివి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారో తెలుసా? మీ బుద్ధులు మారవు. మీరొక్కరే పైకి రావాలి. ఇతర జాతులవారు అభివృద్ధిలోకి రాకూడదనే మీ కోరిక... అంతేగా...'' ఆవేశంతో అరవసాగాడు.

అనంతకృష్ణన్‌ తన తప్పిదాన్ని గ్రహించి మౌనంగా వెనక్కి మళ్ళారు. అమాయకుడైన ఆ రైతుతో ''చాలామంది ఇంజినీర్లు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారని కంప్యూటర్లు మూలపడిపోతున్నాయని'' చెప్పినా అతనికి అర్థంకాదు.

కాని ముత్తు తండ్రి ఆశపడటంలో న్యాయముంది. ముత్తు చాలా బుద్ధిమంతుడు. తెలివైనవాడు. మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థి. అతను ఇంజినీరింగ్‌ కోర్సులో చేరటం ఏమంత కష్టమైన పనికాదు. కాని అతన్ని చదివించడానికి అతని తండ్రి ఆర్థికస్థోమత సరిపోతుందా అన్నదే సందేహం. వాళ్ళకు ఒక యిల్లు, కొద్దిపాటి పొలమూ వున్నాయి. ముత్తుకు ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. అక్కకు పెళ్ళై అత్తవారింట్లో కుంభకోణంలో ఉంటోంది. ముత్తు తమ్ముడు ఆరోక్లాసో, ఏడోక్లాసో చదువుతున్నాడు. ముత్తులా తెలివైన వాడు కాడు. ముత్తు బాగా చదివి కుటుంబాన్ని పోషించాలి.

* * *

చైత్రమాసపు ఎండలు మండిపోతున్నాయి. ఆ మరుసటి రోజూ ప్లస్‌ టూ పరీక్షా ఫలితాలు వెలువడనున్నాయి.

ఆ రాత్రి అనంతకృష్ణన్‌ అటు నిద్రరాక యిటు మేలుకోలేక ఏదో స్వప్నావస్థలో ఉన్నారు.

యింటి ఫోను మోగింది. ఫోను అందుకున్న ఆయన భార్య ''ఫోను మీకే''... అని రిసీవర్‌ అందించింది. అనంతకృష్ణన్‌

''అవును... నేను పూంకుళం హైస్కూలు హెడ్‌మార్టర్‌నే మాట్లాడుతున్నాను'' అన్నారు.

ఒక్క నిమిషం తరువాత ఆయన ముఖం సంతోషంతో వికసించింది.

''ఓహో... అలాగా...! ఎంతటి శుభవార్త! నిజంగానా... అవును చాలా బుద్ధిమంతుడు... తప్పకుండా రండి...'' అన్నారు.

ఫోను కిందపెట్టి ''అంబుజం! ముత్తు ప్లస్‌ టూ పరీక్షలో మొత్తం తమిళనాడులోనే మొదటి ర్యాంకు సంపాదించాడట... ఎంతటి సంతోషకరమైన వార్త...! ఇప్పుడే వెళ్ళి అతనికి తెలియజేయాలి... రేపు పత్రికల వాళ్ళు అతన్ని చూడడానికి వస్తారట... మన ఊరికి ఎంతటి గౌరవం దక్కింది...!'' అనియింకా ఏదోదో మాట్లాడుతూ షర్టు తొడుక్కొని వడివడిగా ముత్తు యింటివైపు అడుగులు వేశారు.

ఎదురుగా పదడుగుల దూరంలో సైకిల్‌పై వారియింటి వైపే వస్తున్న ముత్తు వారిని చూచి వెంటనే సైకిల్‌ దిగాడు.

''అరే... నీకు నూరేళ్ళాయుష్షు... నిన్ను చూడడానికే బయలుదేరాను. నీవు తమిళనాడు అంతటిలో మొదటి ర్యాంకులో పాసైయ్యావు ముత్తు...!'' అంటూ అతన్ని వాటేసుకున్నారు.

''సార్‌...! నేను మీతో ఆరోజు చెప్పిన విషయమై మాట్లాడాలని మీ యింటికే వస్తున్నాను. రండిసార్‌...! మా యింటికివెళ్దాం...'' అని సైకిల్‌ తోసుకుంటూ వారివెంట నడవసాగాడు ముత్తు''.

మరుసటి రోజు అన్ని వార్తాపత్రికలలోను, టీవీలోను ముత్తు ఫొటో, అతని ఇంటర్వ్యూ ప్రత్యేకంగా చోటుచేసుకుని అందరిని ఆకర్షించింది.

''రాష్ట్రంలోనే మొట్టమొదటి ర్యాంక్‌ సాధించిన విద్యార్థి వ్యవసాయం చేసుకుంటూ తన గ్రామమందే ఉండదలచాడు. ఇంజినీరింగ్‌ గాని డాక్టరుకు గాని చదివే కోరిక లేదు'' అని పెద్దపెద్ద అక్షరాలతో వార్త వెలువడింది. ముత్తు ఇంటర్వ్యూలో చక్కగా స్పష్టంగా

''మొదటి ర్యాంక్‌ వచ్చిన వాళ్ళందరూ 'ఇంజినీరింగ్‌; మెడిసన్‌ చదువులే చదవాలా...? నాకు ఆ కోరిక లేదు. ఈ పూంకుళం గ్రామంలోను, యింకా యితర అనేక గ్రామాల నుండి యువకులు, గుంపులు గుంపులుగా ఇంజినీరింగ్‌ అనే మాయా మరీచికాన్ని వెంటాడుతున్నారు. నేను నా కుటుంబానికి సొంతమైన పొలాన్ని, ఇంటిని, ఈ మనుషులను వదలి ఆ మాయవేటలో పడదలచుకోలేదు. నేను తంజావూరు కాలేజీలో లెక్కల్లో పట్టాపుచ్చుకుని ఈ పూంకుళం బడిలోనే ఉపాధ్యాయునిగా పనిచేయాలని ఆశ పడుతున్నాను. నా గ్రామం, నా భూమి ఇవే నాకు ముఖ్యం. బుద్ధిమంతులైన యువకులందరూ గ్రామాలను వదలి, ఈ దేశాన్ని వదలివెళ్తూ ఉంటే ప్రకృతి సహజమైన ఈ గ్రామాలు ఎవరి కోసం...? అలా చదివేవాళ్లని చదవనీయండి. కానీ వెయ్యి మందిలో ఒక్కరైనా నాలాగా ఆలోచిస్తే తప్ప ఈ గ్రామాలు బాగుపడవు. వ్యవసాయం వృధాపోదు...'' అంటూ తన అభిప్రాయం చెప్పారు.

ముత్తు మాటలు ఎంతటి ప్రశంసలనందుకున్నాయో అంతటి విమర్శలకు గురిఅయ్యాయి.

ముత్తు తండ్రి నల్లశివం అనంతకృష్ణన్‌తో ''ఏం సార్‌...! ఈ అబ్బాయి యిలా మాట్లాడాడు. ఇతను పెద్ద చదువులు చదివి నాలుగు రాళ్లు సంపాదిస్తే కదా మీకు గౌరవప్రదంగా ఉంటుంది...?'' అని ఎన్నోసార్లు తన ఆవేదనను వెలిబుచ్చారు.

''ఎందుకు నాన్నా..! అలా అనుకుంటారు? నాలుగు డబ్బుల కంటే మన పొలం, మన మనుషుల బాంధవ్యం గొప్పవికావా..? అదీకాక మనసు తృప్తి అని ఒకటుంది కాదా? నేను హెడ్‌మాస్టర్‌ గారితో సంప్రదించి వారి అనుమతితోనే పత్రికల వారికి అలాచెప్పాను. భారతదేశపు ప్రాణం గ్రామాలలో ఉందన్నారు గాంధీజీ! కాని ఈ వేళ మనం ఆ ప్రాణాన్ని లక్ష్యపెట్తున్నామా...? ఇప్పుడు ఎంతమంది ఇంజనీరింగ్‌ పట్టభద్రులు ఉద్యోగాలు లేకుండా ఉన్నారో తెలుసా...? ఆ గుంపులో నేనూ ఒకడినై ఉండిపోవాలా...? ఇంజినీరింగ్‌ చదువులు, విదేశాలలో ఉద్యోగ అవకాశాలు యివే చదువుకున్న బుద్ధిమంతుల భవిష్యత్తా...? రాజకీయాలు బురదవంటివని చదువుకున్న వారందరూ దానికి దూరంగా ఉండబట్టే నేడు రాజకీయంరంగం యింతటి దుస్థితికి లోనైంది. అదే విధంగా వ్యవసాయం, గ్రామంఇవన్నీ ఒద్దని చదువుకున్న యువకులందరూ అనుకోవడం మొదలు పెడితే ఈ గ్రామాలన్ని ఎవరి కోసం...? నాకు ఈ పూంకుళం గ్రామం, దాని మట్టి, వ్యవసాయం యివే ముఖ్యం. కంప్యూటర్‌, అధునాతన వసతులు రోజురోజుకు మార్పులు చెందుతుంటాయి. కాని ఆకలి, అన్నం యివి రెండూ మారవు. అన్నం వద్దని చెప్పగలమా? నా ఈ గ్రామం వ్యవపాయ రంగంలో ప్రధమ స్థానాన్ని పొందేందుకు నేను కృషి చేస్తాను. అదే నా ధ్యేయం. నా భవిష్యత్తు ఈ గ్రామంతోనే ముడిపడిఉంది...''

అంతటి దృఢ సంకల్పంతో మాట్లాడుతున్న ఆ యువకుణ్ణి అనంతకృష్ణన్‌ ఆశ్చర్యంతో చూడసాగారు.

తండ్రికి ''ప్రణవ'' మంత్రాన్ని ఉపదేశించిన సుబ్రహ్మణ్యస్వామిని గురించి చెప్తుంటారు. ఇంతటి సూక్ష్మ బుద్ధిని ఈ బాలునికి ప్రసాదించినది ఎవరు? ఆ భగవంతుడేగా...?

''విచారించకు నల్లశివం...! మీ అబ్బాయి వల్ల ఇప్పుడు ఈ బడికి, ఈ ఊరికి పేరు ప్రతిష్టలు కలిగాయి. భవిష్యత్తులో ఈ గ్రామం, ఈ ప్రజలు ఇతని వల్ల గౌరవాన్వితులౌతారు. నాకా నమ్మకం ఉంది'' అన్నారు అనంతకృష్ణన్‌.

చైత్రమాసపు వేడి తగ్గడానికా అన్నట్లు ఉరుములు మెరుపులతో హోరుగా వర్షం కురవటం మొదలైంది. ఈ మట్టి వాసన పూల సుగంధంలా నలుదిశలా వ్యాపించింది.

''రండి నాన్నగారు...! ఇంటికి వెళ్దాం. నాకు ఈ మట్టి వాసనను ఆస్వాదిస్తూ వానలో తడుస్తూ నడవాలని ఉంది. వస్తాను సార్‌...!'' అని చెప్పి తండ్రి చేయి పట్టుకుని వర్షంలో తడుస్తూ ఇంటివైపు నడక సాగించాడు ముత్తు.
అనువాదం: ఆర్‌.జయశ్రీ కాసీకర్‌